తిరుమల యాత్రకు వచ్చే యాత్రికులకు వసతులు చాలడం లేదు. పరిస్థితి చక్కదిద్దడానికి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. యాత్రికుల నుంచి మరింత అభిప్రాయాలు సేకరించాలని టీటీడీ సంకల్పించింది. తద్వారా మెరుగైన వసతులు కల్పించడానికి యాత్రికుల నుంచి అందే సూచనలే కీలకంగా తీసుకోవాలని టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర అధికారులకు కర్తవ్య బోధ చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఆయన తిరుపతిలో కల్పిస్తున్న సదుపాయాలు చాలడం లేదని అభిప్రాయపడ్డారు.
"రోజూ వేలాదిగా వచ్చే భక్తులకు ప్రస్తుత వసతి సదుపాయాలు సరిపోవడం లేదు. వాటిని విస్తరించేందుకు సమగ్ర అధ్యయనం చేయండి. తిరుపతిలో వసతి సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టండి" అని టీటీడీ ఈఓ రవిచంద్ర ప్రత్యేకంగా సూచించారు.
తిరుమలకు శ్రీవారి దర్శనార్థం, అంతకుముందు తిరుపతికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని టిటిడి ఈఓ ఎం. రవిచంద్ర అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో బుధవారం టిటిడి అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్యచౌదరి, జేఈవోలు వి.వీరబ్రహ్మం, ఎం.శరత్, సివిఎస్వో కె.వి.మురళీకృష్ణ, సీఈ టివి.సత్యనారాయణ, అడిషనల్ ఎఫ్ఏసిఏఓ రవిప్రసాద్, ఇంఛార్జి లా ఆఫీసర్ వెంకట సుబ్బానాయుడుతో సమీక్షించారు.
"భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించండి. ఇందుకోసం అన్ని ఆలయాల్లో క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేయండి. ఆ సూచనల మేరకు సేవలు మరింత మెరుగుపరచండి" అని
టీటీడీ ఈఓ రవిచంద్ర ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు.
ఎండలు మండుతున్నాయి..
ప్రస్తుతం ఎండలు మండుతున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయ పరిసరాలను ప్రధానంగా మాడవీధులు, రాంచబగీచా అతిథి గృహాల సముదాయం నుంచి కూల్ పెయింట్ చేయించారు. ఏటా వేసవికి మందు ఈ పద్ధతిని
టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు అనుసరిస్తున్నారు.
ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ తీవ్రతను గమనించి, తిరమలలోని ప్రధాన ప్రదేశాల్లో యాత్రికులు నడవడానికి మరింత చల్లబరచడానికి నిరంతరాయంగా నీటిని పిచికారీ చేయించడం అని టీటీడీ ఈఓ రవిచంద్ర సూచించారు.
యాత్రికులకు సదుపాయం..
తిరుమలలో గదులు దొరకని యాత్రికులు ఇబ్బంది పడకుండా ఐదు పబ్లిక్ ఎమినిటీస్ కాంప్లెక్స్ (Public Amenities Complex PAC) అందుబాటులో ఉంచింది.
"పాతబడిన పీఏసీ 1,2 భవనాలు పునరుద్ధరించడానికి ఎన్ఆర్ఐ మంతెన రామలింరాజు గత ఏడాది నవంబర్ లో తొమ్మది కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాకు గతంలోనే చెప్పారు. ఆ భవనాల తొలగింపు కార్యక్రమాలు సాగుతున్నాయి.
"ఆ శిథిలాలను తొలగించడంతో పాటు ఆస్థాన మండాన్ని ఆధునీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయండి" అని టీటీడీ ఈఓ రవిచంద్ర అధికారులను ఆదేశించారు. తిరుమలలో నెయ్యి నిల్వ ట్యాంకులు, ముడి సరుకుల గోదాముల సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త గోదాములు నిర్మించాలని, పెండింగ్ వ్యర్థాలను త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆలయాలకు శ్రీవారిసేవ విస్తరణ
తిరుమలలో యాత్రికులకు శ్రీవారిసేవకులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. రోజుకు తిరుమల, తిరుపతిలో మూడు వేల మంది శ్రీవారి ఆలయంలోని సన్నిధానంతో పాటు అన్నదాన సత్రం, మ్యూజియం, క్యూల్లో యాత్రికులకు అన్నప్రసాదాల పంపిణీ, నీరు, పాలు, మజ్జిగ, కాఫీ తో తేనీరు అందించడంలో సేవలు అందిస్తున్నారు.
తిరుపతిలో కూడా టీటీడీ అనుబంధ ఆలయాల్లో శ్రీవారిసేవకులు స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. 2000 సంవత్సరంలో శ్రీవారిసేవ ప్రారంభించిన తరువాత 25 సంవత్సరాల్లో 16.76 లక్షల మంది సేవలు అందించారు.
టీటీడీ అమలు చేస్తున్న శ్రీవారిసేవను తిరుమల, తిరుపతికి పరిమితం కాకుండా, రాష్ట్రంలోని ఆలయాలకు విస్తరించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి సేవకు వస్తున్న సేవకులు స్వప్రాంతం తోపాటు మిగతా ఆలయాల్లో కూడా సేవలు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
"శ్రీవారిసేవ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ఇతర ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకోండి" అని టీటీడీ చీఫ్ పీఆర్ఓ టి.రవికి ప్రత్యేకంగా ఈఓ రవిచంద్ర సూచించారు. భవిష్యత్తులో వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్ నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు.