తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

60 మంది శ్రీవారి యాత్రికులకు శఠగోపం...

నకిలీ సిఫారసు లేఖలతో రూ.4.22 లక్షలు వసూలు...


తిరుమల శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవాలని కొంతమంది యాత్రికుల ఆశ పడ్డారు. ఓ దళారీని ఆశ్రయించారు. 60 మందికి శ్రీవారి సుప్రభాత సేవా టికెట్లు, వసతి సదుపాయం కల్పిస్తానని నమ్మించాడు. వారి నుంచి 4.22 లక్షలు వసూలు చేశాడు. నకిలీ సిఫారసు లేఖలు, టీటీడీ ఉద్యోగుల పేరిట తిరుమల అదనపు ఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. అవన్నీ నకిలీ లేఖలని అధికారులు గుర్తించారు. తాము మోసపోయామని గ్రహించిన గుంటూరు జిల్లాకు చెందిన యాత్రికులు పోలీసులను ఆశ్రయించారు.

"ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం" అని తిరుమల టూ టౌన్ సీఐ శ్రీరాముడు చెప్పారు.
నిందితుడు నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని కూడా ఆయన తెలిపారు. ఈ వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లాకు చెందిన గోపు శ్రీనివాస రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కథనం ఇదీ.
తిరుమలలో నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తితో శ్రీనివాసరెడ్డికి ఎలా పరిచయం అయిందో తెలియలేదు.
"తనకు టిటిడి ఉద్యోగులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయి., ఎంప్లాయీస్ కోటా ద్వారా సుప్రభాత సేవ దర్శన టికెట్లు, తిరుమలలో వసతి గదులు ఏర్పాటు చేయిస్తా" అని నమ్మబలికాడు. దీంతో
"నిమ్మల శ్రీనివాస్ కు 60 మంది శ్రీవారి దర్శనం కోసం రూ.3.60 లక్షలు 12 వసతి గదుల కోసం రూ.62 వేలు ,000/- కలిపి మొత్తం రూ.4,22,000/-ను వివిధ బ్యాంకు ఖాతాలు, డిజిటల్ చెల్లింపు చేశాను" అని బాధితుడు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

తిరుమలకు చేరుకున్నాక..

శ్రీవారిని ఈ నెల 22వ తేదీ దర్శనం చేసుకునేందుకు శ్రీనివాసరెడ్డి బృందం తిరుమలకు వచ్చింది. అనంతరం నిందితుడు కొంతసేపు ఫోన్ ద్వారా మాట్లాడి, తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని బాధితుడు శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. సందేహించి సిఫారసు లేఖలు టిటిడి. అధికారులకు చూపించడంతో అవన్నీ నకీలీవని తేలింది. టిటిడి విజిలెన్స్ అధికారుల సూచన మేరకు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

దళారుల మాటలు నమ్మవద్దు

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, దర్శనం టికెట్లు, ప్రత్యేక సేవలు, వసతి గదుల పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తులతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
"టి.టి.డి. సేవలకు సంబంధించిన అన్ని బుకింగ్‌లు అధికారిక మార్గాల ద్వారానే చేసుకోవాలి. వ్యక్తిగత పరిచయాలు, మధ్యవర్తులు లేదా సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మి నగదు చెల్లించవద్దు" అని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు.
వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు లేదా డిజిటల్ చెల్లింపు వేదికల ద్వారా డబ్బు బదిలీ చేసే ముందు సంబంధిత సేవల ప్రామాణికతను నిర్ధారించుకోవాలి. అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించడంతో పాటు అత్యవసర సేవల నంబర్ 112 లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు సమాచారం అందించాలి అని ఆయన సూచించారు.
Read More
Next Story