
షావుకారు జానకీ
‘షావుకారు’ జానకి కన్నుమూత, మూగబోయిన రాజమండ్రి!
తొలి సినిమానే ఇంటిపేరుగా.. 385కు పైగా చిత్రాల్లో అభినయ ముద్ర: మేటి నటికి ఘన నివాళి
తెలుగు సినిమా స్వర్ణయుగానికి సజీవ సాక్ష్యంగా నిలిచి, తన సహజ నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అలనాటి మేటి నటి షావుకారు జానకి (94) అనంత లోకాలకు వెళ్లిపోయారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె నిష్క్రమణతో దక్షిణాది సినీ రంగంలో ఒక మహోజ్వల శకం ముగిసింది.
‘షావుకారు’ ఇంటిపేరుగా!
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో 1931 డిసెంబర్ 12న జన్మించిన టేకుమళ్ల జానకి.. చిన్ననాటి నుంచే కళల పట్ల మక్కువ పెంచుకున్నారు. 11 ఏళ్ల ప్రాయంలోనే ఆకాశవాణి (రేడియో) నాటకాల్లో గళం వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. రంగస్థలంపై అభినయ అనుభవాన్ని గడించిన ఆమె, 1943లో ‘రక్షరేఖ’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు.
రాజమండ్రిలో, కన్నడ మాధ్వా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. అక్కడే పెరిగింది. తండ్రి టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు. ఈయన ఇంగ్లాండులో మూడేళ్ళపాటు పేపర్ మ్యానుఫాక్చరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆమె తల్లి శచీదేవి. అస్సాం రాష్ట్రం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివారు. ఆమె అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందారు.
జానకి జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా షావుకారు. 1950లో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘షావుకారు’ ఆమె జీవితాన్ని, సినీ ప్రస్థానాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఎంతటి సంచలనం సృష్టించిందంటే.. ఆ చిత్ర శీర్షికే ఆమెకు శాశ్వత ఇంటిపేరుగా మారి ‘షావుకారు జానకి’గా స్థిరపడిపోయింది. ఆమె సోదరి దివంగత ప్రముఖ నటి కృష్ణకుమారి కూడా తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికగా రాణించిన వారే.
నవరసాల నట ప్రయాణం..
ఏ పాత్ర ఇచ్చినా అందులోకి పరకాయ ప్రవేశం చేయడం జానకి ప్రత్యేకత. పక్కింటి అమ్మాయి పాత్రలైనా, ఆదర్శ కోడలిగానైనా, భావోద్వేగాలను పండించే మాతృమూర్తిగానైనా, ఆధునిక భావాలున్న బామ్మ పాత్రలైనా ఆమె జీవించేవారు.
‘వద్దంటే డబ్బు’, ‘కన్యాశుల్కం’, ‘పిచ్చి పుల్లయ్య’, ‘రేచుక్క-పగటిచుక్క’, ‘రోజులు మారాయి’, ‘సొంతవూరు’, ‘జయం మనదే’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘తోడికోడళ్లు’ వంటి క్లాసిక్స్ ఆమె సినీ వైభవానికి నిదర్శనాలు.
ఆ తర్వాత తరంలో ‘సంసారం ఒక చదరంగం’ వంటి కుటుంబ కథా చిత్రాల్లో గంభీరమైన గృహిణిగా, ‘గీతాంజలి’లో భావోద్వేగాల అమ్మమ్మగా, ‘బాబు బంగారం’ మరియు ఇటీవల వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ వరకు సుమారు ఏడు దశాబ్దాల పాటు మూడు తరాల నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కలిపి 385కి పైగా చిత్రాల్లోనూ, హిందీలో 3, మలయాళంలో ఒక చిత్రంలో నటించి దక్షిణాది భాషా సరిహద్దులను చెరిపివేశారు.
మిగిలిన జ్ఞాపకాలు
కళామతల్లికి ఆమె అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’తో సత్కరించింది. కల్మషం లేని నవ్వు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, పాత్రల పట్ల నిబద్ధత ఆమెను సినీ రంగంలో అందరికీ మార్గదర్శిగా నిలిపాయి. తెరపై ఎన్నో కుటుంబ బంధాలను, మానవతా విలువలను ఆవిష్కరించిన జానకి భౌతికంగా దూరమైనా.. ఆమె పోషించిన పాత్రల ద్వారా సినీ ప్రేమికుల మనస్సుల్లో ఎప్పటికీ చిరంజీవిగానే నిలుస్తారు.
Next Story

