
మూగబోయిన స్వర కోయిల.. ఎస్ జానకి చివరి కోరిక ఏంటి?
మైసూర్‌లో కన్నుమూసిన గాయని
భారతీయ సంగీత ప్రపంచంలో ఓ యుగం ముగిసింది. ప్రముఖ గాయని ఎస్. జానకి జూలై 11న మైసూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె మరణ వార్తతో సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.
ఈ మధ్యనే ప్రముఖ దర్శకుడు భారతిరాజా, నటుడు, కథా రచయిత భాగ్యరాజ్ మరణం నుంచి చిత్ర పరిశ్రమ తేరుకోకముందే, ఎస్. జానకి తుదిశ్వాస విడిచారన్న వార్త.. సంగీతాభిమానులను విషాదంలోకి నెట్టింది.
ఎస్. జానకి ప్రయాణం సాధారణంగా మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో సిస్ట్ల శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు 1938 ఏప్రిల్ 23న జన్మించారు. పుట్టింది ఏపీలోనే అయినా పెరిగింది తెలంగాణలోనే. శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కూడా. ఉద్యోగ రీత్యా ఈయన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కొంతకాలం ఉన్నారు. పెద్దగా సంగీత శిక్షణ లేకుండానే తొమ్మిదేళ్ల వయసుకే వేదికపై పాటలు పాడటం ప్రారంభించారు. నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద కొంతకాలం సంగీతంలో శిక్షణ తీసుకుంది. 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమాలో తొలి అవకాశం వచ్చింది. 'విధియిన్ విలయట్టు' అనే చిత్రానికి తన గాత్రాన్ని అందించడంతో ఆమె సినీ ప్రస్థానం మొదలయ్యింది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు. ఆ ఒక్క అవకాశం...ఆమె జీవితాన్నే మార్చేసింది. సినిమాల కోసం ఇరవై ఏళ్ల వయసులో మద్రాస్‌కు పయనమయ్యారు. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యారు.ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.
దాదాపు ఆరు దశాబ్దాల పాటు 20 భాషల్లో సుమారు 48 వేల పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంకా ఎన్నో భాషల్లో ఆమె స్వరం మార్మోగింది.
ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, డాక్టర్ రాజ్‌కుమార్, పి.బి. శ్రీనివాస్, ఎందరో దిగ్గజాలతో కలిసి ఎన్నో చిరస్మరణీయ పాటలు పాడారు. అందుకే అభిమానులు ఆమెను 'గాన కోకిల' అని ప్రేమగా పిలిచేవారు.
ఆమె ప్రతిభకు ఎన్నో అవార్డులు వచ్చాయి. నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 33 రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, తమిళనాడు నుంచి కళైమామణి, కర్ణాటక రాజ్యోత్సవ ప్రశస్తి ఇలా ఎన్నో గౌరవాలు అందుకున్నారు. కానీ, 2013లో వచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని మాత్రం ఆమె తిరస్కరించారు. చాలా ఆలస్యంగా గుర్తింపు ఇచ్చారని ఆమె భావించారు. ఆ నిర్ణయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 1997లో తన భర్త వి. రామప్రసాద్‌ను కోల్పోయారు.ఈ ఏడాది జనవరిలో తన కుమారుడు మురళీ కృష్ణను కూడా కోల్పోయారు. మురళీ కృష్ణ భరతనాట్య కళాకారుడు. తెలుగు, మలయాళ సినిమాల్లో నటించాడు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఆమె మనవడు చనిపోవడంతో సింగర్ జానకి మానసిక వేదనకు గురైనట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జానకి కుటుంబానికి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ఆమె అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి యతీంద్ర సిద్దరామయ్య ఆదేశించారు. ఆమె కోరుకున్నట్లుగానే కణియనహుండి గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జానకి పార్థివ దేహానికి ప్రజలు నివాళులర్పించేందుకు ఆదివారం ఉదయం మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచారు.
ఒక గొప్ప గాయని ఈ లోకాన్ని విడిచిపోయారు. కానీ, ఆమె పాడిన వేలాది పాటలు.. ప్రతి తరానికి, ప్రతి ఇంటికి, ప్రతి జ్ఞాపకానికి ఎప్పటికీ తోడుగానే ఉంటాయి. ఎస్. జానకి అనే పేరు ఇక ఒక వ్యక్తిది కాదు... భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ స్వర్ణ అధ్యాయం.

