
శతాబ్ది వేడుకలకు ముస్తాబైన ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఏయూ శతాబ్ది వేడుకలకు ఉపరాష్ట్రపతి, సచిన్!
ఈనెల 27న జరిగే విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, భారతరత్న సచిన్ టెండూల్కర్‌లు హాజరవుతున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఆవిర్భవించి ఈనెల 26 నాటికి వందేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 27న శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, విశిష్ట అతిథిగా క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్‌లు హాజరవుతున్నారు. వీరితో పాటు ఏయూ ఛాన్సలర్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొంటున్నారు. ఈ విషయాలను ఏయూ వైస్ ఛాన్సలర్ జీపీ రాజశేఖర్ మీడియాకు వివరించారు. అ వివరాలుః
ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
25 వేల మంది విద్యార్థుల సాక్షిగా..
‘ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు 25 వేల మంది విద్యార్థుల సాక్షిగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలను ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు.
ఏయూలో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ భాగం
ఆ రోజు ఏం జరుగుతుందంటే?
ఏయూ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని రోజున ప్రత్యేక తపాళా బిళ్లను, నాణేన్ని, హెరిటేజ్ బుక్, కాఫీ టేబుల్ బుక్, విజన్ డాక్యుమెంట్ వంటివి అతిథుల చేతుల మీదుగా విడుదల చేస్తారు. తొలిదశలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు లాంఛనంగా శంకుస్థాపన చేస్తారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు ఏయూలో పలు పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇంకా విశిష్ట అలుమ్నికి, ఉత్తమ సేవలు అందించిన విశ్రాంత సిబ్బందికి అవార్డులు ప్రదానం చేస్తారు. ఆ రోజు సాయంత్రం 4 నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల్లో ఏయూ పూర్వ విద్యార్థులు, అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారు.
సచిన్ టెండూల్కర్
26న ఏయూ వ్యవస్థాపక దినోత్సవం..
ఈనెల 26న ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికా విద్యార్థులు, తల్లిదండ్రులు, నగర వాసులతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాలతో పాటు నగరంలో వివిధ చోట్ల హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే 15 ఏళ్లకు అవసరమైన కార్యక్రమాల కోసం మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు.
మీడియాతో మాట్లాడుతున్న ఏయూ వీసీ రాజశేఖర్
ప్రారంభమైన శతాబ్ది వేడుకల వారోత్సవాలు..
ఏయూ శతాబ్ది ఉత్సవాలను శనివారం నుంచి వారోత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు అనుబంధ కళాశాలలతో వేడుకలు నిర్వహించారు. 19న ఏయూ ఆర్ట్స్, కామర్స్ కళాశాలలు, ఐఎఎస్‌ఈ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సంయుక్తంగా శతాబ్ది ఉత్సవాలను సెలబ్రేటిం ఎ సెంచరీ ఆఫ్ ఐడియాస్ అనే అంశంపై నిర్వహిస్తారు. 21న కాలేజ్ ఆఫ్ సైన్స్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఏసెంచరీ ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ అనే అంశంపై ఉత్సవాలను నిర్వహించనున్నారు. 22న ఏయూ ఇంజినీరింగ్ కళాశాల, మహిళా ఇంజినీరింగ్ కళాశాలలు టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ బిల్డింగ్ ద నేషన్ షేపింగ్ ద ఫ్యూచర్ అనే అంశంపైన, 23న అంబేడ్కర్ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో కన్సన్స్ ఆఫ్ సొసైటీ అనే అంశంపై శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. వీటితో పాటు ఈ వారోత్సవాల్లో భాగంగా విశిష్ట అతిథుల ప్రసంగాలు, విశిష్ట స్థానాల్లో నిలిచిన పూర్వ విద్యార్థులకు సన్మానాలు, అవగాహన ఒప్పందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నిపుణుల ప్రసంగాలు ఉంటాయి.
Next Story

