విశాఖ చ‌రిత్ర‌లో అధిక భూకంప తీవ్ర‌త ఇదే!
x
ఆదివారం నాటి భూ ప్ర‌కంప‌న‌ల మ్యాప్

విశాఖ చ‌రిత్ర‌లో అధిక భూకంప తీవ్ర‌త ఇదే!

భూకంప ప్ర‌భావిత జోన్‌లో విశాఖప‌ట్నం లేన‌ప్ప‌టికీ త‌ర‌చూ భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకుంటుండం ఈ ప్రాంత వాసులు భ‌య‌కంపితుల‌వుతున్నారు.

ప్ర‌కృతి వైప‌రీత్యాల‌కు దూరంగా, ప్ర‌శాంత‌త‌కు మారుపేరుగా నిలిచే విశాఖ‌ప‌ట్నం ఇటీవ‌ల కాలంలో జ‌నాన్ని ఒకింత భ‌య‌పెడుతోంది. అప్పుడ‌ప్పుడు భూ ప్ర‌కంప‌న‌లతో అల‌జ‌డి రేపుతోంది. అంతా ఆద‌మ‌ర‌చి నిదుర‌పోతున్న వేళో, వేకువ‌జామునో ఉన్న‌ట్టుండి భూమి కంపిస్తోంది. ఏడెనిమిది నెల‌ల‌ కాలంలోనే రెండుసార్లు భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించి విశాఖ వాసుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. తాజాగా ఆదివారం తెల్ల‌వారుజామున సంభ‌వించిన భూ ప్ర‌కంప‌న‌లతో మ‌రోసారి ఉలిక్కిప‌డేలా చేసింది. అయితే విశాఖ ప్రాంతం భూకంప తీవ్ర‌ ప్ర‌భావిత జోన్‌లో లేనందున ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భూవిజ్ఝాన శాస్త్ర నిపుణులు భ‌రోసా ఇస్తున్నారు.


నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్‌ సిస్మాల‌జీ విడుద‌ల చేసిన ప్ర‌కంప‌నల స‌మాచారం

విశాఖ‌లో తెల్ల‌వారుతుండ‌గానే..

విశాఖ‌ప‌ట్నం, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో అప్పుడ‌ప్పుడూ స్వ‌ల్ప భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌విస్తుంటాయి. వీటిలో చాలావ‌ర‌కు స్థానికుల‌కు తెలియ‌కుండానే ప్ర‌కంపిస్తుంటాయి. మ‌రికొన్ని తేలిక‌పాటి ప్ర‌కంప‌న‌లు అంతా గ‌మ‌నించేలా వ‌స్తుంటాయి. ఎప్పుడైనా ఒకింత శబ్దాల‌తో ప్ర‌కంపించినా అవి ఇళ్లు, గోడ‌లు బీట‌లు వార‌డానికే ప‌రిమిత‌మ‌వుతాయి. అందువ‌ల్ల ప్రాణ‌, ఆస్తి న‌ష్టాల‌కు ఆస్కారం ఉండ‌డం లేదు. తాజాగా విశాఖ న‌గ‌రంతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆదివారం వేకువ‌జామున 5 గంట‌ల 5 నిమిషాల 46 సెక‌న్ల‌కు భూమి కంపించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 4.5గా న‌మోదైన‌ట్టు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సెస్మాల‌జీ తెలిపింది. ఈ భూకంప కేంద్రం విశాఖ‌ప‌ట్నానికి సుమారు 150 కి.మీల దూరంలో బంగాళాఖాతంలో 10 కి.మీల లోతున ఏర్ప‌డిన‌ట్టు గుర్తించింది. ఈ ప్ర‌కంప‌న‌లు న‌గ‌రంలోని తాటిచెట్ల‌పాలెం, అక్కయ్య‌పాలెం, మాధ‌వ‌ధార‌, అల్లిపురం, సింహాచ‌లం, వేప‌గుంట‌, ఎంపీవీ కాల‌నీ, పెద‌వాల్తేరు, ఆరిలోవ‌, అప్పుఘ‌ర్‌, గాజువాక త‌దిత‌ర ప్రాంతాల్లో కొన్ని సెక‌న్ల‌పాటు ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. అప్ప‌టికే మేల్కొన్న వారు ప్రాణ భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఇంకా నిద్రలోనే ఉన్న వారు ఉలిక్కిప‌డి లేచారు. భూకంపం సంభ‌విస్తుంద‌ని ఆందోళ‌న చెందారు. కాసేప‌టి త‌ర్వాత మ‌ళ్లీ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగ‌క‌పోవ‌డంతో హ‌మ్మ‌య్యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖ‌లో ఇదే అతిపెద్ద తీవ్ర‌త..
విశాఖ‌లో ఇప్ప‌టివ‌ర‌కు 2022 మార్చి 27న విశాఖ‌కు 24 కి.మీల ఆగ్నేయంగా బంగాళాఖాతంలో 4.1 మాగ్నిట్యూడ్‌తో న‌మోదైన భూ కంప తీవ్ర‌తే పెద్ద‌ది. 2000 సంవ‌త్స‌రం నుంచి గ‌డ‌చిన 26 ఏళ్ల‌లో విశాఖ‌, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో దాదాపు 15 సార్లు చెప్పుకోద‌గిన స్థాయిలో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. వీటిలో 4కంటే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్‌తో నమోదైనవి రెండు, 3–4 మధ్య తొమ్మిది, 2–3 మధ్య రెండు, రెండు మ్యాగ్నిట్యూడ్‌తో ఒక‌టి చొప్పున నమోద‌య్యాయి. వీట‌న్నిటికంటే ఆదివారం నాటి ప్ర‌కంప‌న‌ల తీవ్ర‌తే (4.5 మాగ్నిట్యూడ్‌) అత్య‌ధికం కావ‌డం విశేషం. గ‌త ఏడాది న‌వంబ‌రు 4న ఉద‌యం విశాఖ‌లో 4.0 మాగ్నిట్యూడ్ తీవ్ర‌త‌తో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. అదే స‌మ‌యంలో విశాఖ స‌హా ఉత్త‌రాంధ్ర, ద‌క్షిణ కోస్తాంధ్ర‌లోనూ ఇవి ప్ర‌భావం చూపాయి. నాటి భూకంప కేంద్రం విశాఖ‌కు దాదాపు 90 కి.మీల దూరంలోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా జి.మాడుగుల స‌మీపంలో భూమికి 10 కి.మీల లోతులో ఏర్ప‌డిన‌ట్టు గుర్తించారు. విశాఖ‌, ప‌రిస‌ర ప్రాంతాల్లో త‌ర‌చూ భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌విస్తున్నా ఎలాంటి ప్రాణ‌, ఆస్థి న‌ష్టం వాటిల్ల‌క పోవ‌డం పెద్ద ఊర‌ట‌గా చెప్పుకోవ‌చ్చు. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 5 మాగ్నిట్యూడ్‌కు, ప్ర‌కంప‌న‌లు ఐదారు సెక‌న్ల‌కు మించ‌క‌పోవ‌డం ప్రాణ‌, ఆస్తి న‌ష్టాల‌కు ఆస్కారం ఇవ్వ‌డం లేదు.

