కార్మికుల కుటుంబాలకు మిగిలిన రక్తపు మరకలు!
x
కాలి ముద్దయిన మృత దేహాలు

కార్మికుల కుటుంబాలకు మిగిలిన రక్తపు మరకలు!

వేట్లపాలెం దుర్ఘటన కోట్ల మందిని ఆలోచింప చేస్తోంది...


వేట్లపాలెం దుర్ఘటన హృదయవిదారకం. రోజూ మాదిరే ఆ రోజు పనికి వెళ్లిన కార్మికులు, తమ కుటుంబాలకు ఒక్క రొట్టె ముక్కయినా తెచ్చుకోవాలని రిస్క్ తీసుకుంటున్నారు. వారిలో చాలామంది మహిళలు, యువకులు. ఒక్క పేలుడు. అంతే.. ఆ కార్మికుల కలలు బూడిదైపోయాయి. ఒక కార్మికుని కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ ‘‘మా అన్నయ్య రోజూ పనికి వెళ్తాడు, ఇంటికి తిరిగి వస్తాడు. ఇప్పుడు ఆ ఆశ లేదు’’ అని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి ఫ్యాక్టరీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇస్తున్నాయి. కానీ సేఫ్టీ నిబంధనలు పాటించలేదు. ప్రాణాలు పోతున్నాయి. గతంలో కోనసీమ జిల్లాలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్‌వర్క్స్‌లో 10 మంది మరణించిన ఘటన గుర్తుకు వస్తోంది. అనకాపల్లిలో 8 మంది మరణించిన సంఘటన కూడా మరువలేము.


కార్మికుల ప్రాణాలకు ధర కట్టి, ఎక్స్‌గ్రేషియా ఇచ్చి సరిపెట్టడం సమాజంలోని దారుణతను చూపిస్తోంది. ఫార్మసీ కంపెనీల్లో విషవాయువులు పీల్చి మరణించినవారు, ఇలాంటి ఫైర్‌వర్క్స్ యూనిట్లలో పేలుళ్లకు బలైపోయినవారు, అందరూ సాధారణ కూలీలే. వారి చావు ‘‘షరా మామూలు’’గా మారిపోతుందా? బంధువులు రెండు రోజులు కన్నీళ్లు కార్చి మరచిపోతారా…? ఎవరిని కదిలించినా అవుననే సమాధానమే వస్తోంది. ఇదీ మన ‘కార్మిక భారతం’ దురవస్థ. సేఫ్టీ ప్రమాణాలు కఠినంగా అమలు చేయాలి. ఫ్యాక్టరీల్లో ట్రైనింగ్, ఇన్‌స్పెక్షన్లు తప్పనిసరి చేయాలి. ప్రభుత్వం విచారణలు ఆదేశించినా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. లేకుంటే మరిన్ని కుటుంబాలు శాశ్వతంగా దుఃఖంలో మునిగిపోతాయి. ఒక సారి ఒక సంఘటన జరిగితే అదే తరహా సంఘటనలు తిరిగి పునరావృతం అవుతున్నాయంటే పాలకుల మాట అధికారులైనా వినకుండా పోవాలి. లేదా పాలకుల్లో నిర్లక్ష్యమైనా ఉండాలి. ఈ రెండు కలిస్తేనే ఇటువంటి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి.


ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని శ్రీసూర్య ఫైర్‌వర్క్స్ యూనిట్‌లో జరిగిన భారీ పేలుడు 23 మంది కార్మికులను సజీవ దహనం చేసింది. ఈ దుర్ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన గతంలో జరిగిన ఇలాంటి దుర్ఘటనలను గుర్తుచేస్తూ, కార్మికుల ప్రాణాల విలువను ప్రశ్నిస్తోంది.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి, బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్ గ్రేషియో, క్షత గాత్రులకు రూ. 50వేలు సాయం అందిస్తామని ఎక్స్ లో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించి, సహాయక చర్యలు, విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. కాకినాడలోని ప్రభుత్వ వైద్యశాలలో క్షతగాత్రులను పరామర్శించారు.
20 లక్షలు చనిపోయిన వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియో, క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఇదీ సీఎం బాధితులపై చూపిన జాలీ, దయ.

ఫైర్‌వర్క్స్ తయారీలో ఉపయోగించే అత్యంత పేలుడు పదార్థాలు, బహుశా ఎలక్ట్రిక్ షాక్ లేదా మిస్‌హ్యాండ్లింగ్ వల్ల పేలాయని ప్రాథమిక అంచనా. ఫ్యాక్టరీలో అప్పటికి సుమారు 50 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం. మృతుల్లో సామర్లకోట, వేట్లపాలెం, హుస్సేన్‌పురం గ్రామాలకు చెందినవారు ఉన్నారు. 12 మంది మృతదేహాలు గుర్తించారు. మిగిలినవి ఇంకా గుర్తించాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఫైర్ డిపార్ట్‌మెంట్ బృందాలు స్థలంలోనే ఉన్నాయి.

ఈ దుర్ఘటన మనందరినీ ఆలోచింపజేయాలి. ప్రాణాలకు ధర కట్టడం సరిపోతుందా? లేదా మానవీయతతో కూడిన మార్పు అవసరమా?

Read More
Next Story