
బంగ్లాదేశ్ నుంచి విశాఖ హార్బర్‌కు పడవలో చేరుకున్న మత్స్యకారులు
హమ్మయ్యా.. ఆ మత్స్యకారులు ఒడ్డున పడ్డారు..!
దాదాపు వంద రోజుల పాటు బంగ్లాదేశ్ జైలులో మగ్గిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు సోమవారం ఉదయం విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు క్షేమంగా తిరిగొచ్చారు.
బంగ్లాదేశ్ చెరలో ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు ఒడ్డున పడ్డారు. గత అక్టోబర్ 21న పశ్చిమ బెంగాల్ సముద్ర జలాల్లో చేపలవేట సాగిస్తూ పొరపాటున బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి ప్రవేశించడంతో ఆ దేశ కోస్టు గార్డు సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం వీరిని ఆ దేశంలోని భాగర్‌హాట్ జైలులో ఉంచారు. అప్పట్నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి విడుదలకు కృషి చేశాయి. ఇరు దేశాల దౌత్య ప్రయత్నాలు ఫలించడంతో దాదాపు వంద రోజుల పాటు జైలులోనే గడిపిన వీరిని ఈనెల 27న జైలు నుంచి విడుదల చేశారు.
హార్బర్లో మత్స్యకారులతో కోస్టుగార్డు, పోలీసు అధికారులు
విడుదలైన ఆరు రోజులకు..
జైలు నుంచి విడుదలైన ఈ మత్స్యకారులు విశాఖపట్నానికి చేరుకోవడానికి ఆరు రోజులు పట్టింది. ఈనెల 27న భాగర్‌హాట్ జైలు నుంచి అక్కడి అధికారులు వీరిని విడుదల చేసిన అనంతరం మోంగ్లా పోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ సీజ్ చేసిన వీరి బోటు (ఇండ్–ఏపీ–వీ5ఎంఎం–735)కు మరమ్మతులు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ కోస్టుగార్డు సిబ్బంది ఈ మత్స్యకారులు అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి తీసుకొచ్చారు. అక్కడ వీరిని భారత కోస్టుగార్డు సిబ్బందికి అప్పగించారు. అనంతరం వీరు తమ పడవలో బయలుదేరి సోమవారం ఉదయం విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. హార్బర్లో వీరికి పోలీసు, కోస్టుగార్డు, మత్స్యశాఖ అధికారులు స్వాగతం పలికారు. వీరి కుటుంబాలకు నిత్యావసర సరకులను అందజేశారు.
కలెక్టర్ హరేందిరప్రసాద్‌ను కలిసిన మత్స్యకారులు
కలెక్టర్‌కు మత్స్యకారుల కృతజ్ఞతలు..
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన తొమ్మిది మంది మత్స్యకారులు సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్ హరేందిరప్రసాద్‌ను కలిశారు. తమ విడుదలకు కృషి చేశారంటూ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
బంగ్లాగేశ్ నుంచి విడుదలైన మత్స్యకారులకు నిత్యావసరాలు
తిరిగొచ్చిన మత్స్యకారులు వీరే..
బంగ్లాదేశ్ చెర నుంచి బయటపడి విశాఖ చేరుకున్న మత్స్యకారుల వివరాలిలా ఉన్నాయి. వీరిలో మరుపిల్లి చిన్నప్పారావు (దిగువ రెల్లివీధి, విశాఖపట్నం), వాసుపల్లి సీతయ్య (కోనాడ, విజయనగరం), మైలపల్లి అప్పన్న (చింతపల్లి, విజయనగరం), సూరపల్లి రాము (పెదకొండరాజుపాలెం, విజయనగరం), మరుపిల్లి ప్రవీణ్ (రెల్లివీధి, విశాఖపట్నం), మరుపిల్లి చిన్నప్పన్న (పెదకొండరాజుపాలెం, విజయనగరం), నక్కా రమణ (కోనాడ, విజయనగరం), మరుపిల్లి రమేష్ (రెల్లివీధి, విశాఖపట్నం), సూరాడ అప్పలకొండ (పెద కొంగవానిపాలెం, విజయనగరం)లు ఉన్నారు.
కుటుంబ సభ్యుల ఆనంద పరవశం..
ఈ మత్స్యకారులు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపలవేటకు అక్టోబర్ 13న వెళ్లారు. అదే నెల 21న బంగ్లాదేశ్ కోస్టుగార్డు సిబ్బంది వీరిని అరెస్టు చేశారు. అంటే వీరు తమ ఇళ్ల నుంచి బయల్దేరి 110 రోజులవుతోంది. తమ వారు బంగ్లాదేశ్ జైలులో బందీలుగా ఉన్నారని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు అప్పట్నుంచి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తమ వారి విడుదలకు చర్యలు తీసుకోవాలని మత్స్యకార నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులను వేడుకుంటూనే ఉన్నారు. ఈనెల 27న బంగ్లాదేశ్ జైలు నుంచి వీరు విడుదలయ్యారని తెలుసుకుని అప్పట్నుంచి వారి రాకకోసం కళ్లలో వత్తులేసుకుని చూస్తున్నారు. సోమవారం ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటున్నారని తెలిసి ఆయా కుటుంబాల వారు వేకువజామునే హార్బర్‌కు చేరుకున్నారు. బోటు నుంచి దిగగానే ఒక్కసారిగా హత్తుకున్నారు. ఆనందభాష్పాలు రాలుస్తూ బిగ్గరగా రోదించారు. మత్స్యకారులు క్షేమంగా తమ ఇళ్లకు చే రుకోవడంతో ఆయా కుటుంబాల్లో ఆనందంతో వెల్లివిరుస్తోంది.
Next Story

