సజ్జలపై విజయసాయిరెడ్డి ఫైర్‌.. ‘నమ్మకద్రోహి’ అంటూ ఆరోపణ
x

సజ్జలపై విజయసాయిరెడ్డి ఫైర్‌.. ‘నమ్మకద్రోహి’ అంటూ ఆరోపణ

‘‘జగన్‌ను ఎవరూ కలవకుండా గోడ కట్టింది సజ్జల కాదా?’’ అని విజయసాయి ప్రశ్నించారు.


వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చాలాకాలంగా కొనసాగుతున్న విభేదాలు తాజాగా బహిరంగ ఆరోపణలు, ప్రత్యారోపణల స్థాయికి చేరాయి. తనను ‘నమ్మకద్రోహి’ అంటూ వైసీపీ కోటరీ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు.
తాను ఏనాడూ నమ్మకద్రోహానికి పాల్పడలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను నిజంగా నమ్మకద్రోహినే అయితే.. గతంలో సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకుని, సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో తన పేరు లేకుండా చేసుకునేవాడినని వ్యాఖ్యానించారు.
‘‘నమ్మకస్తుడిననే కారణంతోనే ప్రతి ఛార్జిషీట్‌లో నా పేరు చేర్చారు’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జగన్‌ 16 నెలలు జైలులో ఉంటే.. తాను 15 నెలలు కారాగారంలో ఉన్నానని గుర్తుచేశారు. తనకు సంబంధం లేని లిక్కర్‌ స్కామ్‌లోనూ ఏ-5గా, కాకినాడ సీపోర్టు కేసులో ఏ-2గా తనను చేర్చారని తెలిపారు.
‘సకల శాఖల మంత్రి పేరు ఏ ఛార్జిషీట్‌లో లేదు’
సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘సకల శాఖల మంత్రి పేరు మాత్రం ఇంతవరకు ఏ ఛార్జిషీట్‌లోనూ లేదు. ఏ కేసులూ లేకుండా ఎలానో కోటరీ నాయకుడికి తెలిసినంత నాకు తెలియదు’’ అని విమర్శించారు.
పార్టీ మారేందుకు సిద్ధమైన ఉత్తరాంధ్ర నేతతో కలిసి కోటరీ నాయకుడు తనపై కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. తనపై అసత్యాలు చెప్పి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారని పేర్కొన్నారు.
‘జగన్‌ను ఎవరూ కలవకుండా గోడ కట్టింది ఎవరు?’
తన ఆత్మగౌరవానికి 2020 నుంచి భంగం కలిగించిందెవరో చెప్పాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 2019 ఎన్నికల విజయం తర్వాత సజ్జల ప్రమేయం ఎలా పెరిగిందని నిలదీశారు.
‘‘జగన్‌ను ఎవరూ కలవకుండా గోడ కట్టింది సజ్జల కాదా?’’ అని ప్రశ్నించారు.
జగన్‌ మెప్పు కోసమే సజ్జల తనను నాస్తికుడిగా చెప్పుకొన్నారని ఆరోపించిన విజయసాయిరెడ్డి.. ఆయన వైకాపాకే కాకుండా రాష్ట్రానికే నమ్మకద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు రాజకీయంగా సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి, సజ్జల మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ ద్వారా చేసిన వ్యాఖ్యలతో ఆ విభేదాలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read More
Next Story