
మార్చి 15న సీబీఐ ముందుకు విజయ్..
టీవీకేతో పొత్తు ఉండదని స్పష్టం చేసిన బీజేపీ నేత కె. అన్నామలై..
తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ మార్చి 15న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముందు హాజరు కానున్నారు. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ ధృవీకరించింది. వాస్తవానికి చెన్నైలో విచారణ నిర్వహించాలని పార్టీ అభ్యర్థించింది. షెడ్యూల్ చేసిన తేదీని కూడా మార్చాలని కోరింది. అయితే వాటికి సీబీఐ అంగీకరించలేదు.
బీజేపీతో పొత్తు ఉంటుందా?
బీజేపీతో పొత్తు గురించి అడిగినప్పుడు.. " పొత్తులకు సంబంధించి మా పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ఏదైనా ఉంటే, మా నాయకుడు విజయ్ స్వయంగా ప్రకటిస్తారు" అని టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ ది ఫెడరల్‌తో అన్నారు.
విజయ్‌పై ఒత్తిడి పెరిగిందా?
విజయ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు సీబీఐ ముందు హాజరు కావడం, మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వాగ్దానాలను ఖరారు చేయడం, ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేయడం వంటి కీలక పనులతో ఆయన బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో టీవీకేతో పొత్తుకు ఎలాంటి అవకాశం లేదని తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై పేర్కొన్నారు. "టీ, కాఫీ కలవవు" అని ఆయన చమత్కరించారు. రెండు పార్టీల సిద్ధాంతాలు, లక్ష్యాలు భిన్నమని పేర్కొన్నారు.

