సింహాద్రి అప్పన్న నిజరూపం అపురూపం!
x
విద్యుత్‌ కాంతులతో శోభిల్లుతున్న సింహాచలం

సింహాద్రి అప్పన్న నిజరూపం అపురూపం!

చందనోత్సవం సందర్భంగా సింహాచలం శ్రీవరాహ లక్షీ నరసింహుడు భక్త జనులకు నిజరూప దర్శనం ఇచ్చాడు.


ఏడాదికి ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగే సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. ఏటా వైశాఖ శుద్ద తదియ నాడు ఈ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. అందులోభాగంగా ఆదివారం అర్థరాత్రి నుంచే భక్తజన సందోహం సింహగిరికి పోటెత్తింది. అర్థరాత్రి ఒంటి గంట తర్వాత నుంచి ఆలయ సంప్రదాయం ప్రకారం చందనోత్సవ క్రతువు మొదలైంది. దీంతో సింహాచలం కొండ గోవింద, హరినామ స్మరణలతో మారుమ్రోగిపోయింది.


సింహాద్రి నాథునికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న అశోక్‌ గజపతిరాజు

అర్థరాత్రి అప్పన్నను మేల్కొలిపి..
ఆదివారం అర్థరాత్రి దాటాక ఒంటిగంటకు ఆలయ అర్చకులు అప్పన్న స్వామిని మేల్కొలిపారు. చతుర్వేదాలు, పురాణ, ఇతిహాస ప్రబంధ పారాయణం, పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విశ్వక్షేన ఆరాధన, పుణ్యాహవచనాది వైదికాదులు పూర్తి చేశారు. స్థానాచార్యులు టీవీ రాజ గోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు సారధ్యంలో అర్చక స్వాములు ఉపవాస దీక్షతో అంతరాలయంలోకి ప్రవేశించారు. వెండి బొరిగెలతో స్వామిపై ఏడాదిగా ఉన్న చందనాన్ని అతి సున్నితంగా తొలగించారు. దీంతో స్వామి వారు తన నిజరూపంలోకి వచ్చారు. అనంతరం సుగంధ భరిత శ్రీగంధాన్ని స్వామి శిరస్సు, వక్షస్థలంపై సమర్పించాక ఆ క్రతువు పూర్తయింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు పట్టుకెళ్తున్న హోంమంత్రి అనిత

పూసపాటి వంశీయుల పూజలతో..
సింహాచలం చందనోత్సవం నాడు విజయనగరం రాజులైన పూసపాటి వంశీయులకు శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి తొలి దర్శనం చేయించడం ఆనవాయితీ. ఆ ప్రకారమే ప్రస్తుత గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు, ఆయన కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి, దివంగత ఆనంద గజపతిరాజు కుటుంబ సభ్యులు కలిసి పూసపాటి వంశీయుల తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వారికి తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామి తొలి దర్శనం కల్పించారు. ఆపై భక్తులను దర్శనానికి అనుమతించారు. దీంతో చందనత్సోవం ప్రారంభమైంది.
పట్టువస్త్రాలు సమర్పించిన హోంమంత్రి..
అప్పన్న స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత కొందరు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు సింహాద్రినాథుని దర్శించుకున్నారు. ఏడాదిలో ఒకే ఒక్క రోజు నిజరూపంలో దర్శనమిచ్చే సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శన భాగ్యం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన భక్తులు ఆ స్వామిని కళ్లారా చూసి ఉప్పొంగిపోయారు. ఆనందంతో పరవశించిపోయారు.

స్వామి దర్శనానికి క్యూలైన్లలో నిల్చున్న భక్తులు

అధికారులు ముందస్తు ఏర్పాట్లు..
గత ఏడాది చందనత్సోవం రోజున నిర్మాణంలో ఉన్న గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి చందనోత్సవానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చే పట్టారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డులో ప్రైవేటు వాహనాలను అనుమతించలేదు. కొండ దిగువ నుంచి కొండపైకి సుమారు వంద ఆర్టీసీ బస్సులను సమకూర్చి భక్తులు ఉచితంగా వెళ్లి వచ్చేలా చూశారు. దర్శనానికి వెళ్లే భక్తులు క్యూ లైన్లలో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా స్లాట్లను కేటాయించారు. 2,800 మంది పోలీసులతో బందోబస్తును నిర్వహించారు. ఇంకా ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగేలా క్యూలైన్లలో కనోపీలను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో నిల్చున్న వారికి మంచినీళ్లు, మజ్జిగ, పాలు, బిస్కెట్లు, గ్లూకోజ్‌ నీళ్లు వంటివి ఎప్పటికప్పుడు అందజేశారు.
ఈ ఏడాది తగ్గిన భక్తుల సంఖ్య..
ఈ ఏడాది చందనోత్సవానికి భక్తుల సంఖ్య తగ్గింది. గత సంవత్సరం లక్షా 20 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. కానీ ఈసారి సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు 87,308 మంది (వీరిలో 58,189 మంది ఉచిత దర్శనం) మాత్రమే దర్శించుకున్నారు. రాత్రి వరకు దర్శనానికి అనుమతిస్తే మరో 20–25 వేల మంది వరకు ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన గత ఏడాదికంటే భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. రూ. 300, 1,000, 1,500 దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తుల్లో మూడో వంతు రాకపోవడం విశేషం! చందనోత్సవానికి 46,431 టిక్కెట్లను విక్రయించారు. వీటిలో సాయంత్రం ఐదు గంటల వరకు 29,119 మంది మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. కాగా ఈసారి చందనోత్సవానికి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. కానీ అంచనా ప్రకారం భక్తులు రాకపోవడంతో రద్దీ ఏర్పడలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దీంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Read More
Next Story