జోన్ వ‌చ్చింది.. జోష్ తెచ్చింది..!
x
కొత్త‌గా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాల‌యం

జోన్ వ‌చ్చింది.. జోష్ తెచ్చింది..!

విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్ సోమ‌వారం నుంచి అధికారికంగా కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మ‌య్యాయి.

విశాఖ‌ప‌ట్నం రైల్వే జోన్.. ఈ మాట ఇప్ప‌టిది కాదు.. దాదాపు నాలుగు ద‌శాబ్దాల నుంచి వినిపిస్తున్న మాట‌.. కాదు కాదు.. ఓ నినాదం. ఓ ఉద్య‌మం. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌. ఆశ‌. న‌ల‌భై ఏళ్లుగా ఎన్నో అవాంత‌రాలు, మ‌రెన్నో అడ్డంకుల‌ను అధిగ‌మిస్తూ ఎట్ట‌కేల‌కు జోన్ క‌ల సాకార‌మైంది. దీంతో విశాఖ స‌హా ఉత్త‌రాంధ్ర‌లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది.


జోన్ ప్రధాన కార్యాల‌యం ఉన్న వీఎంఆర్ డీఏలోని ది డెక్

భువ‌నేశ్వ‌ర్‌కంటే ముందే..
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ 1990కంటే ముందే పుట్టింది. అయితే దానికి పురిట్లోనే సంధి కొట్టింది. దాదాపు వైజాగ్‌లో జోన్ ఏర్పాటుకు అడుగు ప‌డుతున్న ద‌శ‌లో ప‌క్క‌నే ఉన్న ఒడిశా పెద్ద‌లు అడ్డం ప‌డ్డారు. కేంద్రంలో వారికున్న ప‌లుకుబ‌డి, ఆ రాష్ట్ర ప్ర‌జాప్ర‌తినిధుల ఐక‌మ‌త్యం వెర‌సి మ‌న‌కు రావ‌ల‌సిన జోన్‌ను భువ‌నేశ్వ‌ర్‌లో ఏర్పాటైంది. ఇక అప్ప‌ట్నుంచి విశాఖ రైల్వే జోన్ ఒక నినాదంగానే మిగిలిపోతూ వ‌చ్చింది.

జోన్ ప్రారంభం సంద‌ర్భంగా విశాఖ రైల్వే స్టేష‌న్‌లో కేక్ క‌ట్ చేస్తున్న టీడీపీ శ్రేణులు

విభ‌జ‌న హామీ చట్టంలో చేర్చి..
ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ 2014లో వేరుప‌డ్డాక అప్ప‌టి కేంద్ర (కాంగ్రెస్‌) ప్ర‌భుత్వం ఏపీలో రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామ‌ని విభ‌జ‌న హామీ చ‌ట్టంలో పేర్కొంది. అయితే దానిని ఎక్క‌డ ఏర్పాటు చేస్తామ‌న్న‌ది అందులో స్ప‌ష్టం చేయ‌లేదు. దీంతో స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. అప్ప‌ట్నుంచి జోన్‌ను విశాఖ‌లో కాకుండా విజ‌య‌వాడ‌/ గుంటూరుల్లో ఏర్పాటు చేయాల‌న్న కొత్త వాద‌న ఆ ప్రాంత వాసుల నుంచి మొద‌లైంది. దీంతో అప్ప‌ట్లో విశాఖ స‌హా ఉత్త‌రాంధ్ర లో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న అప్ప‌టి వైఎస్సార్‌సీపీ నేత‌లు గుడివాడ అమ‌ర్‌నాథ్‌, మ‌రికొంద‌రు నాయ‌కులు ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు దిగారు. వీరితో పాటు టీడీపీ. వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు కూడా వేర్వేరుగా ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. అయినా అప్ప‌ట్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం విశాఖ‌లో రైల్వే జోన్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించ‌లేదు.
ఐదేళ్ల అనంత‌రం ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌..
విభ‌జ‌న హామీ చ‌ట్టంలో 2014లో పేర్కొన్న రైల్వే జోన్‌కు ఐదేళ్ల అనంత‌రం బీజేపీ ప్ర‌భుత్వం క‌ద‌లిక తెచ్చింది. 2019 ఫిబ్ర‌వ‌రి 27న సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ ప్రధాని విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఎన్నిక‌లైపోయాక జోన్ ఊసు లేదు. అతీగ‌తీ లేదు. విశాఖ‌లోని ముడ‌సర్లోవ వ‌ద్ద జోన్ ప్ర‌ధాన కార్యాల‌యానికి అవ‌స‌ర‌మైన స్థ‌లాన్ని అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం కేటాయించింది. అయితే ఆ స్థ‌లాన్ని రైల్వే శాఖ‌కు స‌కాలంలో అప్ప‌గించ‌లేదని కేంద్ర ప్ర‌భుత్వం, ఎప్పుడో అప్ప‌గించేశామ‌ని వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం చెబుతూ వ‌చ్చాయి. ఈలోగా వైఎస్సార్‌సీపీ పాల‌న పోయి రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం రావ‌డం, ఆ భూమిని అప్ప‌గించ‌డం జ‌రిగిపోయాయి. దీంతో ఈ జోన్‌కు క‌ద‌లిక వ‌చ్చి గ‌త‌ ఏడాది జ‌న‌వ‌రి 8న ప్రధాని మోదీ శంకుస్థాప‌న చేశారు. అంటే విభ‌జ‌న హామీ చ‌ట్టంలో పేర్కొన్న ఐదేళ్ల‌కు విశాఖ‌లో జోన్ ఏర్పాటు ప్ర‌క‌ట‌న‌, ఆపై ఐదేళ్ల‌కు శంకుస్థాప‌న జ‌రిగింద‌న్న మాట‌! శంకుస్థాప‌న జ‌రిగిన ఏడాదిన్న‌ర‌కు జోన్ కార్య‌క‌లాపాల‌కు ముహూర్తం కుదిరింఇ. అంటే జోన్ ఉద్య‌మం పురుడు పోసుకున్న న‌ల‌భై ఏళ్ల‌కు జోన్ క‌ల నెర‌వేరింద‌న్న మాట‌!
నాలుగు డివిజ‌న్ల‌తో కొత్త జోన్‌..
కొత్త‌గా రైల్వే జోన్ ఏర్పాటు కావాలంటే క‌నీసం మూడు డివిజ‌న్లుండాలి. ప్ర‌స్తుతం కొత్త‌గా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలోని గుంత‌క‌ల్లు, గుంటూరు, విజ‌య‌వాడ డివిజ‌న్ల‌ను కొత్త జోన్‌లో క‌లిపారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈస్ట్ కోస్్ట రైల్వే జోన్‌లో ఉన్న వాల్తేరు డివిజ‌న్‌ను రద్దు చేసి రెండు భాగాలుగా చేశారు. కొంత భాగాన్ని విడ‌దీసి కొత్త‌గా రాయ‌గ‌డ డివిజ‌న్‌గాను, మిగిలిన భాగాన్ని విశాఖ కేంద్రంగా విశాఖ‌ప‌ట్నం డివిజ‌న్‌గాను విభ‌జించారు. విశాఖ‌ డివిజ‌న్‌ను కూడా సౌత్ కోస్ట్ జోన్‌లో క‌ల‌ప‌డంతో ఈ కొత్త జోన్‌లో నాలుగు డివిజ‌న్లున్న‌ట్ట‌యింది.
ఇదీ రైల్వే జోన్ స్వ‌రూపం..
డివిజ‌న్లుః విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు, గుంత‌క‌ల్లు .
ప‌రిధిః 3,501 కిలోమీట‌ర్లు. రైల్వే స్టేష‌న్లుః 385
సిబ్బందిః సుమారు 17,000 మంది
వార్షికాదాయంః రూ.17,300 కోట్లు
ఇందులో స‌ర‌కు ర‌వాణా ద్వారా ః రూ.12,300 కోట్లు
ప్ర‌యాణికుల ద్వారా ః రూ.4,000 కోట్లు
ఇత‌ర మార్గాల ద్వారా ః రూ.1,000 కోట్లు

నిరాడంబ‌రంగా సౌత్ కోస్ట్ జోన్‌..

