కరువు తీరాలి.. వర్షాలు కురవాలని ధర్మగిరిలో వరుణయాగం
x

కరువు తీరాలి.. వర్షాలు కురవాలని ధర్మగిరిలో వరుణయాగం

సూపర్ ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల వల్ల తిరుమల గోగర్భంతీర్థంలో పండితుల జలసాధనపై ఫోటో స్టోరీ....


రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాల‌ని, స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

తిరుమలలోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్‌.అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో 32 మంది వేద‌, శ్రౌత‌, స్మార్థ‌పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో యాగాలు, జపాలు, పారాయణాలు నిర్వహిస్తున్నారు. ఆరుగురు ఋత్వికులు కారీరిష్టి యాగం చేస్తున్నారు.

ధర్మగిరిలో శాస్త్రోక్తంగా కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాలు ప్రారంభం

గోగర్భం నీటిలో...


వర్షాలు కురవక క్షామ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో టీటీడీ వరుణయాగానికి నాంది పలికింది. ప్రత్యేక విపత్తుల వేళ ఈ తరమా హోమాలు, యాగపూజలు చేయడం ఆనవాయితీ. అందులో భాగంగా టీటీడీ వేదపండితుల్లో 12 మంది ఋత్వికులు తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలోని గోగర్భం తీర్థంలో నడుము లోతు నీళ్లలో నిలబడ్డారు. వరుణ, పర్జన్య మంత్రాలను పఠించారు. ఏడు వేద శాఖలకు చెందిన 14 మంది ఋత్వికులు రామాయణం, భాగవతం, మహాభారతంలోని విరాటపర్వం పారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


ఐదు రోజుల పాటు యాగాలు...

తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆగస్టు 30వ తేదీ వరుణయాగానికి అంకురార్పణ చూశారు. సెప్టెంబర్ మూడో తేదీ వరకు అంటే ఐదు రోజుల పాటు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి.

గతంలో కూడా

వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాలు ఎదురైనప్పుడల్లా శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ వేద క్రతువులను నిర్వహిస్తుంటుంది. గతంలో 2014, 2019, 2023 సంవత్సరాల్లో కూడా లోకకళ్యాణార్థం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ధర్మగిరి పీఠం పండితుల ఆధ్వర్యంలో టీటీడీ కారీరిష్టి యాగం, పర్జన్యశాంతి హోమాలను నిర్వహించింది.
ఈ యాగాలు ఎందుకు నిర్వహిస్తారు?
కారీరిష్టి యాగం: కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయ సంహిత ఆధారంగా మేఘాలను ఆకర్షించి వర్షం కురిపించేందుకు ఈ యాగం చేస్తారు.
వరుణ జపం, పర్జన్యశాంతి: వర్ష దేవుడైన వరుణుడిని, మేఘాధిపతి అయిన పర్జన్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి జపాలు, హోమాలు చేస్తారు.
జల సాధన: పండితులు గోగర్భం తీర్థంలో నడుములోతు నీటిలో నిలబడి మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల ప్రకృత్యనుకూలత లభిస్తుందని నమ్మకం.
గ్రంథ పారాయణం: వర్షాల ప్రసన్నతకు శ్రీమద్రామాయణం (సుందరకాండ), మహాభారతం (విరాటపర్వం - గోగ్రహణ ఘట్టం), ఋష్యశృంగ ఉపాఖ్యానం జపించడంతో కరువు తొలగి వర్షాలు కురుస్తాయని శాస్త్రప్రమాణం.

ఇప్పుడు ఈ యాగం ఎందుకు?

వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా ప్రపంచం మొత్తం సూపర్ ఎల్ నినో పంజా విసిరింది. రుతుపవనాల వల్ల వర్షాలు కురవాల్సిన సమయంలో వర్షాభావం వల్ల కరువు పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ, టీటీడీ వేదపండితులు ఈయాగాలు ప్రారంభించారు. వ్యవసాయానికి నీరు అందక రైతులు ఇబ్బందులు పడకుండా, జలాశయాలు నిండి, సమృద్ధిగా పంటలు పండాలనే ఉద్దేశంతో టీటీడీ ఈ క్రతువును తలపెట్టింది. సమస్త ప్రాణికోటికి తాగునీటి కొరత లేకుండా, దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ యాగం ప్రారంభమైంది.
Read More
Next Story