పరకామణిలో చోరీపై విచారణ ఎందుకు జరపరు? వైసీపీ ప్రశ్న
x

పరకామణిలో చోరీపై విచారణ ఎందుకు జరపరు? వైసీపీ ప్రశ్న

భక్తులు భక్తితో సమర్పించుకున్న కానుకలకు రక్షణ కరువైందని వైసీపీ ఆరోపిస్తోంది.


ఏడుకొండల వాడి చుట్టూ వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. భక్తులు భక్తితో సమర్పించుకున్న కానుకలకు రక్షణ కరువైందంటూ వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు సంబంధించిన మీడియా ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే తిరుమల శ్రీవారి పరకామణిలో భారీ స్థాయిలో బంగారం, వెండి వస్తువుల చోరీ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా ఉధృతంగా ప్రచారం చేస్తోంది. తిరుమల శ్రీవారి పరకామణిలో దాదాపు కోటి రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువుల చోరీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
అసలేం జరిగింది?
పరకామణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వి. పెంచలయ్య, 2024 సెప్టెంబర్ నుండి స్వామివారి బంగారం, వెండిని చోరీ చేస్తున్నట్టు వైసీపీ ఆరోపించింది. విజిలెన్స్ విచారణలో కూడా ఈ విషయం బయటపడిందని చెబుతోంది.

వైసీపీ వర్గాల కథనం ప్రకారం "జనవరి 11న 100 గ్రాముల బంగారు బిస్కట్‌ను ట్రాలీ రంధ్రం ద్వారా దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అయితే, ఇది కేవలం ఒక రోజు జరిగిన దొంగతనం కాదు.. నెలల తరబడి సాగిన భారీ కుంభకోణమని పోలీసుల సోదాల్లో బయటపడింది. నిందితుడు పెంచలయ్య శ్రీవారి సొమ్మును దొంగిలించడమే కాకుండా, వాటిని తిరుపతిలోని ప్రముఖ కార్పొరేట్ నగల దుకాణాల్లో మార్పిడి చేసి కొత్త నగలు తీసుకోవడం, మరికొన్నింటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందడం వంటివి చేశాడు. ఇందుకు సంబంధించిన ఇన్వాయిస్‌లు, బ్యాంక్ రశీదులు లభ్యమైనా.. పోలీసులు ఆ జ్యువెలరీ షాపుల యజమానులను గానీ, బ్యాంకు అధికారులను గానీ విచారించకపోవడం వెనుక పెద్ద గూడుపుఠాణీ ఉంది."
ప్రభుత్వ తీరుపై విమర్శలు..
గతంలో వైసీపీ హయాంలో రూ. 76 వేల విలువైన విదేశీ కరెన్సీ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి నుండి రూ. 15 కోట్ల ఆస్తులను రికవరీ చేసిన విషయాన్ని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కోటి రూపాయల దొంగతనం జరిగితే కేవలం 555 గ్రాముల బంగారాన్నే రికవరీ చూపించి కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. నిందితుడు పెంచలయ్యకు వెంటనే బెయిల్ రావడంలో టీటీడీ, ప్రభుత్వం పరోక్షంగా సహకరించాయని ఆరోపించాయి.
ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటకు రాకుండా దర్యాప్తును కేవలం ఒక చిన్న ఉద్యోగికి పరిమితం చేశారని వైసీపీ మండిపడుతోంది. "కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలి. పరకామణిలో దొంగతనాలు జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉండటం వెనుక అర్థమేమిటి?" అని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ప్రశ్నిస్తున్నారు.
శ్రీవారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే, దొంగలకు అండగా నిలుస్తోందన్న చర్చ ఇప్పుడు భక్తులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అసలు దొంగలను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
(గమనిక:ఈ వార్తా కథనంతో ది ఫెడరల్ కి ఏమి సంబంధం లేదు. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ప్రకటన ఆధారంగా ఈ వార్తను ఇస్తున్నాం)
Read More
Next Story