విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ ఐ ఎన్ ఎల్)లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్లాంట్‌లోని ఎస్ ఎం ఎస్-1లోని కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్‌మెంట్ (సీసీడీ) మిషన్-2లో హాట్ మెటల్ బకెట్లు పడడంతో ఆ ద్రవపు ఉక్కు అక్కడ విధుల్లో ఉన్న కార్మికులపై ఒక్కసారిగా పడింది. ఆ సమయంలో ఆ ద్రవపు ఉక్కు 1500-2200 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందంటున్నారు. లిక్విడ్ స్టీల్ ద్రవపు ఉక్కు) ద్వారా బీమ్స్ తయారు చేస్తుంటారు. ఆ ప్రాంతంలో లాడిల్ పేలుడంతో ఈ ప్రమాదానికి దారితీసిందని సంభవించిందని చెబుతున్నారు. స్టీల్ మెల్టింగ్ షాప్ విభాగంలో వేడి ద్రవ ఉక్కును తరలిస్తున్న సమయంలో లాడెల్ క్రేన్ ఒక్కసారిగా తెగిపడి కిందపడటంతో భారీ ప్రమాదం సంభవించింది. వందల టన్నుల ద్రవ ఉక్కు నేలపై ఒలికిపోవడంతో ప్లాంట్ ప్రాంతం క్షణాల్లో నిప్పుల కొలిమిలా మారింది. ఈ ఘటనలో భారీ క్రేన్ పూర్తిగా దగ్ధం కాగా, విద్యుత్ కేబుళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
గాయపడిన కార్మికుడిని ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది
పది మంది కార్మికులు దుర్మరణం?
ప్రమాదం జరిగే సమయంలో 16 మందికి పైగా కార్మికులున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఐదుగురు ప్రమాద స్థలంలోనే మరణించారు. మిగిలిన వారిని హుటాహుటీన స్టీల్‌ప్లాంట్ ఆస్పత్రికి తరలించారు. మరికొందరిని విశాఖ నగరంలోని ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులకు అంబులెన్సుల్లో పంపించారు. మార్గమధ్యలో కొందరు, ఆస్పత్రిలో మరికొందరు చనిపోయారు. ఇలా ఇప్పటివరకు పది మంది వరకు దుర్మరణం పాలయినట్టు అనధికార సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. మృతులు ఎంతమంది, క్షతగాత్రులు ఎంతమంది అన్న దానిపై స్పష్టత లేదు. అయితే ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం మృతుల వివరాలు ఇవి.
1) గొంతిన భానుకుమార్ (టెక్నిషియన్)
2) ఎం. కృష్ణనాగు
3) జీవీ అప్పారావు
4) కె.ప్రభాకర్ (జనరల్ ఫోర్‌మెన్)
5) గోల్్డ కుమార్ (మేనేజర్)
ఉక్కులో భయానక వాతావరణం..
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రదేశంలో భయానక వాతావరణం నెలకొంది. మృతి చెందిన కొంతమంది కార్మికుల మృతదేహాలు గుర్తుపట్టడానికి వీలు లేనంతగా కాలిపోయాయి. ఇంకొందరు మాంసపు ముద్దల్లా మారారు. ప్రమాద స్థలం అంతా అత్యంత వేడిగా ఉండడంతో సమీప ప్రాంతంలోకి ఎవరూ వెళ్లే పరిస్థతి కనిపించడం లేదు. అల్లంత దూరం నుంచే మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ఉష్ణతీవ్రత చల్లారాక గాని ప్రమాద స్థలిలో ఎంతమంది చనిపోయారన్నది తెలిసే అవకాశం ఉంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు
ప్రమాదాలకు నెలవుగా ఉక్కు కర్మాగారం..
విశాఖ స్టీల్ ప్లాంటు తరచూ ప్రమాదాలకు నెలవుగా మారుతూనే ఉంది. ఏటా పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో కొందరు మృత్యువాత పడుతుండగా, మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ విస్తరణ సమయంలో 2012, జూన్ 13న జరిగిన ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో కార్మికులు, ఇంజినీర్లు, అధికారులు కూడా ఉన్నారు. అప్పట్లో స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ ఎం ఎస్-2)లో పేలుడు సంభవించడంతో ఈ దుర్ఘటన జరిగింది. స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇప్పటివరకు అఏ పెను దుర్ఘటన. ఆ తర్వాత సోమవారం నాటి ఘటనే పెద్దది. ఈ స్టీల్ ప్లాంటులో గ్యాస్ లీకేజీలు, ద్రవపు ఉక్కు లీకేజీలు, పేలుళ్లు వంటివి సంభవిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
2012లో జరిగిన ప్రమాద తీవ్రత దృశ్యం..
కొరవడిన భద్రతా ప్రమాణాల వల్లే..
ఈ ప్లాంటులో యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని చాన్నాళ్లుగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. అనుభవం లేని. క్వాలిఫైడ్ కాని కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయించడం, సిబ్బంది కొరత వంటివి ప్రమాదాలు సంభవించడానికి దారితీస్తున్నాయని వీరు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ యాజమాన్యం అటు వైపు దృష్టి సారించడం లేదన్న ఆరోపణలున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్బాంతి..
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులు మరణించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం సోమవారం రాత్రికి విశాఖపట్నం వస్తారని తెలుస్తోంది. ఇక్కడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శిస్తారు. మరోవైపు ఘటనా స్థలానకి హోం మంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు.