బాంబే హైకోర్టుకు చేరిన ఈ20 వివాదం
x
నితీన్ గడ్కరీ

బాంబే హైకోర్టుకు చేరిన ఈ20 వివాదం

ఇథనాల్ కలపడం వల్ల గడ్కరీ కుటుంబం లాభపడుతుందని సోషల్ మీడియాలో ప్రచారం


పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) అమలుతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబం ఆర్థికంగా లాభపడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పోస్టులు, డీప్‌ఫేక్ కంటెంట్‌పై సివిల్ పరువు నష్టం దావా వేయడానికి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం, లెటర్స్ పేటెంట్‌లోని క్లాజ్ XII కింద గడ్కరీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఈ కేసులో మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ కార్ప్, గూగుల్ ఎల్‌ఎల్‌సి (యూట్యూబ్), కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ విభాగాన్ని ప్రతివాదులుగా చేర్చారు. అలాగే, సంబంధిత కంటెంట్‌ను సృష్టించి వ్యాప్తి చేసిన గుర్తుతెలియని వ్యక్తులను "అశోక్ కుమార్లు/జాన్ డోస్"గా పేర్కొన్నారు.

ఈ వ్యవహారం జస్టిస్ అభయ్ అహుజా ఎదుట విచారణకు రాగా, గడ్కరీ తరఫు న్యాయవాది సందీప్ ఎస్. లడ్డా దావా దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ముంబైలోని వినియోగదారులు కూడా ఈ పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను చూడగలుగుతున్నందున, ఈ దావాకు సంబంధించిన కారణం ఆ నగర పరిధిలో కూడా ఉత్పన్నమైందని ఆయన వాదించారు.

వాదనలు పరిశీలించిన న్యాయస్థానం, మెటా సహా వివిధ సోషల్ మీడియా వేదికలు, గుర్తుతెలియని వ్యక్తులు మరియు ఇతర సంబంధిత సంస్థలపై సివిల్ దావా వేయడానికి గడ్కరీకి అనుమతి మంజూరు చేసింది.

దావాలో, E20 కార్యక్రమం పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని, అయినప్పటికీ తానే వ్యక్తిగతంగా ఆ కార్యక్రమానికి బాధ్యుడినన్న భావన కలిగించేలా, తన కుటుంబం దాని ద్వారా ఆర్థిక లాభం పొందిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని గడ్కరీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పోస్టులు, డీప్‌ఫేక్ వీడియోలు పూర్తిగా అవాస్తవమని, దురుద్దేశంతో తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో రూపొందించబడినవని ఆయన ఆరోపించారు.

తన ప్రజాప్రతినిధి హోదాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారనే తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఈ కంటెంట్ రూపొందించబడిందని దావాలో పేర్కొన్నారు. అందువల్ల సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పరువు నష్టం కలిగించే పోస్టులు, ట్వీట్లు, రీల్స్, వీడియోలు, డీప్‌ఫేక్ కంటెంట్‌పై శాశ్వత నిషేధాజ్ఞలు జారీ చేయాలని కూడా ఆయన కోర్టును కోరారు.

ఇటీవల E20 పెట్రోల్ వినియోగంపై మైలేజీ తగ్గడం, ఇంజిన్‌కు నష్టం కలుగుతోందంటూ కొందరు వాహనదారులు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే, ఆ ఆరోపణలను గడ్కరీ ఇప్పటికే ఖండించారు.


Read More
Next Story