
పొదుపు ‘డ్రామా’... సెక్యూరిటీ ‘విలాసం’ కొనసాగుతోంది!
సీఎం, మంత్రులు వాహనాల సంఖ్య తగ్గించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పైలట్ వాహనాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఉద్యోగుల జీతాలు, పథకాలు సక్రమంగా చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు చర్యలు చేపట్టారు. కాన్వాయ్ వాహనాలు 11 నుంచి 4కి తగ్గించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు రెండు వాహనాలకు పరిమితం. ఇది పొదుపు పాటించే చర్యగా కనిపించవచ్చు... కానీ వాస్తవం దానికి భిన్నం.
పైన పొదుపు, క్రింద సెక్యూరిటీ ‘భారం’ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు పోలీసు పైలట్ వాహనాలు, ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇది అనుమతించకూడదు. అయినా జరుగుతోంది. అంతకు మించి, గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారికి కూడా పోలీసు ఎస్కార్ట్ ఇవ్వడం విచిత్రం. యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ ఎరిక్షన్ బాబు దీనికి ఉదాహరణ.
గతంలో సీఎం కాన్వాయ్
ప్రధాన మంత్రి సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. అంటే... స్వయంగా ఆర్థిక సంక్షోభం గుర్తించి కాదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లనే జ్ఞానోదయం అయిందా? గతంలో విచ్చలవిడిగా కాన్వాయ్‌లు, విలాసాలు కొనసాగించిన ఇదే పాలకులు ఇప్పుడు ‘పొదుపు’ అంటూ కొత్తగా కనిపెట్టారా?
నిజమైన పొదుపు అంటే పైనుంచి కింది వరకు సమానంగా అమలు కావాలి. కానీ ఇక్కడ పై అధికారులు కొంత తగ్గించుకుంటే, ఓడిపోయిన నాయకులకు కూడా సెక్యూరిటీ ‘ప్రత్యేకాధికారం’ కొనసాగుతోంది. ఇది ప్రజల డబ్బుతో జరుగుతున్న రాజకీయ భద్రతా విలాసమే కాకుండా మరేమిటి?
ఈ పొదుపు నిజమైనదా? లేదా ఎన్నికల తర్వాత ‘ఇమేజ్’ మేనేజ్‌మెంట్ మాత్రమేనా? ప్రజలు గమనించాల్సిన సమయం ఇది.

