
గూగుల్-అదానీ డేటా సెంటర్‌పై రాయితీల వర్షమా?
విశాఖ ప్రజల గొంతు కొయ్యవద్దని ప్రభుత్వానికి మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ రాశారు.
విశాఖ-అనకాపల్లి ప్రాంతంలో అదానీ గ్రూప్‌తో కలిసి గూగుల్ కంపెనీ ఏర్పాటు చేయనున్న 1000 మెగావాట్ల AI డేటా సెంటర్ ప్రాజెక్టుపై పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఈఏఎస్ శర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల మేర రాయితీలు కల్పిస్తోందని, ఇది ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడమేనని ఆయన విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన ఒక లేఖ రాశారు.
నీటి సమస్య.. విశాఖ ప్రజల గొంతు కొయ్యవద్దు
గూగుల్ డేటా సెంటర్ల నిర్వహణకు రోజుకు సగటున 2.7 నుంచి 4.1 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుందని శర్మ పేర్కొన్నారు. విశాఖలో ఇప్పటికే నీటి కొరత ఉందని, భవిష్యత్తులో పోలవరం నీరు వచ్చినా ప్రజల అవసరాలకు ఇబ్బంది కలగవచ్చని ఆయన హెచ్చరించారు. ప్రజలకు అందాల్సిన నీటిని 10% రాయితీతో గూగుల్ కంపెనీకి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం బాధాకరమన్నారు. గూగుల్ తన 100% నీటి అవసరాలను సొంతంగా డీశాలినేషన్ ప్లాంట్ల (సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్రక్రియ) ద్వారానే తీర్చుకోవాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు.
భూసేకరణ, లీజ్ నిబంధనల ఉల్లంఘన
తరులవాడ, ముడసర్లోవ, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల భూమిని 25% రాయితీతో గూగుల్ కు కట్టబెట్టడాన్ని శర్మ తప్పుబట్టారు. రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం ఈ భూముల ధర 2,300 కోట్ల రూపాయల పైనే ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల (BSO 24) ప్రకారం ఏడాదికి కనీసంరూ. 230 కోట్ల రూపాయల లీజ్ రెంట్ వసూలు చేయాలని సూచించారు. రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు.
రాయితీల వర్షం ..ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం
అంచనాల ప్రకారం.. స్టాంప్ డ్యూటీ మినహాయింపు, GST రీయింబర్స్‌మెంట్, విద్యుత్ చార్జీల్లో రాయితీ వంటివి కలిపితే మొత్తం రాయితీలు 22,000 కోట్ల రూపాయలు దాటుతున్నాయని శర్మ లెక్కగట్టారు. లక్షల కోట్ల లాభాలు గడించే గూగుల్ వంటి కంపెనీలకు ఇన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దానం చేయడం కంటే, ఆ నిధులను ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అని ఆయన సూచించారు.
స్థానిక యువతకు 75% ఉద్యోగాల గ్యారెంటీ
రాష్ట్రంలో అమలులో ఉన్న స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం-2019 ప్రకారం గూగుల్ డేటా సెంటర్‌లో కనీసం 75% ఉద్యోగాలు స్థానిక యువతకే ఇవ్వాలని శర్మ డిమాండ్ చేశారు. కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, స్థానికులకు అవసరమైన శిక్షణ సౌకర్యాలను గూగుల్ కంపెనీయే స్వయంగా కల్పించేలా ప్రభుత్వం రాతపూర్వక హామీ తీసుకోవాలని ముఖ్యమంత్రికి విన్నవించారు.
డేటా భద్రత, ఆర్థిక నష్టం
గూగుల్ అమెరికా భద్రతా దళాలతో కలిసి పనిచేస్తుందని, అమెరికాలోని 'CLOUD' చట్టం ప్రకారం అక్కడి డేటా విదేశీ శక్తులకు అందుబాటులో ఉండే ప్రమాదం ఉందని శర్మ హెచ్చరించారు. అలాగే, గూగుల్ ను డీమ్డ్ డిస్కామ్ గా గుర్తించడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలైన APEPDCL , APTRANSCOలు భారీగా ఆదాయాన్ని కోల్పోతాయని, ఇది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆటంకమని ఆందోళన వ్యక్తం చేశారు. పనులు ప్రారంభించే ముందే ఈ అంశాలపై స్పష్టత ఇచ్చి విశాఖ ప్రజల ప్రయోజనాలను కాపాడాలని ఈఏఎస్ శర్మ తన లేఖలో ప్రభుత్వాన్ని కోరారు.
Next Story

