జగన్ వద్ద పాలేరులా పనిచేశా..విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
x

జగన్ వద్ద పాలేరులా పనిచేశా..విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, చంద్రబాబు కూడా 25 ఏళ్లు ఉంటాననుకోవడం భ్రమేనని విమర్శించారు.


ఏపీ రాజకీయ యవనికపై ఒకప్పుడు జగన్ వెన్నంటి నడిచిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు అదే జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ విశ్వరూపం ప్రదర్శించారు. మద్యం కుంభకోణం కేసులో గురువారం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఏడు గంటల ఈడీ విచారణ తర్వాత బయటకు వచ్చిన ఆయన, తన లోపలి ఆవేదనను, రాజకీయ వ్యూహాలను ఏకరువు పెట్టారు. నేను జగన్ వద్ద ఒక పాలేరులా రాత్రింబవళ్లు కష్టపడితే.. ఆయన చుట్టూ ఉన్న పనికిమాలిన కోటరీ నాపై వెన్నుపోటు ముద్రవేసి పొగబెట్టి బయటకు పంపింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసుల విషయంలో తనను నంబర్-2గా ప్రచారం చేస్తూ, లాభాల విషయంలో మాత్రం వందో స్థానానికి నెట్టేశారని ఎద్దేవా చేశారు. ఏడాది పాటు వ్యవసాయానికి పరిమితమైన తాను, ఇక రిటైర్మెంట్‌కు స్వస్తి పలుకుతున్నానని.. వచ్చే జూన్ తర్వాత తన అసలు రాజకీయం మొదలవుతుందని ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. జగన్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనను కాదని చేరదీసిన ఆ పందికొక్కుల కోటరీని వదిలించుకోవాలని ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కోటరీ వల్లే జగన్ నష్టపోయారు

అధికారంలోకి వచ్చిన కొత్తలో నాకు గౌరవప్రదమైన స్థానం ఇచ్చారు. కానీ జగన్ చుట్టూ ఉన్న పనికిమాలిన కోటరీ మాటలు నమ్మి నన్ను మెల్లగా దూరం పెట్టారు. నేను జగన్ వద్ద ఒక పాలేరులా రాత్రింబవళ్లు పనిచేశాను. కానీ నా దురదృష్టం కొద్దీ జగన్ ఆ కోటరీని నమ్మి నాకు పొగబెట్టి బయటకు పంపారు అని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జగన్ చేసిన విమర్శలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మద్యం స్కామ్..నెంబర్ 2 ముద్రపై ఫైర్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం లేదని, ఆ స్కామ్‌లో ఉన్న వారినే అడగాలని అధికారులకు చెప్పినట్లు ఆయన వివరించారు. ప్రాంతీయ పార్టీల్లో నెంబర్-2 అనే స్థానమే ఉండదు. కానీ నాపై ఆ ముద్ర వేశారు. కేసుల విషయంలో నేను నెంబర్-2 కావచ్చు కానీ, లాభాల విషయంలో మాత్రం నా స్థానం వంద తర్వాతే ఉంటుంది అని ఎద్దేవా చేశారు. తన కుమార్తె ఆస్తులు తనవి కావని, విశాఖలో ఒక్క అపార్ట్‌మెంట్ తప్ప తనకు ఏమీ లేదని స్పష్టం చేశారు.

జూన్ తర్వాతే పొలిటికల్ రీ-ఎంట్రీ

రాజకీయాల నుంచి తాను విరమించుకోలేదని, ప్రస్తుతం ఏడాదిగా వ్యవసాయం చేసుకుంటున్నానని ఆయన తెలిపారు. రాజకీయాల్లో స్ట్రాటజీ అనేది చాలా ముఖ్యం. వచ్చే జూన్ తర్వాతే నా రాజకీయ భవిష్యత్తు గురించి, కొత్త ప్రయాణం గురించి మాట్లాడతాను అని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, చంద్రబాబు కూడా 25 ఏళ్లు ఉంటాననుకోవడం భ్రమేనని విమర్శించారు.

బీజేపీ వైపు మొగ్గు

విచారణ అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉత్తమ ప్రధాని అని కొనియాడటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నుంచి ఆహ్వానం అందితే ఆలోచిస్తానంటూ ఆయన పరోక్షంగా తన రాజకీయ గమ్యంపై క్లూ ఇచ్చారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావాలంటే కూటమిని విడగొట్టాలని, లేదంటే ఈ కోటరీతో ఆయనకు భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు.

Read More
Next Story