అమరావతి నిర్మాణం కేవలం కాంట్రాక్ట్ కాదు..అదొక చరిత్ర
x

అమరావతి నిర్మాణం కేవలం కాంట్రాక్ట్ కాదు..అదొక చరిత్ర

సీఎం చంద్రబాబు శనివారం క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.


అమరావతి నిర్మాణం కేవలం కాంట్రాక్ట్ కాదని, అదొక చరిత్ర అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై చంద్రబాబు శనివారం క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులతో మాట్లాడిన ఆయన, పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని కరాఖండిగా చెప్పారు. మీరు కడుతోంది కేవలం భవనాలు కాదు.. ఒక చారిత్రాత్మక రాజధాని నగరాన్ని. ఈ మహా నిర్మాణంలో భాగస్వాములయ్యే వారంతా చరిత్రలో నిలిచిపోతారు అని కాంట్రాక్టర్లలో స్ఫూర్తి నింపారు.

నిర్దేశిత లక్ష్యాలు: వారానికి రూ. 941 కోట్ల పనులు
రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. మొత్తం రూ. 57,821 కోట్ల విలువైన పనుల్లో ఇప్పటికే రూ. 50,943 కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం 20 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా, యంత్ర సామగ్రిని మరింత పెంచాలని సీఎం సూచించారు. వర్షాకాలం రాకముందే మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేయాలని, దీనికోసం వారానికి రూ. 941 కోట్ల విలువైన పనులు పూర్తి కావాలని లక్ష్యంగా విధించారు.
నిర్మాణ సంస్థలకు గ్రీన్ ఛానెల్ భరోసా
పనులకు ఎక్కడా ముడి పదార్థాల కొరత లేకుండా ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ద్వారా ఇసుక, గ్రావెల్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తోందని సీఎం తెలిపారు. నిధుల కొరత లేదని స్పష్టం చేస్తూ, కాంట్రాక్ట్ సంస్థలు మ్యాన్ పవర్, మెషినరీని పెంచుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణంలో ఎక్కడా నాణ్యత తగ్గకూడదని, వాటిపై రాజధాని ముద్ర స్పష్టంగా కనిపించాలని స్పష్టం చేశారు.
భద్రతపై హెచ్చరిక
ఇటీవల రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యం వహించే ప్రసక్తే లేదని, నిర్మాణ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలకు ఆయా నిర్మాణ సంస్థలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు ఉంటాయని కరాఖండిగా చెప్పారు.
ఫ్యూచర్ సిటీగా అమరావతి
అమరావతిని ప్రపంచస్థాయి ఫ్యూచర్ సిటీగా నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. గ్రీన్ ఎనర్జీ , అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. వినూత్న ఆలోచనలు ఉన్న సంస్థలు వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చని ఆహ్వానించారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేసి, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read More
Next Story