రిజర్వేషన్ నిరసన పేరుతో వైరల్ వీడియో.. అసలు నిజమేంటి?
x

రిజర్వేషన్ నిరసన పేరుతో వైరల్ వీడియో.. అసలు నిజమేంటి?

జంతర్ మంతర్ వద్ద రిజర్వేషన్ వ్యతిరేక భారీ నిరసన జరిగిందంటూ వైరల్ అయిన వీడియోను ఢిల్లీ పోలీసులు ఖండించారు.


Click the Play button to hear this message in audio format

జంతర్ మంతర్ వద్ద రిజర్వేషన్లను సంస్కరించాలంటూ భారీ సంఖ్యలో ప్రజలు నిరసనకు దిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఆ వీడియో ఫేక్ అని న్యూఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఆగస్టు 23న జంతర్ మంతర్ వద్ద అలాంటి నిరసనకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు.

అమల్లో సెక్షన్ 163 ..

న్యూఢిల్లీ జిల్లా పరిధిలో ప్రస్తుతం సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. గతంలో సీఆర్‌పీసీలోని సెక్షన్ 144గా ఉన్న నిబంధనలకు ఇది ప్రత్యామ్నాయంగా వచ్చింది. ఈ ఆంక్షల ప్రకారం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట ఉండటం, నిరసనలు తెలపడం నిషేధం. కాగా తప్పుదోవ పట్టించే సమాచారం లేదా నకిలీ వీడియోలను సృష్టించి ప్రచారం చేసే వారిపై చట్టపర చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో కనిపించే వీడియోలు, పోస్టుల ఆధారంగా ప్రజలు అక్కడికి చేరుకోవద్దని సూచించారు.

చిరాగ్ పాశ్వాన్ ఏమన్నారు?

మరోవైపు రిజర్వేషన్ అంశంపై కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. రిజర్వేషన్‌కు సంబంధించి తమ డిమాండ్లను నిరసనకారులు క్రమపద్ధతిలో ప్రభుత్వానికి అందించాలని ఆయన సూచించారు. పాట్నాలో శనివారం మీడియాతో మాట్లాడిన పాశ్వాన్.. నిరసనకారులు తమ డిమాండ్లను సక్రమంగా ప్రభుత్వానికి సమర్పిస్తే.. వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పారు.

ఆర్థిక స్థితి ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌పై కూడా పాశ్వాన్ స్పందించారు. ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోందని గుర్తు చేశారు.

ఇదే సమయంలో ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల కాంగ్రెస్ నిర్వహిస్తున్న ధర్నాపై కూడా చిరాగ్ పాశ్వాన్ విమర్శలు చేశారు. వందేమాతరం అంశంపై నెలకొన్న వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ఈ నిరసన చేపట్టిందని ఆయన ఆరోపించారు.

Read More
Next Story