భీమిలి వ‌ద్ద అగ్ని ప‌ర్వ‌తం ఉండేది..

దాదాపు రెండు మూడు కోట్ల ఏళ్ల క్రితం ఇప్ప‌టి భీమిలికి తూర్పున 15-20 కిలోమీట‌ర్ల దూరంలో ఒక అగ్ని ప‌ర్వ‌తం ఉండేద‌ని భూ విజ్జాన శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అప్ప‌ట్లో భూ ప్ర‌కంప‌న‌లు అధికంగా ఉండేవి. కానీ కాల‌క్ర‌మంలో ఆ అగ్ని ప‌ర్వ‌తం క‌నుమ‌రుగై వాటి శిల‌లు కొన్ని మిగిలాయి. అందువ‌ల్ల విశాఖ ప‌రిస‌ర ప్రాంతాల్లో భూమికి బాగా లోతులో అప్పుడ‌ప్పుడు ప్ర‌కంప‌న‌లు సంభ‌వించ‌డానికి కార‌ణ‌మిదేన‌ని వీరు పేర్కొంటున్నారు.

ప్రొఫెస‌ర్ కె.విశ్వ‌నాథ్

ఎక్కువ లోతులో ఏర్ప‌డితే ముప్పు త‌క్కువే..

` భూకంపాలు భూమి అడుగున బాగా దిగువ‌న‌ గాని, స‌ముద్ర గ‌ర్భంలో ఎక్కువ‌ లోతులో గాని ఏర్ప‌డితే దాని తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంటుంది. అదే.. భూమికి అడుగున రెండు, మూడు కిలోమీట‌ర్ల‌లో సంభ‌విస్తే తీవ్ర‌త అధికంగా ఉంటూ ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌విస్తుంది. ఆదివారం నాటి భూ ప్ర‌కంప‌నల తీవ్ర‌త 4.5 మాగ్నిట్యూడ్ అంటే సాధార‌ణంగా ఎక్కువే. అయితే అది బంగాళాఖాతంలో 10 కి.మీలకు దిగువ‌న ఏర్ప‌డ‌డం వ‌ల్ల దాని ప్ర‌భావం భూభాగంపై అత్యంత స్వ‌ల్పంగా ఉంది. ప్రాణ‌, ఆస్తి న‌ష్టం త‌ప్పింది. అదే భూమికి దిగువ‌న 2-3 కి.మీలలో వ‌చ్చి ఉంటే పెను ముప్పు వాటిల్లేది. విశాఖ‌లో 4.5 మాగ్నిట్యూడ్ తీవ్ర‌త‌తో భూ ప్ర‌కంప‌న‌లు రావ‌డం ఇదే తొలిసారి. విశాఖ‌ స‌హా ఉత్త‌రాంధ్ర‌ ప్రాంతం జోన్‌-2 ప‌రిధిలో ఉంది. భూకంపాల వ‌ల్ల విశాఖ‌కు మున్ముందు కూడా ఎలాంటి ముప్పు లేదు. ప్ర‌జ‌లు ఆందోళ‌న ప‌డాల్సిన ప‌ని లేదు` అని విశాఖ‌లోని ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యం జియాల‌జీ విభాగం రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కె.విశ్వ‌నాథ్ `ద ఫెడ‌ర‌ల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌` ప్ర‌తినిధికి చెప్పారు.
Read More
Next Story