వాహనాల్లో వచ్చే శ్రీవారి యాత్రికులకు టీటీడీ బిగ్ అలర్ట్..
యాత్రికులు సులభంగా శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయంటున్న కలెక్టర్
తిరుమల శ్రీవారి యాత్రికులకు సులభ దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీతో కలిసి సమన్వయంతో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ స్పష్టం చేశారు.
తిరుపతిలో వినాయక చవితి ఉత్సవాలు, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీతో సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
ఈ ఏడాది తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనలు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
"తిరుమలలో యాత్రికుల వాహన రద్దీని నియంత్రించేందుకు తిరుపతిలో పార్కింగ్, హెల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశాం. అలిపిరి చెక్‌పాయింట్, జూ పార్క్ సమీపంలోని టీటీడీ స్థలాలు, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశాం" అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. జిల్లా ఎస్పి ఎల్.సుబ్బారాయుడు, టిటిడి అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్యచౌదరి, టిటిడి సివిఎస్ఓ కె.వి.మురళికృష్ణతో కలిసి మాట్లాడిన ఆయన
తిరుమల ఉత్సవం తిరుపతిలో ప్రసారం
తిరుమల రద్దీని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తూ, అవసరమైన సమయంలో భక్తులను హోల్డింగ్ పాయింట్లలో నిలిపి, అక్కడ ఏర్పాటు చేసే ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
పెరటాసి (తమిళమాసం) మాసాన్ని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుపతి నగర శివార్లలో మరో మూడు ప్రత్యేక హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి నగరం, పరిసర పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంతో పాటు విద్యుత్ అలంకరణలు చేపడుతున్నామన్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు (సెప్టెంబర్ 19న)జరిగే గరుడ సేవకు సుమారు 3.5–4 లక్షల మంది భక్తులు, 12,000–13,000 వాహనాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తిరుమల, తిరుపతిలో తగిన పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్ సౌకర్యాలపై జిల్లా పోలీస్, రెవెన్యూ, టీటీడీ అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపడుతోందని టిటిడి సివిఎస్ఓ కేవీ. మురళీకృష్ణ చెప్పారు.
"తిరుమలలో పరిమితంగా ఉన్న పార్కింగ్ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తున్నాం" అని సీవీఎస్ఓ మురళీకృష్ణ చెప్పారు.
ప్రత్యేక రవాణా.. భద్రత
తిరుపతిలో వాహనాలు నిలిపే భక్తులను తిరుమలకు తరలించేందుకు ఆర్టీసీతో సమన్వయంతో ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. అలిపిరి టోల్గేట్, అలిపిరి నడకదారి, శ్రీవారి మెట్టు మార్గాల్లో స్క్రీనింగ్ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.
అలిపిరి వద్ద ANPR, FRS కెమెరాలను ఏర్పాటు చేసి, తిరుమల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. అనుమానితుల కదలికలను గుర్తించి వెంటనే అప్రమత్తం అయ్యేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. తిరుమలతో పాటు తిరుపతిలో ప్రత్యేక సబ్-కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రధాన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడానికి టీటీడీ, పోలీస్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
Next Story

