ఆ పులి పోయింది..ఈ పులి వచ్చింది
x

ఆ పులి పోయింది..ఈ పులి వచ్చింది

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను వణికిస్తున్న బిగ్ క్యాట్.


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులకు పులి పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఒక ప్రాంతం నుంచి పులి వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకునేలోపే, మరో ప్రాంతంలో పంజా విసురుతూ జనాన్ని బెంబేలెత్తిస్తోంది. తాజాగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.

రాజమండ్రి నుంచి ఏలేశ్వరం వరకు.. అంతుచిక్కని ప్రయాణం
కొద్దిరోజుల క్రితం రాజమండ్రి రూరల్ పరిధిలోని తోటలు, కాలువ గట్ల వెంబడి పెద్దపులి హల్‌చల్ చేసింది. అప్పుడు అక్కడ కనిపించిన అడుగుజాడలు, పశువులపై దాడులతో యంత్రాంగం ఉలిక్కిపడింది. ఆ పులి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందని భావిస్తున్న తరుణంలోనే, ఇప్పుడు ఏలేశ్వరం మండలంలోని పరింతడక గ్రామంలో ఈ పులి ప్రత్యక్షమైంది. రాజమండ్రి నుంచి ఏలేశ్వరం వరకు ఉన్న దట్టమైన తోటల గుండా పులి తన ప్రయాణాన్ని సాగిస్తోందా? లేక ఇది మరో కొత్త పులా? అనే కోణంలో అటవీ శాఖ అధికారులు తలమునకలవుతున్నారు.
పామాయిల్ తోటలో పంజా.. భీతిల్లుతున్న మర్రివీడు
ఏలేశ్వరం మండలం మర్రివీడు పంచాయతీ పరిధిలోని పరింతడక గ్రామంలో పులి తన ప్రతాపాన్ని చూపింది. స్థానిక పామాయిల్ తోటలో మేతకు వెళ్లిన గేదె, దూడలపై పెద్దపులి విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనతో తోటలకు వెళ్లే కూలీలు, రైతులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఘటనా స్థలంలో లభించిన అడుగుజాడలను (Pugmarks) పరిశీలించిన అధికారులు, అది పెద్దపులి దాడిగానే నిర్ధారించడంతో స్థానికుల్లో ఆందోళన రెట్టింపయ్యింది.
అటవీ శాఖ రెడ్ అలర్ట్.. రాత్రిపూట కర్ఫ్యూ
పెద్దపులి సంచారంతో ఏలేశ్వరం అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. మర్రివీడు సహా చుట్టుపక్కల గ్రామాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రజలు రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లొద్దని, ఒంటరిగా బయట తిరగొద్దని హెచ్చరించారు. పశువులను ఊరి బయట వదిలేయకుండా, సురక్షితమైన పాకల్లో కట్టి ఉంచాలని సూచించారు. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాప్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచారు.
అధికారులకు కంటిమీద కునుకు లేదు
అటు ఏలూరు (పోలవరం ప్రాంతం), ఇటు కాకినాడ జిల్లాల అధికారులకు ఈ పులి సంచారం సవాల్‌గా మారింది. రాజమండ్రిలో కనిపించిన పులి లక్షణాలతో ఇప్పుడు ఏలేశ్వరంలో కనిపిస్తున్న పులిని పోల్చి చూస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి వచ్చి జనారణ్యంలో తిరుగుతున్న ఈ బిగ్ క్యాట్ ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక అధికారులు, ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
Read More
Next Story