
‘‘ప్రపంచ కేంద్రం సాంకేతికతతో మారుతోంది’’
ప్రధాని నరేంద్ర మోదీ
వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ శక్తి సమీకరణాలను కూడా మార్చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయలేమని, అందుకే జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండటమే విజయానికి కీలకమని ఆయన సూచించారు. శనివారం ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని.. పట్టభద్రులైన విద్యార్థులకు భవిష్యత్తుపై పలు సూచనలు చేశారు.
ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాలు వేగంగా మారుతున్నాయని, దీనికి సాంకేతిక పురోగతి ప్రధాన కారణమని మోదీ పేర్కొన్నారు. రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో ప్రపంచం, సాంకేతికత, పరిశ్రమలు, వృత్తులు ఏ విధంగా మారతాయో ఎవరూ కచ్చితంగా చెప్పలేరని అన్నారు. నిరంతరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు ఆకాంక్షలను ప్రస్తావించిన మోదీ.. ప్రతి ఒక్కరి మనసులోనూ భవిష్యత్తుపై ఒక ఆలోచన, ఒక దార్శనికత ఉంటుందని అన్నారు. తమ లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
పరిశోధన రంగంలో యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. దేశంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ప్రధానమంత్రి పరిశోధన ఫెలోషిప్ ద్వారా ప్రతిభావంతులైన యువతకు పరిశోధన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ పథకాన్ని ప్రారంభించామని మోదీ తెలిపారు. దేశంలో సైన్స్, పరిశోధనలకు ఊతమిచ్చేందుకు జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరిశోధన రంగానికి రూ.1 లక్ష కోట్ల వరకు నిధులు సమకూరుస్తున్నామని, ‘ఒక దేశం ఒక చందా’ కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని ప్రతిష్టాత్మక పరిశోధనా జర్నల్స్‌ను దేశంలోని చిన్న పట్టణాలకూ అదనపు ఖర్చు లేకుండా అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.
అలాగే, దేశ భవిష్యత్తులో యువత పోషించే పాత్రను కూడా ప్రధాని గుర్తుచేశారు. ప్రతి తరం తన కాలంలోని సవాళ్లను ఎదుర్కొంటూనే జాతీయ బాధ్యతను కూడా నిర్వర్తించాల్సి ఉంటుందని అన్నారు. రాబోయే 30 నుంచి 35 ఏళ్లలో పట్టభద్రులు తీసుకునే ప్రతి నిర్ణయం వికసిత్ భారత్ లక్ష్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. తమ నిర్ణయాలు దేశానికి ఎలా ఉపయోగపడతాయి, దేశ అవసరాలను ఎలా తీర్చగలవనే అంశాన్ని యువత ఆలోచించాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ఐఐటీ ఢిల్లీ సోనిపట్ క్యాంపస్‌లో ఏఐ ఆధారిత హై-పెర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సదుపాయం ‘పరం ప్రజ్ఞ’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటింగ్, ఇతర అంతరశాఖ పరిశోధనల్లో ఈ సదుపాయం కీలకంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఈ స్నాతకోత్సవంలో 587 మంది పీహెచ్‌డీ స్కాలర్లతో సహా 3,000 మందికి పైగా విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారు.

