అనకాపల్లిని మరో ’రంగారెడ్డి‘ చేస్తాం: చంద్రబాబు
x

అనకాపల్లిని మరో ’రంగారెడ్డి‘ చేస్తాం: చంద్రబాబు

ఉత్తరాంధ్ర ప్రాంతం ఇకపై పెట్టుబడుల పండుగకు వేదిక కాబోతోందని సీఎం హర్షం వ్యక్తం చేశారు.


అనకాపల్లి జిల్లాను దేశంలోనే పెట్టుబడుల హబ్‌గా మారుస్తామని, విశాఖ పరిసర ప్రాంతమైన ఈ జిల్లా భవిష్యత్తులో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తరహాలో అత్యంత సంపన్న ప్రాంతంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గురువారం రాంబిల్లి మండలం జెడ్.చింతువలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew Energy Global) సంస్థకు చెందిన రెండు భారీ ప్లాంట్లకు ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ప్రతిరోజూ పెట్టుబడుల పండుగలా మారుస్తామని, గతంలో ప్రొక్లెయిన్లతో కూల్చివేతలు జరిగిన చోట ఇప్పుడు అదే యంత్రాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం శుభపరిణామమని పేర్కొన్నారు. భారీ పారిశ్రామికీకరణ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలను మార్చి, యువతకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

రూ. 5,400 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ రంగానికి ఊతమిచ్చేలా రెన్యూ ఎనర్జీ సంస్థ రెండు విభిన్న ప్రాజెక్టుల ద్వారా భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. మొత్తం రూ. 5,400 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్లాంట్లు ఉత్తరాంధ్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చనున్నాయి. ఇందులో భాగంగా రూ. 4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్‌ను, అలాగే రూ. 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు భారీ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ సుమారు 2,100 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాబోయే రెండేళ్ల కాలంలోనే ఈ ప్లాంట్లను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి కొత్త జవజీవాలను అందిస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
విద్యుత్ భారం ప్రభుత్వమే భరిస్తోంది
ప్రజలపై గత ప్రభుత్వం మోపిన అదనపు విద్యుత్ భారాలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత పాలకులు విద్యుత్ రంగంలో చేసిన తప్పిదాల వల్ల ప్రజలపై సుమారు రూ. 32 వేల కోట్ల భారం పడగా, అందులో భాగంగా వచ్చిన ట్రూ అప్ చార్జీలను ప్రజలపై వేయకూడదని తమ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం రూ. 15,795 కోట్ల భారీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ సామాన్యులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని, ఇంధన సర్దుబాటు చార్జీల భారం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని సీఎం ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
గ్రీన్ ఎనర్జీ .. జాతి నిర్మాణం
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని, ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు.. జాతి నిర్మాణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే దాదాపు 90 గిగావాట్ల మేర పనులు గ్రౌండ్ అయ్యాయని ఆయన వెల్లడించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలో రవాణా రంగాన్ని ప్రక్షాళన చేస్తూ.. 1,050 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు శ్రీకారం చుట్టామని, భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఈవీ బస్సులుగా మారుతాయని చెప్పారు. వీటికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళిక
ఉత్తరాంధ్ర ప్రాంతం ఇకపై పెట్టుబడుల పండుగకు వేదిక కాబోతోందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. కేవలం పారిశ్రామికవేత్తలే కాదు, ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడించారు. జూలై నాటికి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రానుండటం ఈ ప్రాంత అభివృద్ధికి మైలురాయిగా మారుతుందన్నారు. అలాగే, విశాఖ .. రాజమహేంద్రవరం మధ్య కార్గో రవాణా కోసం ప్రత్యేకంగా నాలుగు రైల్వే లైన్లతో కూడిన స్పీడ్ రైల్ కారిడార్‌ను తీసుకువస్తున్నామని, తద్వారా యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.
కిల్లర్ పార్టీని దూరం పెట్టండి
గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర తీవ్రమైన విధ్వంసాన్ని చూసిందని సీఎం ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. నాడు ప్రొక్లయినర్లతో అక్రమ కూల్చివేతలు, కబ్జాలు జరిగేవి.. నేడు అవే యంత్రాలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కడపలో దస్తగిరి హత్యను ప్రస్తావిస్తూ.. ఆస్తుల కోసం సొంత మనుషుల్నే కడతేర్చే సంస్కృతి ఉన్న ఆ కిల్లర్ పార్టీ ని రాజకీయాలకు దూరం పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు చేసే అరాచక రాజకీయాలు సమాజానికి అవసరమా అని ప్రశ్నిస్తూ.. సంపదను సృష్టించి పేదల అభివృద్ధికి పాటుపడే ప్రభుత్వాలకు మద్దతుగా నిలవాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.
Read More
Next Story