జగన్ మీడియా ఇన్చార్జ్  పూడి శ్రీహరిని మళ్లీ ఎందుకు అరెస్ట్ చేశారు?
x
జగన్ తో పూడి శ్రీహరి (ఫైల్ ఫోటో)

జగన్ మీడియా ఇన్చార్జ్ పూడి శ్రీహరిని మళ్లీ ఎందుకు అరెస్ట్ చేశారు?

బెంగళూరు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లే సమయంలో పోలీసులు శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు


వైసీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని, కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్‌కు దారితీసిన నేపథ్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను మార్ఫింగ్ చేసి ఆయన చేతిలో కత్తి పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో శ్రీహరి రెండో నిందితుడిగా (A2) ఉన్నారు. ఈ వ్యవహారంపై గతంలోనే హైకోర్టులో వాదనలు జరిగాయి. గతంలో ఆయన రిమాండ్‌ను కుప్పం కోర్టు తిరస్కరించగా, ఆ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
దీనిపై శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో చట్టపరమైన ప్రక్రియలో భాగంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు శ్రీహరిని రోజంతా విచారించారు. ముఖ్యమంత్రిపై అనుచిత పోస్టులు పెట్టమని ఎవరు ఆదేశించారు? ఎందుకు పెట్టారు? ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? అనే కోణంలో పోలీసులు ప్రశ్నలు కురిపించారు. అయితే, ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఆయన బదులిచ్చినట్లు సమాచారం.
హైకోర్టులో అత్యవసర విచారణ కోరిన పొన్నవోలు
శ్రీహరి అరెస్ట్ అక్రమమని పేర్కొంటూ ఆయన తరఫు న్యాయవాది, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పోలీసులు శ్రీహరిని అరెస్ట్ చేశారని, దీనిపై వెంటనే అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ సుభేందు సామంత ధర్మాసనాన్ని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన న్యాయమూర్తి, ఈ కేసుపై గురువారం సాయంత్రం విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
శ్రీహరి అరెస్ట్ వార్త తెలియగానే వైసీపీ ఎమ్మెల్సీ భరత్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుప్పం స్టేషన్‌కు చేరుకుని ఆయనతో మాట్లాడారు. రాష్ట్రంలోని పలు ఇతర పోలీస్ స్టేషన్లలో కూడా శ్రీహరిపై కేసులు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు తదుపరి పరిణామాలు హైకోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్నాయి.
Read More
Next Story