‘నాకు, నా జట్టుకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి’
x

‘నాకు, నా జట్టుకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి’

స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్


Click the Play button to hear this message in audio format

భారతీయ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ (Vinesh Phogat) రెజ్లింగ్‌లో తిరిగి పాల్గొనడానికి ముందు భద్రతా అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీ సందర్భంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు లేదా తన జట్టు సభ్యులకు ఏదైనా హాని జరిగితే భారత ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత మళ్లీ మ్యాట్‌పైకి అడుగుపెట్టనున్న వినేష్, ఈ టోర్నీ నిర్వహణ, అంపైరింగ్‌లో పక్షపాతం వహించే అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) ప్రభావిత ప్రాంతంలో పోటీ జరుగుతున్నందున, టోర్నీ నిర్వహణలో అతని అనుచరుల ప్రభావం ఉండొచ్చని ఆమె ఆరోపించారు.

“పోటీ సమయంలో నాకు లేదా నా జట్టుకు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే, భారత ప్రభుత్వమే బాధ్యత వహించాలి.ఈ టోర్నమెంట్ అతని ప్రభావం ఉన్న ప్రదేశంలో జరుగుతోంది. అంపైరింగ్ నుంచి పాయింట్ల కేటాయింపు వరకు అన్నింటిపైనా అతని మనుషుల ప్రభావం ఉండొచ్చు.

నాకు ప్రత్యేక సదుపాయాలు అవసరం లేదు. క్రీడాకారులు కష్టపడి సాధించిన ఫలితాలు న్యాయంగా రావాలని మాత్రమే కోరుకుంటున్నాను.” అని వినేష్ పేర్కొన్నారు.

రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్లలో వినేష్ ఫోగట్ ఒకరు. 2023లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం వినేష్ హర్యానా అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్నారు. కేసు ఇంకా న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్‌కు సంబంధించిన ప్రదేశంలో పోటీపడటం తనపై మానసిక ఒత్తిడిని పెంచుతోందని పేర్కొన్నారు.

“ఫిర్యాదు చేసిన ఆరుగురు మహిళల్లో నేను ఒకరిని. ఆ వ్యక్తికి సంబంధించిన ప్రదేశంలో పోటీ పడటం మానసికంగా చాలా ఒత్తిడిగా ఉంది. అలాంటి వాతావరణంలో నేను నా వంద శాతం ఇవ్వగలనో లేదో అనుమానం ఉంది.” అని అన్నారు. ప్రభుత్వం, క్రీడా మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకోకుండా ఆయనపై ప్రేక్షక పాత్ర వహించాయని కూడా విమర్శించారు.

గోండాలో జరిగే టోర్నీలో వినేష్ ఫోగట్ 57 కేజీల విభాగంలో పోటీపడనున్నారు. గతంలో ఆమె 50, 53 కేజీల విభాగాల్లో పోటీ చేశారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా ఫైనల్స్‌లో అనర్హురాలిగా ప్రకటించారు. దాని తర్వాత తొలిసారిగా వినేష్ మళ్లీ పోటీపడుతున్నారు.

గోండా టోర్నమెంట్‌కు ముందు వినేష్ ఫోగట్ భద్రత, పక్షపాతం‌పై ఆందోళన వ్యక్తం చేశారు; ఏ ఘటన జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు.

Read More
Next Story