‘నా కొడుకు చేతుల్లో మేకులు దించి... గొంతు నులిమి చంపేశారు!
x

‘నా కొడుకు చేతుల్లో మేకులు దించి... గొంతు నులిమి చంపేశారు!

నాకు భూములు, డబ్బులు ఇచ్చింది ఎవరో చెప్పాలని సవాల్ చేసిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి


రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్, అదృశ్యం వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసిన ఆరోపణలు, కన్నీటి ఆక్రందనలు వినేవారిని కలచివేస్తున్నాయి. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన అధికారిక మెజిస్టీరియల్ విచారణకు హాజరైన ఆమె, విచారణాధికారి ముందు అత్యంత సంచలన నిజాలను వెల్లడించారు.

తన కొడుకును పోలీసులు అత్యంత కిరాతకంగా హింసించి చంపేశారని విజయలక్ష్మి ఆరోపించారు.

"నా కొడుకు సాయికృష్ణను పట్టుకొచ్చి, చేతుల్లో మేకులు దించి, గొంతుకు ఉరి బిగించి ప్రాణాలు తీశారు. సీఐ నాగరాజు అత్యంత కిరాతకుడు. అసలు ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం నా కొడుకును చంపారో సమాధానం చెప్పాలి. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి" అని ఆమె డిమాండ్ చేశారు.తనకు ఎవరో డబ్బులు ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. "నాకు ఎవడు డబ్బులు ఇచ్చాడో నిరూపించాలని సవాల్ చేస్తున్నా. నాకు ఎలాంటి స్థలాలు, పొలాలు, భూములు వద్దు... నా కొడుకు శవన్ని అయినా ఇవ్వండి లేదంటే కనీసం వాడి బూడిదైనా నాకు ఇప్పిస్తే చాలు" అంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు. నాకు న్యాయం జరిగేంత వరకు నా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ గారికి ఓట్లేస్తే.. మా చెప్పుతో మమ్మల్నే కొట్టుకునేలా చేశారు!
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి విజయలక్ష్మి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన కొడుకును పవన్ కల్యాణ్ ఒక 'కిరాయి హంతకుడు'గా చిత్రీకరిస్తున్నారని, అసలు దానికి రుజువేమిటో ఆయన బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
"నా కొడుకు పవన్ కల్యాణ్ పక్కా అభిమాని. పవన్ కల్యాణ్ కాపు సామాజికవర్గం అని నమ్మి, ఆయన్ను ఆదరించి ఓట్లేస్తే.. ఈ రోజు మా చెప్పుతో మమ్మల్నే కొట్టుకునేలా చేశారు" అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రంగంలోకి విచారణాధికారి: సాక్ష్యాల సేకరణ
మరోవైపు సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై అధికారికంగా మెజిస్టీరియల్ విచారణ శరవేగంగా ప్రారంభమైంది. నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) చట్ట నిబంధనలకు లోబడి, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబ సభ్యుల వాంగ్మూలం: బాధితుడి తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ సాక్ష్యాలను, వాంగ్మూలాన్ని అందించారు.

వైఎస్సార్ సీపీ మద్దతు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత అంబటి రాంబాబు విచారణాధికారిని కలిసి, తన వద్ద ఉన్న కీలక సాక్ష్యాధారాలను అధికారికంగా సమర్పించారు.

ఈ ఘటనకు సంబంధించి ప్రజల దగ్గర ఎలాంటి సమాచారం లేదా సాక్ష్యాలు ఉన్నా, వాటిని విచారణాధికారికి సమర్పించాలని అధికారులు ఒక ప్రకటనలో కోరారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుగుతున్న తరుణంలో, మానవహక్కుల సంఘాలు అక్కడకు చేరుకుని విచారణాధికారి అర్హతను సవాల్ చేశాయి. ఈ కేసును విచారించే అర్హత ప్రస్తుత విచారణాధికారికి లేదని వారు స్పష్టం చేశారు. 2005 నాటి సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ.. లాకప్ డెత్, కస్టోడియల్ టార్చర్ వంటి తీవ్రమైన కేసులను కేవలం 'జ్యూడిషియల్ అధికారులు' (న్యాయమూర్తులు) మాత్రమే విచారించాలని, కాబట్టి ఈ ప్రక్రియను తక్షణమే మార్చాలని డిమాండ్ చేయడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది.
Read More
Next Story