తిరుపతి:మూడు తరాల గిరిజన కాలనీపై ఎన్ హెచ్ బెల్డోజర్
సీమల్లవరం ఎస్టీలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని వినతి.
తిరుపతి రూరల్ మండలం సీమల్లవరం పంచాయతీ ఎస్టీ కాలనీకి ప్రమాదం ఏర్పడింది. జాతీయ రహదారి విస్తరణ వల్ల మూడు తరాలుగా జీవిస్తున్న 25 గిరిజన కుటుంబాల ఇళ్లను ఎటువంటి ముందస్తు నోటీసులు, ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించకుండా తొలగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
"సీమల్లవరం ఎస్టీలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, పునరావాసం కల్పించండి" అని సీపీఎం నేతలు తిరుపతి ఆర్ఢీఓకు వినతిపత్రం సమర్పించారు.
సీమల్లవరం ఎస్టీ కాలనీలోని గిరిజన కుటుంబాలు గత మూడు తరాలుగా అక్కడే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారని సీపీఎం నాయకులు తెలిపారు. వారి ఇళ్లకు విద్యుత్ మీటర్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తదితర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఉన్నాయని, కాలనీలో ప్రభుత్వం బోరు సౌకర్యం కూడా కల్పించిందని పేర్కొన్నారు. ఇంతకాలంగా ప్రభుత్వ సేవలు పొందుతున్న కుటుంబాలను అకస్మాత్తుగా ఖాళీ చేయాలని చెప్పడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి ఈ కుటుంబాలు తమ నివాసాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, భూసేకరణలో భాగంగా ప్రభావితమయ్యే కుటుంబాలకు చట్టప్రకారం అందాల్సిన నష్టపరిహారం, పునరావాసం, పునరావాస ప్యాకేజీ వంటి హక్కులను ముందుగా కల్పించాల్సి ఉందని సీపీఎం నాయకులు తెలిపారు. 2013 భూ సేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం ప్రకారం ప్రభావిత కుటుంబాల హక్కులను పరిరక్షించకుండా ఇళ్లను ఖాళీ చేయించడం చట్టబద్ధమైన ప్రక్రియ కాదని పేర్కొన్నారు.
గిరిజన కుటుంబాలకు ముందుగా చట్టపరమైన నోటీసులు ఇవ్వాలని, వారి అభ్యంతరాలను స్వీకరించి విచారణ జరపాలని, అర్హత మేరకు పూర్తి నష్టపరిహారం అందించాలని, పునరావాసం మరియు పునరావాస సౌకర్యాలు కల్పించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పేద గిరిజన కుటుంబాల ఇళ్లను కూల్చివేసి వారిని రోడ్డున పడేసే చర్యలకు ప్రభుత్వం పాల్పడితే సీపీఎం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్. జయచంద్ర, రూరల్ కార్యదర్శి కే. సుమన్ మాట్లాడుతూ,
"అభివృద్ధి పేరుతో తరతరాలుగా నివసిస్తున్న గిరిజన కుటుంబాలను బలవంతంగా తరలించడం సరికాదు" అని అన్నారు. జాతీయ రహదారి నిర్మాణం అవసరమే అయినప్పటికీ, ఆ నిర్మాణం కోసం ఇళ్లు కోల్పోతున్న పేదలకు చట్టం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. “ముందు పరిహారం–పునరావాసం, ఆ తర్వాతే తొలగింపు” అనే న్యాయమైన విధానాన్ని ప్రభుత్వం పాటించాలని డిమాండ్ చేశారు.
Next Story

