నువ్వు లింగమనేని అయితే, నేను బోళ్ల రా! చూస్కుందాం, రా, రా!
x

"నువ్వు లింగమనేని అయితే, నేను బోళ్ల రా! చూస్కుందాం, రా, రా!"

ఓ అమ్మాయి కోసం బెజవాడ పిల్ల రౌడీలు ఎలా కొట్టుకున్నారంటే...


సినిమా తెరపై చూసే హై-వోల్టేజ్ క్లైమాక్స్ సీన్- విజయవాడ నడిరోడ్డుపై లైవ్‌గా రిపీట్ అయితే ఎలా ఉంటుందీ... అచ్చం ఇలాగే ఉంటుంది. ఇదో రియల్ రౌడీయిజం.. డబ్బు మదం, యవ్వనపు పొగరు కలగలిసి ఓ అమ్మాయి కోసం ఇద్దరు ప్రాణ స్నేహితులు నడిరోడ్డుపై సృష్టించిన బీభత్సం ఇది.
"నువ్వు లింగమనేని అయితే, నేను బోళ్ల రా! చూస్కుందాం! రా, రా" అనే రేంజ్‌లో, ఒకరినొకరు సవాల్ విసురుకుంటూ సాగిన ఈ 'రియల్' ఫ్యాక్షన్ సినిమా కథనం మీకోసం..
సీన్ 1: దోస్తీ.. దుష్మనీగా మారిన వేళ!
తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ (ఇంజినీరింగ్ స్టూడెంట్), విజయవాడ భారతీనగర్‌కు చెందిన బోళ్ల ఓమ్ (రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ మంత్రి బంధువు)... ఇద్దరూ నిన్నటి వరకు జిగిరీ దోస్తులు. కానీ, సీన్‌లోకి ఒక అమ్మాయి ఎంటరైంది. అంతే... ఇన్నాళ్ల స్నేహం కాస్తా క్షణాల్లో శత్రుత్వంగా మారిపోయింది.
అహం దెబ్బతిన్న బోల్లా ఓమ్... ఫోన్ తీశాడు.
ఓమ్: "ఎక్కడున్నావ్‌రా నువ్వు? తేల్చేసుకుందాం రా!"
రోహిత్: "పటమట ఆర్‌ఆర్‌ గార్డెన్‌ హైటెన్షన్‌ రోడ్డులో ఉన్నా. దమ్ముంటే రా, చూస్కుందాం!"
సవాల్ విసిరిందే ఆలస్యం... ఓమ్ తన థార్ జీప్‌ వేగంగా స్టార్ట్ చేశాడు. రోహిత్ కూడా తన వెహికల్‌తో రెడీగా ఉన్నాడు.
సీన్ 2: నడిరోడ్డుపై 'థార్' థ్రిల్లర్!
గురువారం రాత్రి... హైటెన్షన్ రోడ్డు ప్రశాంతంగా ఉంది. జనాలు వాకింగ్ చేసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే... సినిమా రేంజ్ ఛేజింగ్ సీన్ మొదలైంది.
ఢీ అంటే ఢీ...
ఓమ్ తన థార్‌ జీప్‌తో వచ్చి రోహిత్ వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు.
కసి తీరలేదు...
రోహిత్ వెనక్కి తగ్గలేదు. తన వాహనంతో ఓమ్ జీప్‌ను గుద్దాడు. ఒకరినొకరు కసిగా, పగతో రోడ్డుపైనే వాహనాలతో పలుసార్లు ఢీకొట్టుకున్నారు.
100 మీటర్ల దూరం బీభత్సం..
అలా ఒకరినొకరు గుద్దుకుంటూ దాదాపు 100 మీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. ఇంజిన్ల గర్జనలు, టైర్ల ఘర్షణలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.
అక్కడ వాకింగ్ చేస్తున్న జనాలు, వాహనదారులు... ఈ లగ్జరీ కార్ల ఫైట్ చూసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయంతో పరుగులు తీశారు. ఏదో సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటే... అక్కడ జరుగుతోంది పక్కా లోకల్ రియల్ ఫైట్!
సీన్ 3: వాహనాలు పగిలాయి... రాడ్లు దిగాయి!
వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. అయినా వారిలోని నడమంత్రపు సిరి, పొగరు చల్లారలేదు. కార్లలోంచి కిందకు దిగారు. చేతుల్లోకి ఇనుప రాడ్లు వచ్చాయి.
ఒకరి కారు అద్దాలను మరొకరు పచ్చడి చేసుకున్నారు.
"నువ్వా-నేనా" అంటూ వీధి రౌడీల్లా నడిరోడ్డుపై కొట్టుకున్నారు.
విచిత్రం ఏంటంటే... ఆ సమయంలో ఒకరి వాహనంలో సదరు వివాదానికి కారణమైన యువతి, మరొకరి వాహనంలో కొందరు యువకులు ఉండి ఈ లైవ్ షోను తిలకించారు.
క్లైమాక్స్ టు పోలీస్ స్టేషన్
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పటమట పోలీసులు సైరన్ వేసుకుంటూ సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. ఖాకీల సౌండ్ వినబడగానే... అప్పటివరకు సింహంలా గర్జించిన లింగమనేని రోహిత్ తన జీప్‌ను అక్కడే వదిలేసి చీకట్లోకి పరారయ్యాడు.
కానీ, బోళ్ల ఓమ్ మాత్రం పోలీసులకు దొరికిపోయాడు. ప్రస్తుతం ఓమ్‌ను స్టేషన్‌లో కూర్చోబెట్టి సీఐ పవన్‌కిషోర్‌ స్టైల్‌లో విచారిస్తున్నారు. కేసయితే బుక్కయింది!
సినిమాలో హీరో, విలన్ కార్లతో గుద్దుకుంటే 'టాకీస్' లో ఈలలు వేస్తారు. కానీ, రియల్ లైఫ్‌లో ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే 'లాకప్' లో చింతబరకలు అరుగుతాయి. నడమంత్రపు సిరి నెత్తికెక్కిన ఈ ధనవంతుల పిల్లలకి చట్టం ఇప్పుడైనా బుద్ధి చెబుతుందేమో చూడాలి!
Read More
Next Story