మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి
x
రోడ్డు ప్రమాద చిత్రం (ఏఐ క్రియేషన్)

మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.


పుణ్యం కోసం వెళ్లిన భక్తులను విధి వంచించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలోని చిక్‌మంగళూరు ప్రాంతానికి చెందిన భక్తులు మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకోవాలనే కోరికతో బొలెరో వాహనంలో బయలుదేరారు. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపానికి చేరుకోగానే, భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన వారిని వెంటనే ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గురు కన్నుమూశారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక బాలిక ఉన్నారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరు ఎమ్మిగనూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నుజ్జునుజ్జైన వాహనం నుంచి మృతదేహాలను వెలికితీసి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read More
Next Story