
గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు భూమి పూజ∙చేస్తున్న దృశ్యం
విశాఖపట్నం ఇకపై అవుతుంది ఏఐ పట్నం!
విశాఖపట్నం సమీపంలోని తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్‌కు అట్టహాసంగా భూమి పూజ జరిగింది.
కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గూగుల్ మెగా డేటా సెంటర్‌కు పునాది రాయి పడింది. విశాఖ రూపురేఖలను మరింతగా మార్చివేస్తుందని భావిస్తున్న ఈ ఏఐ హబ్‌కు మంగళ వాయిద్యాల నడుమ మంగళవారం భూమి పూజ జరిగింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్, మరికొంతంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, గూగుల్, అదాని, ఎయిర్‌టెల్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో అట్టహాసంగా దీనికి శంకుస్థాపన ప్రక్రియ పూర్తయింది. ఇక దాని నిర్మాణానికి ఒక్కో అడుగు పడనుంది.
రెండేళ్లలో డేటా సెంటర్ అందుబాటులోకి..
అన్నీ అనుకున్నట్టు సవ్యంగా జరిగితే ఈ గూగుల్ మెగా డేటా సెంటర్ రెండేళ్లలో అందుబాటులోకి వస్తుంది. ఆ లక్ష్యంతోనే గూగుల్ సంస్థ ముందుకు వెళ్తుంది. దీని నిర్మాణ బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు చోట్ల గూగుల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. తొలిదశలో ప్రధానమైన తర్లువాడ సెంటర్ పూర్తి అవుతుంది. ఆపై మిగిలిన అడవివరం, రాంబిల్లి డేటా సెంటర్లు మనుగడలోకి వస్తాయి.
వేదికపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ తదితరులు
రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో..
గూగుల్ సంస్థ తన గూగుల్ డేటా సెంటర్ కోసం రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులను సమకూరుస్తోంది. ఇప్పటికే తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో డేటా సెంటర్లకు సుమారు 600 ఎకరాలను కేటాయించింది. ఇంకా కీలకమైన విద్యుత్, నీటి వనరులను కూడా యుద్ధప్రాతికన ఏర్పాటు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చి ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తహతహలాడుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దీనిని ఉపయోగించుకోవాలని చూస్తోంది.
ఉదయం 9.30 గంటలకు భూమి పూజ..
తర్లువాడలోని గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు మంగళవారం ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్‌లు శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. వీరితో పాటు కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని శ్రీనివాస్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు, గూగుల్, అదానీ సంస్థల ప్రతినిధులు ప్రసంగించారు. ఎవరేమన్నారంటే?
ప్రసంగిస్తున్న అశ్వనీ వైష్ణవ్
విశాఖపట్నం ఏఐ పట్నంగా మారుతుందిః అశ్వనీ వైష్ణవ్
‘గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో విశాఖపట్నం ఇకపై ఏఐ పట్నంగా మారుతుంది. విద్య, వైద్యం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం ఇలా వివిధ రంగాల్లో ఏఐ విప్లవం వస్తోంది. ఎంవోయూ చేసుకున్న అతి తక్కువ సమయంలోనే గూగుల్ ఏఐ హబ్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ డేటా సెంటర్‌ను ప్రధాని మోదీతో ప్రారంభించుకునే రోజు దగ్గర్లోనే ఉంది. ఐటీ సేవల రంగంలో భారత్ లీడర్‌గా ఎదిగింది. కానీ సెమీ కండక్టర్లు, చిప్‌లు, ల్యాప్‌టాప్, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తిలో వెనకబడ్డాం. ప్రధాని చొరవతో మొబైల్ తయారీలో ముందడుగు వేసి ఎగుమతుల్లో ముందడుగు వేశాం. డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్లను కూడా దేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలని టెక్ కంపెనీలకు పిలుపునిస్తున్నాను. గూగుల్ తమ సర్వర్లు, జీపీయూ, చిప్‌లను ఇక్కడే ఉత్పత్తి చేయాలని కోరుతున్నాను. విశాఖ నుంచి అస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్‌కు, ఆఫ్రికా మీదుగా అమెరికాకు వెళ్లేలా 3 సబ్ సీ కేబుల్స్ వేస్తున్నందుకు ధన్యవాదాలు.
రైల్వే జోన్‌ను నోటిఫై చేయబోతున్నాం..
జూన్ ఒకటో తేదీన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను అధికారికంగా నోటిఫై చేయబోతున్నాం. అమరావతి నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా త్వరలోనే సాకారమవుతుంది. అమరావతి నుంచి హైదరాబాద్‌కు 70 నిమిషాల్లో చేరుకోవచ్చు. 112 నిమిషాల్లో అమరావతి నుంచి చెన్నై చేరుకునే మరో బుల్లెట్ ట్రైన్‌ను ప్రవేశపెడ్తాం. కోల్‌కతా–చెన్నై రైల్వే డబుల్ లైన్‌ను ఫోర్ లైన్‌గా మారుస్తాం. కంటైనర్, ఫ్రైట్ ట్రైన్లతో పాటు 500 రైళ్లతో ఈ ప్రాంతాన్ని అనుసంధానిస్తాం’ అని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ వివరించారు.
ప్రసంగిస్తున్న చంద్రబాబు
వైజాగ్‌ను వెతుక్కుంటూ వచ్చిన గూగుల్ః చంద్రబాబు
ప్రతి ఒక్కరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. గూగుల్ విశాఖను వెతుక్కుంటూ వచ్చింది. అదానీ, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ సంస్థలు ఈ గూగుల్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాయి. 2028 సెప్టెంబర్‌కు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నాను. ఈ డేటా సెంటర్‌కు నీటి సమస్య రాదు. 60 రోజుల్లో గోదావరి నీరు విశాఖకు వస్తుంది. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్‌కు గూగుల్ ఏఐ డేటా సెంటర్ సహకారం తీసుకుంటాం. సీఎం కార్యాలయంలో ప్రస్తుతం నలుగురు కార్యదర్శులున్నారు. త్వరలో కొత్తగా ఏఐ అసిస్టెంట్ పాలనలో నాకు సహకరిస్తుంది. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయి.
లోకేష్ చొరవతోనే గూగుల్ వచ్చింది..
మంత్రి లోకేష్ చొరవతోనే విశాఖకు గూగుల్ వచ్చింది. ఇందుకు ప్రధాని మోదీ సహకరించారు. గూగుల్ ప్రతినిధులను కలవడానికి అమెరికా వెళ్లారు. వారిని ఒప్పించారు. వారికి కావలసింది సమకూర్చడానికి ముందుకొచ్చాం. గూగుల్ రాకకు కారకులైన ప్రధాని మోదీ, లోకేష్‌లను అభినందిస్తున్నాను.
ప్రసంగిస్తున్న బికాస్ కోలే
ఇకపై ఉత్తరాంధ్రకే వలసలు..
ఒకప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఉపాధి కోసం వలసలు పోయేవారు. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే పరిస్థితి వస్తోంది. జులైలో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. 2028 నాటికి నక్కపల్లిలోని ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ నుంచి తొలి షిప్‌మెంట్ ఎగుమతి జరుగుతుంది. అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా అభివృద్ధి చెందుతుంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
గూగుల్ క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే?
గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్‌ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే మాట్లాడుతూ.. ఏయూ యుగంలో విశాఖలో ఈ డేటా సెంటర్ కీలకపాత్ర పోషిస్తుంది. గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా ఏపీ, విశాఖలు పరుగులు పెడ్తున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఉన్న విశాఖకు ఈ డేటా సెంటర్ టెక్ ఫ్యూచర్‌ను అందిస్తుంది. విశాఖలోని వివిధ నివాస ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ ప్రాంతానికి ఆర్థిక స్థిరత్వం కల్పించేలా ఈ డేటా సెంటర్ నిర్మితమవుతుంది. యువతకు భవితను అందించేలా వారికి అడ్వాన్స్‌డ్ క్లౌడ్, ఏఐలో శిక్షణ కార్యక్రమాలను కూడా గూగుల్ నిర్వహిస్తుందని అని కోలే పేర్కొన్నారు.
ప్రసంగిస్తున్న జీత్ అదానీ
అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ ఏమన్నారంటే?
సభలో అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ మాట్లాడుతూ ’ 1 గిగావాట్ హైప్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా ఏఐ రంగంలో భారత్ ఓ పెద్ద ముందడుగు వేసింది. ఇప్పటిదాకా ముంబై, చెన్నైలకే పరిమితమైన డేటా సెంటర్‌లు ఇక విశాఖలోనూ అడుగు పెడ్తున్నాయి. విశాఖ భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా మారుతుంది. ఇతర దేశాలకూ ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. వంద బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని మా గ్రూప్ నిర్ణయించింది’ అని తెలిపారు.
Next Story

