
విజయ్ ప్రభుత్వ నిర్ణయానికి ఊరట.. ఉద్యోగాలపై స్టేకు నో
కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలపై మద్రాస్ హైకోర్టు స్టే నిరాకరించింది. అయితే నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది.
గత ఏడాది కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీ తొక్కిసలాటలో మరణించిన 41 మంది కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన అప్పీలును శుక్రవారం కోర్టు తిరస్కరించింది. అయితే ఈ నియామకాలు శాశ్వతం కాదని, కేసులో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడే ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
విజయ్ పర్యటన రోజే తీర్పు..
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కరూర్ పర్యటనకు వెళ్లిన రోజే ఈ తీర్పు వెలువడింది. మదురై బెంచ్‌కు చెందిన జస్టిస్ సి.వి. కార్తికేయన్, జస్టిస్ ఆర్. శక్తివేల్‌లతో కూడిన ధర్మాసనం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు చెందిన 32 మందికి నియామక పత్రాలు అందజేశారు.
కోర్టు వ్యాఖ్యలు..
ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో కోర్టు జోక్యం చాలా పరిమితంగా ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో, ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికమేనని స్పష్టం చేసింది. ఉద్యోగం పొందిన వారికి తొలి జీతం అందేలోపు ఈ కేసును మళ్లీ విచారిస్తామని కోర్టు తెలిపింది.
కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో అమలవుతున్న మార్గదర్శకాలపై నివేదిక సమర్పించాలని తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్య కార్యదర్శిని కూడా ఈ కేసులో కోర్టు సుమోటోగా చేర్చింది.
ఎందుకు సవాలు చేశారు?
ఈ నియామకాలపై ఎన్‌టీకే నాయకుడు తీరన్ తిరుమురుగన్, మనితనేయ జననాయక కచ్చి నేత సీని అహ్మద్ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగాలు టీఎన్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా, ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇవ్వడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు విరుద్ధమని వారు వాదించారు.
ఇలాంటి నియామకాలకు స్పష్టమైన విధానం లేకపోవడం వల్ల భవిష్యత్తులో చెడు సంప్రదాయానికి దారితీసే ప్రమాదం ఉందని పిటిషనర్లు తెలిపారు. అంతేకాదు, తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతున్నందున, బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల కీలక సాక్షులపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం, ప్రస్తుతానికి ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కేసు విచారణ కొనసాగుతుందని, తుది తీర్పు వచ్చే వరకు ఈ నియామకాలు తాత్కాలికంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

