
తిరుమల శ్రీవారి ఆలయం
టీటీడీ: తిరుమలలో దాతలకు వసతుల కుదింపు?
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు అధ్యక్షతన తిరుమలలో ప్రారంభమైన బోర్డు మీటింగ్.
తిరుమల శ్రీవారికి దాతలు నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. దాతలు లేదా వారి ద్వారా వచ్చే యాత్రికులకు సదుపాయాలు కల్పించే అంశంపై టిటిడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాతలకు కల్పించే సదుపాయాలను కుదించడానికి అవకాశం ఉన్నట్లు సమాచారం.
తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకమండలి సమావేశం చైర్మన్ బీఆర్. నాయుడు అధ్యక్షతన మంగళవారం ఉదయం ప్రారంభమైంది. యథావిధిగాని ఈ పాలకమండలి సమావేశంలో కూడా 62 అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
"టీటీడీ నిర్వహిస్తున్న తొమ్మిది ట్రస్టులకు దాతలు అందిస్తున్న విరాళాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కోటి రూపాయలు ఆపై ఎక్కువ మొత్తం ఇచ్చే దాతలకు మాత్రమే జీవితకాలపు సౌకర్యాలు కొనసాగించడం. మిగిలిన దాతలకు సౌకర్యాలు కుదించడం"పై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాతలకు శ్రీవారి దర్శనం వస్తే కల్పించే అంశంపై గత పాలకమండలి సమావేశంలోనే ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికపై ఈరోజు జరిగే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకొని ఉన్నట్లు తెలిసింది.
వంద గదుల నిర్మాణానికి ఆమోదం?
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం వద్ద టిటిడి ఆధునిక సదుపాయాలు కల్పిస్తోంది. ఒంటిమిట్ట ఆలయం వద్ద యాత్రికులు బస చేయడానికి వీలుగా వంద గదుల భవన నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించే తీర్మానంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నినారు.
టీటీడీలో పనిచేస్తున్న క్వాలిటీ బేస్డ్ కింద కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లింపు విధానంపై కూడా చర్చించడం, శేషాచలం పర్వతసానువుల్లో తిరుమలకు సమీపంలో నిర్మించిన కుమారధార పసుపు ధార జంట ప్రాజెక్టుల మధ్య డబల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం, యాత్రికుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విజిలెన్స్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలిపిరిలో వాహనాల నియంత్రణ తోపాటు భద్రతా వ్యవహారాలపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
మ్యూజియం టికెట్ 50 రూపాయలు?
తిరుమలలో టీటీడీ చారిత్రక అంశాలతో మ్యూజియం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఈ మ్యూజియం సందర్శనకు ఉచితంగానే యాత్రికుని అనుమతిస్తున్నారు. ఇకపై ప్రతి యాత్రికుడు నుంచి 50 రూపాయలు ప్రవేశ రుసుము వసూలు చేయాలని తీర్మానం కూడా ఆమోదించే అవకాశం ఉంది.
తిరుమలలో యాత్రికులకు మెరుగైన వసతి సదుపాయాల కల్పనకు శిథిలావస్థలో ఉన్న టీబీసీ ఏటీసీలో శిథిలావస్థలో ఉన్న పది కాటేజీల తొలగింపు అంశంపై కూడా చర్చించనున్నారు.
తిరుమలలో వేద పారాయణ దారుల నియామకంలో తెలుగు వారికి ప్రాధాన్యత కల్పించే అంశంపై కూడా చర్చించనున్నట్లు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో కళాకారులకు రమ్యునరేషన్ పెంపుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
తిరుమలలో మరో ఏడీ బిల్డింగ్
తిరుపతి నగరంలో టీటీడీ ప్రధాన కార్యాలయం పనిచేస్తోంది. దీనికి సమాంతరంగా తిరుమల లో కూడా అనేక విభాగాలు యాత్రికులకు సేవలందించడం, అన్నదానం, ఇంజనీరింగ్ విభాగం, సేవా టికెట్ల జారీ తో పాటు ప్రోటోకాల్ వ్యవహారాలకు కీలక స్థానంగా తిరుమల నిలిచింది. టీటీడీలోని వివిధ విభాగాలు వేరు వేరు చోట్ల ఉండడం వల్ల యాత్రికులు ఇబ్బంది పడుతున్నారని, దీనికోసం రాంబగీచా అతిథి గృహాల సముదాయం సమీపంలో సెంట్రల్ పరిపాలన భవనం నిర్మాణానికి సంబంధించి కూడా ఈ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
తిరుపతిలోనే తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం టిటిడి నిధులు మంజూరు చేసే అంశంపై కూడా చర్చించి ఆమోదం తెలపనున్నట్లు టిటిడి వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.
Next Story

