శ్రీవారి దర్శనానికి వస్తున్నారా? ఓ క్షణం ఆగండి. ఈ నెల 25వ తేదీ తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకంటే, అపూర్వ ఉత్సవాన్ని చూసే అవకాశం దొరుకుతుంది. శేషాచలం కొండల్లోె కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనంతో పాటు సాయంత్రం ఆయన పద్మావతీదేవిని వివాహం చేసుకున్న ఘట్టం కనులారా చూసూ అవకాశం దక్కుతుంది. ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజులపాటు పద్మావతీదేవితో తిరుమల శ్రీనివాసుడితో జరిగే కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు.
తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో మూడు రోజులు సాయంత్రం వెళల్లో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు కనుల పండువగా నిర్వహించనున్నారు. దీనికోసం టీటీడీ ఉద్యానవన విభాగం కనులవిందుగా పుష్కాలంకరణ తోపాటు ఏర్పాటు చేసిన సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తిరుమల శ్రీవారి యాత్రికులకు ప్రధానంగా వీఐపీ సిఫారసు చేసే ప్రతినిధులకు టీటీడీ ఓ సూచన చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేశాం అని టీటీడీ అధికారులు చెప్పారు.
తిరుమలలో పద్మావతీ పరిణయోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరిణయోత్సవ మండపాన్ని టీటీడీ ఉద్యానవన విభాగం ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
"దశావతారం, అష్టలక్ష్ముల వంటి ఆధ్యాత్మిక రూపాలతో దాదాపు 100 మంది నిపుణులు అలంకరిస్తున్నారు" అని టిటిడి ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. తిరుమలలో వార్షిక ఉత్సవంగా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిచడం వెనుక చారిత్రక నేపథ్య కథనం ఉంది. ఆ విశేషాలు తెలుసుకునే ముందు పద్మావతీ పరిణయోత్సవాలు జరిగే వేళలో తిరుమలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఇవి.
1) ఏప్రిల్ 25 శ్రీ మలయప్పస్వామివారి గజవాహనంపై ఊరేగుతూ యాత్రికులకు దర్శనం ఇస్తారు.
2) ఏప్రిల్ 26వ తేదీ మలయప్పస్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ నారాయణగిరి ఉద్యానవనంలోకి ప్రవేశిస్తారు.
3) నారాయణగిరి ఉద్యానవనంలో ఏప్రిల్ 26వ తేదీ తిరుమలలో అరుదైన ఉత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి మలయప్పస్వామివారు గరుడవాహనంపై ఊరేగుతూ శ్రీవారి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ, గ్యాలరీల్లోని యాత్రికులకు దర్శనం ఇస్తారు. అదే సమయంలో పద్మావతీదేవి చెంతకు నారాయణగిరి ఉద్యానవనంలోకి ప్రవేశిస్తారు.
చారిత్రక నేపథ్యం...
పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట.. అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీవేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.
ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మూడు రోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీపద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.
కనుల పండువగా ఏర్పాట్లు..
తిరుమలలో పద్మావతీ పరిణయోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏర్పాట్లలో టీటీడీ ఉద్యానవన విభాగం కీలకం. కల్యాణ వేదిక నిర్మాణంపై ఆ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఏమి చెప్పారంటే..
"పూణేకు చెందిన శ్రీవేంకటేశ్వర రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ రూ.30 లక్షలతో వేదికను వైభవంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. వారి సహకారంతో కల్యాణ వేదికను తీర్చిదిద్దాం" అని శ్రీనివాసులు వివరించారు.