గంజాయి దెబ్బ.. కుత్తుక తెగ్గోసే పగ: గన్నవరంలో ఘోరం..
x

గంజాయి దెబ్బ.. కుత్తుక తెగ్గోసే పగ: గన్నవరంలో ఘోరం..

కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగిన ఈ ఘోర హత్య తీవ్ర కలకలం రేపింది.


మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. నిన్నటివరకు కలిసి తిరిగిన స్నేహితులే.. గంజాయి, మద్యం మత్తులో శత్రువులుగా మారారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని, ఒకరిపై ఒకరు దాడికి దిగి.. చివరకు ఒకరి ప్రాణం తీసేవరకు వెళ్లారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగిన ఈ ఘోర హత్య ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

స్నేహానికి అడ్డువచ్చిన 'గంజాయి' మత్తు

పోలీసుల కథనం ప్రకారం.. కంకిపాడు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పామర్తి హేమకుమార్‌ (21) అలియాస్‌ బిగిల్‌కు గన్నవరం మండలం అల్లాపురంలో బంధువులు ఉన్నారు. ఆ బంధువుల ఇంటికి తరచూ వచ్చే క్రమంలో హేమకుమార్‌కు అదే గ్రామానికి చెందిన వెలివెల జయంత్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా కాలక్రమేణా స్నేహంగా మారింది.
అయితే, ఇద్దరికీ గంజాయి తాగే అలవాటు ఉండటంతో.. జల్సాల కోసం పలు అసాంఘిక కార్యకలాపాల్లో కూడా పాలుపంచుకునేవారు. వీరిద్దరిపై ఇప్పటికే పలు కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం వీరి మధ్య గంజాయి వ్యవహారంలో తీవ్ర మనస్పర్థలు తలెత్తి, ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.
క్రికెట్ గ్రౌండ్‌లో మొదలైన గొడవ
శనివారం ఉదయం చినఆవుటపల్లి పరిధిలోని రుషివాటిక సమీపంలో యువకులు క్రికెట్‌ ఆడుకునే మైదానంలో హేమకుమార్, జయంత్ ఇద్దరూ అనుకోకుండా ఎదురుపడ్డారు. పాత కక్షలు మనసులో ఉండటంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి, ఆవేశంతో పరస్పరం దాడులకు దిగారు. అక్కడే ఉన్న తోటి యువకులు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీసి అక్కడి నుంచి పంపించివేశారు.
కత్తితో కాపు కాసి.. విచక్షణా రహితంగా దాడి
ఉదయం జరిగిన గొడవతో జయంత్ మనసులో కసి పెరిగిపోయింది. హేమకుమార్‌ను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశాడు. శనివారం సాయంత్రం బుద్ధవరం పంచాయతీ కార్యాలయం సమీపంలో సాధారణంగా వీరు గంజాయి సేవించే రహస్య ప్రాంతానికి జయంత్ ముందే కత్తితో చేరుకుని కాపు కాశాడు.
అక్కడికి హేమకుమార్ రాగానే, మద్యం మరియు గంజాయి మత్తులో ఉన్న జయంత్ ఒక్కసారిగా కత్తితో విరుచుకుపడ్డాడు. హేమకుమార్‌పై విచక్షణా రహితంగా మూడుసార్లు కత్తితో పొడిచి, రక్తపు మడుగులో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
తీవ్రంగా గాయపడిన హేమకుమార్‌ను స్థానికులు గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. రక్తస్రావం ఎక్కువగా అవుతుండటంతో ప్రాథమిక చికిత్స నిమిత్తం తొలుత డా.పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (GGH)కి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ హేమకుమార్ ప్రాణాలు విడిచాడు.
గన్నవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు జయంత్ కోసం ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు
Read More
Next Story