అమరావతి ఐఆర్‌ఆర్ అలైన్మెంట్ కేసులో ట్విస్ట్
x

అమరావతి ఐఆర్‌ఆర్ అలైన్మెంట్ కేసులో ట్విస్ట్

హైకోర్టులో ముదురుతున్న న్యాయపోరాటం.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) అలైన్మెంట్ కేసు ఇప్పుడు హైకోర్టు వేదికగా సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఈ కేసుపై సోమవారం (మార్చి 9, 2026) జరిగిన విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరు పక్షాల నుంచి దిగ్గజ న్యాయవాదులు రంగంలోకి దిగడంతో ఉత్కంఠ నెలకొంది.

మంగళగిరి మాజీ ఎమ్మెల్యే త్రిముఖ వ్యూహం
ఈ కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టు ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారు. ఈ దర్యాప్తును రాష్ట్ర సంస్థల నుంచి సీబీఐ (CBI)కి బదలాయించాలని ఆయన బలంగా కోరుతున్నారు. అంతేకాకుండా, ఈ కేసును ప్రస్తుతం విచారిస్తున్న ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఆ అధికారం లేదని, తక్షణమే దీనిని ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ డాక్యుమెంట్లు తనకు అందిస్తేనే, లోయర్ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేయగలనని ఆయన తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు.
రంగంలోకి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున దేశంలోని అత్యున్నత న్యాయవాదులలో ఒకరైన ముకుల్ రోహత్గీ వర్చువల్‌గా హాజరై తన వాదనలు వినిపించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ల విచారణ అర్హతపై (Maintainability) తమకు ప్రాథమిక అభ్యంతరాలు ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే ఇవి వేసినట్లు కనిపిస్తున్నాయని, వీటిపై తాము సమగ్రంగా వాదనలు వినిపిస్తామని, అందుకు కొంత సమయం కావాలని రోహత్గీ న్యాయమూర్తిని అభ్యర్థించారు.
16న మధ్యాహ్నం 3 గంటలకు బిగ్ ఫైట్
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి, తదుపరి విచారణను మార్చి 16 (వచ్చే సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. ఆ రోజున ఈ కేసుకు సంబంధించిన అన్ని అనుబంధ పిటిషన్లను కలిపి విచారిస్తామని స్పష్టం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు ద్వారా క్విడ్ ప్రో కో జరిగిందని గత ప్రభుత్వం ఆరోపిస్తుండగా, ప్రభుత్వంపై బురద చల్లడానికే ఈ కేసులని ప్రస్తుత ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో 16న హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read More
Next Story