శ్రీవారి ఆలయంలో 26 నుంచి సాలకట్ల జ్యేష్టాభిషేక ఉత్సవాలు..
x
తిరుమల శ్రీవారి ఆలయం ముందు పల్లకీపై విహరిస్తున్న శ్రీమలయప్పస్వామివారు (ఫైల్)

శ్రీవారి ఆలయంలో 26 నుంచి సాలకట్ల జ్యేష్టాభిషేక ఉత్సవాలు..

జూన్ 28వ తేదీ ఆర్జిత సేవ‌లు రద్దు చేసిన టీటీడీ.


తిరుమల‌ శ్రీవారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ వార్షిక ఉత్సవాల నేపథ్యంలో 28వ తేదీ కళ్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వ సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

తిరుమలలో ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడు రోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. 1990వ సంవ‌త్స‌రంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

వ‌జ్ర క‌వ‌చంలో స్వామివారి ద‌ర్శ‌నం

మొదటిరోజు: శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు.
రెండోరోజు: ముత్యాల‌ కవచం సమర్పిస్తారు.
మూడవ రోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.
"ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు"
తిరుమలలో జ్యేష్టాభిషేకాన్ని పుర‌స్క‌రించుకుని జూన్ 28వ తేదీ కళ్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వ సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.
Read More
Next Story