
విశాఖ పరిశ్రమల్లో మరణ మృదంగం ఆగదా?
ఉద్యోగం, ఉపాధినిస్తాయనుకున్న ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమలు కార్మికులు, ఉద్యోగుల ఊపిరిని తీసేస్తున్నాయి.
`విశాఖ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆ కుటుంబీకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇకపై ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు..` ఇలాంటి ప్రకటనలు, హామీలు విశాఖ వాసులు కొన్ని దశాబ్దాలుగా వింటూనే ఉన్నారు. ఫార్మా సహా పలు పరిశ్రమల్లో అదే పనిగా జరుగుతున్న ప్రమాదాలతో వీటిని వినడానికి అలవాటు పడిపోయారు. తరచూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఫార్మా సిటీలోనూ, సెజ్‌ల్లోనూ, స్టీల్ ప్లాంటులోనూ, హెచ్‌పీసీఎల్ సహా పలు కర్మాగారాల్లో ప్రమాదాలు జరగడం, పలువురు మృత్యువాత పడడం, పెద్ద సంఖ్యలో తీవ్రంగా గాయపడడం నిత్య కృత్యంగా మారిపోయింది. గతంలో ఏదైనా పరిశ్రమలో ప్రమాదం జరిగిందంటూ అమ్మో! అంటూ ఉలిక్కిపడే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వాలు, యాజమాన్యాల నిర్లక్ష్యం పుణ్యమాని ఇలాంటి ప్రాణాంతక ప్రమాద వార్తలకు ఈ ప్రాంత వాసులు అలవాటు పడిపోయారు. ఈనెల 8న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా మంగళవారం ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీ కంపెనీలో సంభవించిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థకు గురైన వారిని తరలిస్తున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది
ఎనిమిది మందిని పొట్టన బెట్టుకున్న స్టీల్ ప్లాంట్ ఎస్ ఎం ఎస్-1లో ప్రమాద దృశ్యం
ఆయా పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారి కుటుంబాలకు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వాలు, యాజమాన్యాలు నష్ట పరిహారాన్ని ప్రకటిస్తున్నాయి. కొన్నాళ్లకు మళ్లీ ప్రమాదాలు షరా మామూలై పోతున్నాయి. ఎవరైనా చనిపోతే మళ్లీ అదే తంతు. అంతేతప్ప మరోసారి అటువంటి ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవడంపై శ్రద్ధ చూపడం లేదు. భద్రతా ప్రమాణాలపై సీరియస్‌నెస్ కనిపించడం లేదు. సేఫ్టీ ఆడిట్ సక్రమంగా జరగడం లేదు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సరైన తనిఖీ వ్యవస్థ లేదు. అన్నిటికీ మించి ప్రమాదాలకు కారకులపై క్రిమినల్ చర్యలు చేపట్టడం లేదు. ఇవన్నీ వెరసి ఇక్కడి పరిశ్రమల్లో ప్రమాదాలకు అడ్డు కట్ట పడడం లేదు. ప్రమాదం జరిగితే తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయం ఉండడం లేదు. ఇవన్నీ వెరసి ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాలు ఆగడం లేదు.
హెచ్ పీ సీ ఎల్‌లో అగ్ని ప్రమాద దృశ్యం (ఫైల్)
జరిగిన వెంటనే ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి వరకు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసేస్తుంటారు. మీడియాలో ఊదర గొట్టేస్తుంటారు. పెద్ద ప్రమాదమైతే వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని అభయమిస్తుంటారు. ఆపై తమ పని అయిందన్నట్టు వ్యవహరిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే .. ఎవరికైనా అదే అవగతమవుతుంది. పలు సందర్భాల్లో ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారికి పూర్తి స్థాయిలో పరిహారం, కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇవ్వని ఘటనలున్నాయి. కారుణ్య నియామకాల కోసం నేటికీ తిరుగుతున్న వారున్నారు.
ప్రమాదాలు , మరణాల్లో మచ్చుకు కొన్ని..
ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో జరిగిన భారీ ప్రమాదాలు కొన్ని వందల మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఆయా కుటుంబాలను రోడ్డున పడేశాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే ..
+ 2013 ఆగస్టు 23న విశాఖ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది దుర్మరణం చెందారు.
+ అదే ఏడాది నక్కపల్లి సమీపంలోని హెటిరో డ్రగ్స్ కంపెనీలో పేలుడు సంభవించి ఇద్దరు చనిపోయారు.
+ 2013 జూన్ 13న విశాఖ ఉక్కు కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఏకంగా 19 మంది మృత్యువాత పడ్డారు.
+ 2015 సెప్టెంబర్ 28న సైనార్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు జరిగి ఇద్దరు మరణించారు.
+ 2016లో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని శ్రీకర్ లేబరేటరీస్‌లో అమోనియా లీకై ఒక కార్మికుడు మరణించాడు.
+ 2017 మే నెలలో అజికో బయో ఫోర్ ఇండియా లిమిటెడ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వర్కర్లు అశువులు బాశారు.
+ 2020 మే 7న విశాఖ శివారు వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టెరైన్ గ్యాస్ లీకై 12 మంది గ్రామస్తులు మృతి చెందారు. పరిసర గ్రామాల్లో 500 మందికి పైగా ప్రజలు తీవ్ర అస్వస్థకు గురయ్యారు.
+ 2020 జులై ఒకటిన ఫార్మా సిటీలోని సైనార్ లైఫ్ సైన్సెస్‌లో హైడ్రోజన్ సల్ఫైడ్ లీకై ఇద్దరు చనిపోయారు.
+ 2020లో హిందుస్థాన్ షిప్‌యార్డులో క్రేన్ విరిగిపడి 11 మంది వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు.
+ 2022లో ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మరణించారు.
+ 2023 జూన్ 30న అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మా యూనిట్‌లో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
+ 2024 ఏప్రిల్ 7న అల్కాలీ మెటల్స్ లిమిటెడ్‌లో మిథైల్ నైట్రేట్ లీకైన ఘటనలో ఇద్దరు చనిపోయారు.
+ 2024 ఆగస్టు 21న అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్డాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మాస్యూటికల్స్‌లో పేలుడు సంభవించి 18 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మంది గాయపడ్డారు.
+ 2026 జూన్ 8న విశాఖ స్టీల్ ప్లాంటు ఎస్ ఎం ఎస్-1లో జరిగిన ప్రమాదంలో పది మంది కార్మికులు సజీవ దహనమయ్యారు.
+ 2026 జూన్ 23న ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఒక్క ఫార్మా సిటీలో 2013 నుంచి 2020 వరకు 25 పెద్ద ప్రమాదాల్లో 23 మరణించినట్టు అనధికార సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అలాగే 2019-2024 మధ్య 120 పారిశ్రామిక ప్రమాదాలు సంభవించగా 120 మందికి పైగా మరణించారు.