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్ర‌ధాన కార్యాల‌యం పూర్త‌యి అందుబాటులోకి రావ‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల అప్ప‌టిదాకా కార్య‌క‌లాపాలు సాగించ‌డం కోసం విశాఖ సిరిపురం జంక్ష‌న్లో ఉన్న వీఎంఆర్‌డీఏ ది డెక్ భ‌వ‌నంలో తాత్కాలిక ప్ర‌ధాన కార్యాల‌యాన్ని తెరిచారు. సోమ‌వారం నుంచి అధికారికంగా కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఎలాంటి అట్ట‌హాసం లేకుండా నిరాడంబ‌రంగానే జోన్ ప్రారంభోత్స‌వాన్ని జ‌రిపించేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఈ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్లుగా క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్న వారు ఒకింత నిరాశ‌కు, అసంతృప్తికి గుర‌య్యారు. మ‌రోవైపు జోన్ కార్య‌క‌లాపాలు మొద‌ల‌వ‌డంతో ఇదంతా త‌మ ఘ‌న‌తేన‌ని చెప్పుకుంటూ విశాఖ‌లో టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.
ఎన్నెన్నో అవ‌మానాలు..
రైల్వే బోర్డు నిర్వ‌హించే ఆర్ ఆర్ బీ ప‌రీక్ష‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఒడిశాలోని వివిధ చోట్ల ప‌రీక్ష కేంద్రాల‌ను కేటాయించేవారు. అక్క‌డ ప‌రీక్ష‌లు రాయ‌డానికి వెళ్లిన అభ్య‌ర్థుల‌పై ఒడిశా నిరుద్యోగులు దాడుల‌కు తెగ‌బ‌డే వారు. దీంతో ఆ ప‌రీక్ష రాయ‌కుండా బ‌తుకు జీవుడా అంటూ ప్రాణ‌భ‌యంతో ఇంటిముఖం ప‌ట్టేవారు. ఇలా నాలుగు ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్నా వారి ఆగ‌డాల‌ను అడ్డ‌కునే వారే లేకుండా పోయారు. ఈ ప‌రిస్థితుల్లో ఈస్ట్ కోస్ట్ జోన్ నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వ్వ‌డ‌మంటే నిరుద్యోగులు హ‌డ‌లెత్తి పోయే ప‌రిస్థితి ఉంది. మ‌రోవైపు విశాఖ‌ప‌ట్నం ఈస్ట్ కోస్ట్ జోన్ ప‌రిధిలో ఉండ‌డం వ‌ల్ల విశాఖ నుంచి బ‌య‌ల్దేరే రైళ్ల‌ను ఒడిశా పాల‌కుల ఒత్తిడితో భువ‌నేశ్వ‌ర్‌కు త‌ర‌లించ‌డం ప‌రిపాటిగా మారింది. దీంతో ఈ ప్రాంత ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. వీటిలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌, ప్ర‌శాంతి వంటివి ఉన్నాయి. ఇంకా గోదావ‌రి ఎక్స్‌ప్రెస్ స‌హా మ‌రికొన్ని కీల‌క‌ రైళ్ల‌ను త‌న్నుకు పోవ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్త జోన్ ఏర్పాటుతో అలాంటి ఆందోళ‌న‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుంది.
రైల్వే జోన్‌తో ఉప‌యోగాలివీ..

రైల్వే జోన్ ఏర్పాటుతో ఈ ప్రాంత వాసుల‌కు ప్ర‌యోజ‌నాలు ఒనగూర‌నున్నాయి. అవేమిటంటే?

+ ఈ ప్రాంతానికి పాల‌నా సౌల‌భ్యం, వేగ‌వంత‌మైన మౌలిక స‌దుపాయాల అభివృద్ది, కొత్త ఉద్యోగ అవ‌కాశాలు, పారిశ్రామిక వృద్ధి, వ్యాపార‌, ర‌వాణా సౌక‌ర్యాలు మెరుగు ప‌డ‌తాయి.

+ పాల‌నా సౌల‌భ్యంః స్థానిక స్థాయిలోనే నిర్ణ‌యాలు వేగంగా తీసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల రైల్వే స్టేష‌న్ల అభివృద్ది, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం త్వ‌రిత‌గ‌తిన జ‌రుగుతుంది.

+ మౌలిక స‌దుపాయాలుః కొత్త‌గా రైల్వే లైన్లు, డబ్లింగ్ ప‌నులు, ఆధునిక స‌దుపాయాల విస్త‌ర‌ణ వేగ‌వంత‌మ‌వుతుంది.

+ ఆర్థిక, పారిశ్రామిక వృద్ధిః ర‌వాణా ఖ‌ర్చులు త‌గ్గి లాజిస్టిక్ హ‌బ్‌గా మార‌డం ద్వారా ఈ ప్రాంతానికి కొత్త ప‌రిశ్ర‌మ‌లు పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌బ‌డ‌తాయి.

+ రైళ్ల సేవ‌లు పెంపుః కొత్త రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డానికి, ప్ర‌యాణ స‌మ‌యాన్ని త‌గ్గించ‌డానికి, రద్దీని నివారించ‌డానికి ఎక్కువ అవ‌కాశాలుంటాయి. ర‌ద్దీక‌నుగుణంగా రైళ్ల‌ను న‌డుపుకోవ‌చ్చు.

+ స్థానికంగానే ఆర్ ఆర్ బీ ప‌రీక్ష‌ల‌ను నిర్విహించుకోవ‌చ్చు
Read More
Next Story