‘గూగుల్‌’ రాకతో వైజాగ్‌కు న్యూ లుక్‌!
x

‘గూగుల్‌’ రాకతో వైజాగ్‌కు న్యూ లుక్‌!

విశాఖలో ప్రపంచ ప్రఖ్యాత గూగుల్‌ మెగా డేటా సెంటర్‌ ఏర్పాటుతో వైజాగ్‌ ముఖ చిత్రం మారిపోనుంది.


గూగుల్‌.. ఈ పేరుకో ప్రత్యేకత ఉంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో దిగ్గజ సంస్థ ఇది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అలాంటి గూగుల్‌ సంస్థ మెగా డేటా సెంటర్, ఏఐ హబ్‌ల రూపంలో ఇప్పుడు విశాఖలో వేళ్లూనుకుంటోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత గూగుల్‌కు ఇది రెండవ డేటా సెంటర్‌. ఆసియాలో ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు ఇదే. గూగుల్‌ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టు, అంతా అనుకుంటున్నట్టు ఈ డేటా సెంటర్‌ అందుబాటులోకి వస్తే విశాఖపట్నం సహా ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగం భవిష్యత్తే మారిపోనుంది. ఈ గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా ఏఐ హబ్‌కు మంగళవారం శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం..


గూగుల్‌ గుర్తుతో విశాఖ సాగరతీరం (ప్రతీకాత్మక చిత్రం)

గూగుల్‌ డేటా సెంటర్‌ కథా కమామిషు..

విశాఖపట్నానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందపురం మండలం తర్లువాడ ఈ గూగుల్‌ మెగా డేటా సెంటర్‌కు కేంద్ర బిందువు. ఒక గిగావాట్‌ సామర్థ్యంతో 15 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.35 లక్షల కోట్ల) పెట్టుబడితో ఆసియాలోనే అతి పెద్ద మెగా డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాల సరసన విశాఖపట్నం చేరుతుంది. అంతేకాదు.. అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్‌ సదుపాయం సమకూరుతుంది. సముద్రగర్భంలో వేసే కేబుళ్లతో అభివృద్ధి చేసే ఇంటర్నేషనల్‌ సబ్‌ సీ గేట్‌ వేతో వివిధ (ప్రస్తుతానికి 12) దేశాలతో అనుసంధానానికి దోహదపడుతుంది. సబ్‌ సీ లైన్లతో సంప్రదాయ నౌకాయాన మార్గాలు ఇకపై డిజిటల్‌ ట్రేడ్‌ రూట్లుగా మారతాయి. గూగుల్‌ క్లౌడ్‌ ఏఐకి సంబంధించి ఆసియాకే విశాఖ గేట్‌ వేగా మారుతుంది. కొత్త ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్లు ఇతర ప్రాంతాలతో విశాఖను అనుసంధానం చేస్తుంది. గూగుల్‌ ప్రపంచ వ్యాప్తంగా అందించే అన్ని రకాల ఉత్పత్తులను ఈ హబ్‌ ద్వారానే వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.

తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌ పనులు

ఉమ్మడి విశాఖలో మూడు డేటా సెంటర్లు..

గూగుల్‌ సంస్థ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక గిగావాట్‌ సామర్థ్యంతో హైపవర్‌ స్కేల్‌ ఏఐ డేటా సెంటర్లను మూడు చోట్ల ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లా తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి సమీపంలో 174.80 ఎకరాలను (600 ఎకరాలకు పైగా) గూగుల్‌ డేటా సెంటర్‌ కోసం కేటాయించింది. ఈ మూడు డేటా సెంటర్లను రెండేళ్లలో అంటే 2028 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్‌ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. తొలిదశలో తర్లువాడ డేటా సెంటర్‌కు మంగళవారం శంకుస్థాపన జరిగింది. వైజాగ్‌ మెగా డేటా పార్కు లిమిటెడ్‌ పేరిట ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టుకు అదానీ కెనెక్స్, ఎయిర్‌టెల్‌ నెక్స్‌ట్రా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.

గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటవుతున్న తర్లువాడ గ్రామం ఇలా

ఉద్యోగావకాశాలకు ఆస్కారం..

విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్, ఏఐ హబ్‌ల ఏర్పాటుతో నేరుగా వేలల్లో ఉద్యోగాలు రావు. అయితే గూగుల్‌ ఏఐ సేవలందించే మెగా హబ్‌ను ఏర్పాటు చేస్తున్నందున దీనికి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ నిపుణులతో పాటు విద్యుత్, నెట్‌వర్కింగ్‌ వ్యవస్థల నిర్వహణకు అవసరమైన నిపుణులు అవసరమవుతారు. అలాగే ఏఐ ఆధారిత కంపెనీలు డేటా సెంటర్‌కు చేరువలో ఉంటాయి. దీంతో ఉద్యోగావకాశాలు విస్తృతమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇలా గూగుల్‌ హబ్‌తో పాటు, దాని ఆధారంగా ఏర్పాటయ్యే కంపెనీలతో కలిపి 1,88,220 ఉద్యోగాల కల్పనకు ఆస్కారం ఉంటందని భావిస్తున్నారు.

యువతకు అడ్వాన్స్‌డ్‌ క్లౌడ్‌ ఏఐలో శిక్షణ..

యువతకు భవితను అందించేలా అడ్వాన్స్‌డ్‌ క్లౌడ్, ఏఐలో శిక్షణ కార్యక్రమాలను కూడా గూగుల్‌ నిర్వహిస్తుంది. 10 వేల మందికి పైగా మహిళలకు మైక్రో ఎంటర్‌ప్రైజ్‌గా మార్చేందుకు సహకారం అందిస్తుంది. న్యూట్రాన్స్‌ మిషన్‌ లైన్లు, ఎనర్జీ స్టోరేజి సిస్టమ్స్‌ లాంటివి ఈ ప్రాంతానికి ఇంధన భద్రతను కల్పిస్తాయి.

ప్రపంచ పటంలో విశాఖపట్నం..

గూగుల్‌ డేటా సెంటర్, ఏఐ హబ్‌ ఏర్పాటుతో విశాఖపట్నం ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో హైదరాబాద్‌ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. గూగుల్‌ రాకతో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ తర్వాత విశాఖ నిలవనుంది. మరోవైపు దేశంలోని తూర్పు తీరంలో చెన్నై తర్వాత సబ్‌ సీ కేబుల్‌ విశాఖలోనే ఏర్పాటవుతోంది.

రైతులకు పరిహారంపై వివాదం..

గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం తర్లువాడ గ్రామ రైతుల నుంచి ప్రభుత్వం భూములను సేకరించింది. తొలుత రైతులు భూములివ్వడానికి అంగీకరించలేదు. ప్రభుత్వం ఎకరానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం, ఎకరానికి 20 సెంట్ల జిరాయితీగా మార్పు, ఇంటికి ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం, డేటా సెంటర్‌ ప్రాంతంలో నిర్మించే షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఒక్కో షాపును కేటాయిస్తామని ప్రకటించింది. దీనికి మెజార్టీ రైతులు ముందుకు రావడంతో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు అడుగు ముందుకు పడింది. అయితే దాదాపు 520 మంది డీపట్టా రైతులతో పాటు మరో 12 ఎకరాల జిరాయతీ రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులపై వివాదం నెలకొంది. దీనిపై సంబంధిత రైతుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఇది పరిష్కారం కాకుండానే ప్రభుత్వం గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసేసింది.
Read More
Next Story