`మరి కాసేపట్లోనే ఒడ్డుకు వచ్చేత్తాం. సాయంత్రపేలకి ఇంట్లోనే ఉంటాం.` అంటూ ఫోన్లు చేసిన ఆ మత్స్యకారుల ఫోన్లు ఆ తర్వాత మూగబోయాయి. సాయంత్రమైంది.. రాత్రి అయింది. కానీ తమ వారు రాకపోవడంతో వారికి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆందోళన చెందిన ఆ జాలర్ల కుటుంబ సభ్యులు పరుగు పరుగున విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. రెండు రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. తమ వారు ప్రాణాలతో వస్తారని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అప్పట్నుంచి నేవీ, కోస్ట్‌గార్డ్ , కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు అదేపనిగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కరు మినహా మిగిలిన వారి జాడ ఇసుమంతైనా దొరకకపోవడంతో తల్లడిల్లి పోతున్నారు. వారంతా క్షేమంగా రావాలని దేవుళ్లను వేడుకుంటున్నారు.
మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మత్స్యకార నాయకుడు జానకీరామ్
అసలేం జరిగిందంటే?
విశాఖ ఫిషింగ్ హార్బర్ (చేపల రేవు) నుంచి ఈనెల ఒకటో తేదీన `ఇండ్ ఏపీ-ఎంఎం-వీ5-83 నంబరు మరబోటు ఏడుగురు మత్స్యకారులతో చేపలవేటకు బయల్దేరింది. ఈ మత్స్యకారులు వేట ముగించుకుని 4వ తేదీ మధ్యాహ్నం విశాఖ తీరానికి 10 నాటికల్ మైళ్ల దూరానికి వచ్చారు. అక్కడ నుంచే వీరు తమ కుటుంబ సభ్యలకు ఫోన్లు చేసి సాయంత్రానికల్లా ఇళ్లకు చేరుకుంటామని ఫోన్లు చేసి చెప్పారు. రాత్రయినా వారు హార్బర్‌కు చేరకపోవడంతో బోటులో ఉన్న కళాసీల కుటుంబాల వారు తమ నాయకులకు సమాచారాన్ని చేరవేశారు. వెంటనే స్పందించిన నాయకులు సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో మత్స్యశాఖ అధికారులు, నావికాదళం, కోస్టుగార్డు అధికారులు రంగంలోకి దిగారు.
ఫిషింగ్ హార్బర్‌లో శోకసముద్రంలో మునిగిన మత్స్యకార మహిళలు
బోల్తా పడిన బోటు..
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడంతో వీరి బోటు అలల ఉధృతికి బోల్తా పడింది. అందులో ఉన్న ఏడుగురు సముద్రంలో పడిపోయారు. అలా మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు ఈ ఏడుగురు మత్స్యకారులు బోల్తా పడిన ఆ బోటును పట్టుకుని వేలాడుతూ గడిపారు. ఆదివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో వీరిలో బోటు యజమాని కారె చిన్న, మరో నలుగురు అతికష్టమ్మీద ఈదుకుంటూ తీరం వైపు కదిలారు. వీరిని గమనించిన చైనాకు చెందిన ఎంవీ యూనివర్స్ వెల్దీ అనే మర్చంట్ నౌక కెప్టెన్ అత్యవసర చర్యలు చేపట్టి వీరిలో కారె చిన్నను మాత్రమే రక్షించగలిగారు. ఆ సమయంలో బలమైన గాలులు వీయడం వల్ల మిగిలిన మత్స్యకారులు కనిపించకుండా పోయారు.
కె.చిన్నయ్య
గల్లంతైన మత్స్యకారులు వీరే..
మరబోటులో చేపల వేటకు వెళ్లిన వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకు చెందిన వారు కాగా ఒకరిది విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం. ప్రస్తుతం వీరంతా విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు సమీపంలోని జాలరిపేట, జబ్బార్‌తోట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గల్లంతైన వారిలో కె.చిన్నయ్య, కె.గరగయ్య, ఎ.అప్పలరాజు, ఆర్.బండియ్య, కె.చన్నయ్య, కె.సీతోడు ఉన్నారు.
గరగయ్య
గాలింపు చర్యలు ముమ్మరం..
గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డ్‌కు చెందిన రెండు నౌకలు, ఒక డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, నౌకాదళానికి చెందిన రెండు నౌకలు, హెలికాప్టర్లతో ఆదివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత బోటులో ఉన్న మత్స్యకారులు సముద్రంలో ఎక్కడ నుంచి ఆఖరిసారిగా ఫోన్లో మాట్లాడారో సాంకేతికతతో గుర్తించి విస్తృతంగా గాలిస్తున్నారు. అయినప్పటికీ సోమవారం సాయంత్రం వరకు గల్లంతైన మత్స్యకారుల జాడ గాని, బోల్తా పడిన బోటు ఉనికి గాని కనిపించలేదు. మత్స్యకారుల ఆచూకీ లభించే వరకూ గాలింపు కొనసాగుతుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. విశాఖ రేంజి ఐజీ గోపీనాథ్ జెట్టీ పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు పాలుపంచుకుంటున్నారు.
హార్బర్‌లోనే బాధిత కుటుంబాలు..
సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలు పిల్లా పాపలతో రెండు రోజులుగా విశాఖ ఫిషింగ్ హార్బర్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. తమ వారు ప్రాణాలతో వస్తారని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. రెండు రోజులైనా వారి జాడ తెలియకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. వారికి మత్స్యకార నాయకులు, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఇతర అధికారులు ధైర్యం చెబుతున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుని బాధిత కుటుంబాల వారిని ఓదారుస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.
బండియ్య
ప్రభుత్వం చేతగానితనం వల్లే ..
`మత్స్యకారుల బోటు ప్రమాదంలో చిక్కకుందన్న విషయాన్ని నాలుగో తేదీ రాత్రే సంబంధిత అధికారులకు తెలియజేశాం. అయినా స్పందించలేదు. ఆదివారం ఉదయం గాలింపు చర్యలు మొదలు పెట్టే సరికే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ ప్రభుత్వం చేతగానితనం, నిర్లక్ష్యం వల్లే వీరు కనిపించకుండా పోయారు. మత్స్యకారులంటే ఈ కూటమి ప్రభుత్వానికి చులకన. లెక్కలేనితనం. ఈ మత్స్యకారులకు వారికి ప్రాణాపాయం వాటిల్లిదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి` అని ఈస్ట్‌కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వాసుపల్లి జానకీరామ్ `ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి`తో చెప్పారు.
చెన్నయ్య