అవార్డులో లేని వెలిగొండ బాధితులను ఆదుకుంటారు
x
నిర్వాసితుల్లో ఓ కుటుంబం

అవార్డులో లేని వెలిగొండ బాధితులను ఆదుకుంటారు

2019 తర్వాత 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసిత యువతకు కూడా రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా


పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాల్లో 2019 కటాఫ్‌ తేదీ తర్వాత 18 ఏళ్లు నిండిన యువతకు కూడా తలా రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కటాఫ్‌ తేదీ కారణంగా లబ్ధి దక్కని వారికి కూడా అదే ప్రయోజనాలు అందేలా మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆధునిక దేవాలయాలుగా పేర్కొనే ప్రాజెక్టుల వద్ద భూములు, ఆస్తులు కోల్పోయిన వారందరికీ సాయం అందించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికే 7,027 నిర్వాసిత కుటుంబాలకు రూ.905 కోట్ల ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అందించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు అదనంగా రూ.169 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2019 నుంచి 2026 వరకు 18 ఏళ్లు నిండిన వారందరినీ ఈ జాబితాలో చేర్చాలని, అవార్డులో పేర్లు లేని నిర్వాసితుల్ని గుర్తించి పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. మొత్తం 1,800 గ్రీవెన్సులు, పిటిషన్లను పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

నిర్వాసిత కుటుంబాలకు నెల రోజులకు సరిపడా రేషన్‌ కిట్‌ కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు కోసం గ్రామాలు వదిలి వచ్చిన కుటుంబాల్లో కొత్తగా పెద్దవారైన యువతను విస్మరించకుండా, కటాఫ్‌ తేదీ ప్రయోజనాలను విస్తరించడం ద్వారా పునరావాసాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read More
Next Story