
విశాఖ రైల్వే జోన్ ఏమిటీ? దాని వల్ల మనకు మేలేమిటీ!
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కార్యకలాపాల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అసలు ఈ రైల్వే జోన్ ఏమిటి? దీని వల్ల విశాఖకు, ఏపీకి జరిగే మేలేమిటీ?
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway - SCoR) జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి ఈ జోన్ తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించనుంది.
రైల్వే జోన్ అంటే ఏమిటి?
సాధారణంగా భారతీయ రైల్వేలు పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని పలు జోన్లుగా విభజించాయి. ప్రతి జోన్‌కు ఒక జనరల్ మేనేజర్ (GM) నాయకత్వం వహిస్తారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రైల్వే మార్గాలు సికింద్రాబాద్ (దక్షిణ మధ్య రైల్వే), భువనేశ్వర్ (తూర్పు కోస్తా రైల్వే) కేంద్రాల నుంచి నియంత్రించేవి. ఇప్పుడు విశాఖ కేంద్రంగా జోన్ రావడంతో, రాష్ట్రంలోని రైల్వే వ్యవహారాలన్నీ ఏపీ నుంచే పర్యవేక్షిస్తారని అంచనా.
జోన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు
తాజా గెజిట్ ప్రకారం, ఈ కొత్త జోన్ పరిధిలోకి ఏపీలోని కీలక డివిజన్లు చేరాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు పూర్తిగా విశాఖ జోన్ పరిధిలోకి వస్తాయి.
రాయగడ డివిజన్‌లోని పలాస - ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం - దువ్వాడ - విజయనగరం లైన్లు ఇప్పుడు విశాఖ డివిజన్‌లో కలిశాయి.
నౌపడా - బొబ్బిలి - సాలూరు మరియు సింహాచలం - వడ్లపూడి వంటి కీలక లైన్లు కూడా ఇందులో విలీనమయ్యాయి.
కోరాపుట్ - కిరండోల్ లైన్‌ను విశాఖ, రాయగడ డివిజన్లు సంయుక్తంగా నిర్వహిస్తాయి.
జోన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
నిర్ణయాధికారం మన దగ్గరే...
గతంలో కొత్త రైళ్లు కావాలన్నా, స్టేషన్ల ఆధునీకరణకైనా భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ అధికారులపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు విశాఖలోనే జీఎం కార్యాలయం ఉండటం వల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు వేగంగా జరుగుతాయి.
ఉపాధి అవకాశాలు పెరుగుతాయి...
జోనల్ కార్యాలయం రావడం వల్ల భారీస్థాయిలో ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. జీఎం కార్యాలయంలోనే సుమారు 1,200 మంది సిబ్బంది అవసరం ఉంటుంది.
జోన్ అంతటా కలిపి దాదాపు 17,000 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంది.
ఇప్పటికే ఇతర డివిజన్ల నుంచి సుమారు 3,000 మంది ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి...
ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా వీఎంఆర్‌డీఏ డెక్‌లోని రెండు అంతస్తుల్లో కార్యకలాపాలు సాగుతాయి. జోన్ రాకతో విశాఖ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి హంగులతో మరింత అభివృద్ధి చెందుతుంది.
ఆదాయం, ప్రాధాన్యత...
విశాఖ రైల్వే డివిజన్ దేశంలోనే అత్యధిక ఆదాయం గడించే డివిజన్లలో ఒకటి. ఇప్పుడు అది జోన్‌గా మారడం వల్ల, ఇక్కడ వచ్చే ఆదాయం ఈ ప్రాంత రైల్వే అభివృద్ధి కేటాయింపులకే ఖర్చు చేసే అవకాశం పెరుగుతుంది.
ప్రయాణం సాగిందిలా..
2019 ఫిబ్రవరి: కేంద్ర ప్రభుత్వం జోన్ ఏర్పాటుపై తొలిసారి ప్రకటన చేసింది.
2025 జనవరి: డీపీఆర్ (DPR) ఆమోదం పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోనల్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు.
2026 మే: అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల.
2026 జూన్ 1: కార్యకలాపాల ప్రారంభం.
ఇప్పటికే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్లు, ఫైనాన్షియల్ ఆఫీసర్లు వంటి కీలక అధికారుల నియామకం పూర్తయింది. జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే కూత కొత్తగా వినిపించనుంది.
Next Story

