న్యాయం కోసం పోలీసు మెట్లెక్కిన ఆ మహిళ.. విచారణ జరుగుతుండగానే అపస్మారక స్థితిలోకి వెళ్లి, చివరకు శవమై బయటకొచ్చింది. పల్నాడు జిల్లా క్రోసూరు పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకున్న పల్లపు రేణుక (39) మృతి ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక కానిస్టేబుల్‌తో సహజీవనం, ఆపై మనస్పర్థలు, కేసుల నేపథ్యంలో విచారణకు హాజరైన ఆమె.. స్టేషన్ గోడల మధ్యే ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది అని పోలీసులు చెబుతుంటే.. స్టేషన్ లోపల కొట్టడం వల్లే చనిపోయింది అని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల వెర్షన్ ఒకలా.. బాధితుల ఆవేదన మరోలా ఉన్న ఈ కేసులో, అసలు ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగింది? ఆ నిమిషాల్లో ఆమెపై దాడి జరిగిందా? లేక విధి ఆడిన వింత నాటకమా? వంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు రేణుక మరణాన్ని మిస్టరీగా మార్చేశాయి.
పరిచయం.. సహజీవనం.. ఆపై
ఈ మిస్టరీ వెనుక నాలుగేళ్లుగా సాగుతున్న ఒక చేదు నిజం దాగి ఉంది. చీరాలకు చెందిన రేణుకకు, బాపట్ల కోర్టులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డికి పరిచయం కావడంతో కథ మొదలైంది. మొదటి భర్తతో విడాకుల తర్వాత, నమ్మకమే పునాదిగా రేణుక అతనితో సహజీవనం చేసింది. అయితే, ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారనే నెపంతో, మళ్లీ సంతానం కలగదనే సాకు చూపి వెంకటేశ్వరరెడ్డి మరో మహిళను వివాహం చేసుకోవడం వీరి మధ్య చిచ్చు పెట్టింది. నమ్మించి వంచించాడన్న ఆగ్రహంతో రేణుక న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టగా, అప్పటి నుంచి వీరి మధ్య గొడవలు, పోలీస్ కేసులు నిరంతర ప్రక్రియగా మారాయి.
ఈ వివాదాల సెగ ఎంత తీవ్రంగా ఉందంటే.. గతంలో పొన్నూరులో పనిచేస్తున్న సమయంలో ఇదే వ్యవహారంపై వెంకటేశ్వరరెడ్డి శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలకు గురై సస్పెండ్ కూడా అయ్యాడు. ప్రస్తుతం అతను గురజాలలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, వారి మధ్య ఉన్న పాత కక్షలు మాత్రం ఆరలేదు. నాలుగేళ్లుగా కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదమే.. చివరికి ఆమెను క్రోసూరు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది. న్యాయం తేలుతుందని భావించిన చోటే ఆమె ప్రాణాలు గాల్లో కలవడంతో, ఈ పాత గొడవలే ఆమె మృతికి కారణమయ్యాయా? అన్న సందేహాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగింది?
మంగళవారం సాయంత్రం క్రోసూరు పోలీసు స్టేషన్ ఆవరణ నిశ్శబ్దంగా ఉన్నా, లోపల మాత్రం ఒక తీవ్రమైన విచారణ సాగుతోంది. నాలుగేళ్లుగా సాగుతున్న వివాదానికి ముగింపు పలకాలని, సీఐ సురేష్ ముందు రేణుక, కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. విచారణ జరుగుతున్న క్రమంలోనే అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సాయంత్రం అల్పాహారం తీసుకున్న కాసేపటికే రేణుకకు ఒక్కసారిగా తీవ్రమైన ఫిట్స్ (మూర్ఛ) రావడంతో ఆమె తనపై తాను నియంత్రణ కోల్పోయారు. ఆ గందరగోళ పరిస్థితుల్లో ఆమె మొదటి అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయారని, ఆ పతనం కారణంగానే తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు వివరిస్తున్నారు.
అయితే, ఈ వివరణే ఇప్పుడు అనేక అనుమానాలకు కేంద్రబిందువుగా మారింది. కింద పడిన వెంటనే స్థానిక ఆసుపత్రులకు కాకుండా, నేరుగా మంగళగిరి ఎయిమ్స్‌కు ఎందుకు తరలించాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎయిమ్స్‌లో ప్రాణాలతో పోరాడిన రేణుక, బుధవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవడం ఈ కేసును మరింత జటిలం చేసింది. పోలీసుల చెబుతున్న ప్రమాద కోణానికి, అక్కడ జరిగిన అసలు వాస్తవాలకు మధ్య ఏదైనా పొంతన ఉందా? లేక ఆ సాయంత్రం ఆ అంతస్తులో మరెదైనా జరిగిందా? అన్నది ఇప్పుడు అత్యంత కీలకమైన మిస్టరీగా మారింది.
ఎయిమ్స్ వద్ద సెగలు..పోలీసుల వ్యూహంతో మారిన సీన్
రేణుక మృతి వార్త తెలియగానే మంగళగిరి ఎయిమ్స్ మార్చురీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె మరణం ప్రమాదం కాదు, పక్కా హత్యేనని బంధువులు, కులసంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ లోపల వెంకటేశ్వరరెడ్డి ఆమెను విచక్షణారహితంగా కొట్టడం వల్లే ప్రాణాలు పోయాయి అని వారు నేరుగా ఆరోపించారు. అంతేకాదు, పోలీసుల తీరుపై వారు సంధించిన ప్రశ్నలు సంచలనం రేపాయి. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? సమీపంలోని గుంటూరు ఆసుపత్రులను కాదని, అంత దూరం మంగళగిరికి ఎందుకు తీసుకెళ్లారు? అంటూ వారు పోలీసులను నిలదీశారు. కానిస్టేబుల్‌పై హత్య కేసు నమోదు చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకోవడంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది.
అయితే, పోలీసు అధికారుల రంగప్రవేశంతో ఈ హైడ్రామాలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. బంధువులతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం, పోలీసులు మీడియాకు ఒక వీడియోను విడుదల చేయడంతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఆ వీడియోలో మృతురాలి తండ్రి చంద్రబాబు మాట్లాడుతూ.. తన కుమార్తెకు ముందు నుంచే ఫిట్స్ సమస్య ఉందని, నీరసం వల్లే కళ్లు తిరిగి కింద పడిపోయిందని స్వయంగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మా బిడ్డ మృతిపై అనవసర రాద్దాంతం చేయవద్దు అని ఆయన కోరడం గమనార్హం. తొలుత హత్య అని ఆరోపించిన బంధువుల స్వరం, తండ్రి వీడియో ప్రకటనతో ఒక్కసారిగా నీరుగారిపోయింది. చివరకు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించడంతో, ఈ మిస్టరీ కథ ప్రస్తుతానికి పోలీసుల వెర్షన్ వైపే మొగ్గు చూపినట్లయింది.