
సింహాద్రి అప్పన్న నిజరూపం
అదిగదిగో చందన రహిత అప్పన్న నిజరూపం!
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సోమవారం కనుల పండువుగా జరగనుంది.
ఏడాదిలో ఒకే ఒక్కరోజు తన నిజరూపాన్ని భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు సింహాద్రి అప్పన్న. విశాఖపట్నానికి సమీపంలో సింహగిరిపై కొలువై ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామికి ఏటా ౖÐð శాఖ శుద్ధ తదియ నాడు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఏడాది పొడవునా చందనం పూతలోనే కనిపించే స్వామి ఒక్క చందనోత్సవం రోజున మాత్రమే నిజరూపంలో ఒంటిపై గంధం లేకుండా దర్శనమిస్తాడు. అంటే నిత్యరూపం నుంచి నిజరూపంలో కనువిందు చేస్తాడన్న మాట! మరికొద్ది గంటల్లో ఆ వేడుక మొదలు కానుంది.
సింహాచలం ఆలయ గోపురం
వేకువజామున 3 గంటల నుంచే..
ఏడాదిలో 364 రోజులూ సింహాద్రి అప్పన్నస్వామి గంధపు పూతతోనే ఉంటారు. చందనోత్సవం వేకువజామున స్వామికి ఉన్న చందనాన్ని వలిచి భక్తులకు కు స్వామి నిజరూపాన్ని దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు. ఇందులోభాగంగా సోమవారం వేకువజామున ఒంటి గంట నుంచి గంధం వలిచే కార్యక్రమాన్ని చేపడ్తారు. అనంతరం ఆచారం ప్రకారం తొలి దర్శనం దేవస్థానం అనువంశిక «దర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు (ప్రస్తుత గోవా గవర్నర్) చేసుకుంటారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. ఉచిత దర్శనం, రూ.300 దర్శనం తెల్లవారుజామున 3 గంటల నుంచి, రూ.వెయ్యి టిక్కెట్టు దర్శనం ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు, రూ.1,500 టిక్కెట్టు దర్శనం ఉదయం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు స్వామి అంతరాలయ దర్శనం కల్పిస్తారు. రూ.300, సర్వదర్శనం సహా ఇతర భక్తులకు నీలాద్రి గుమ్మం నుంచే లఘు దర్శనానికి అనుమతిస్తారు.
రూ.వెయ్యి టిక్కెట్టు క్యూలైన్
చందనోత్సవ ఏర్పాట్లు ఇలా..
చందనోత్సవం నిర్వహణకు విశాఖ జిల్లా యంత్రాంగం, దేవదాయశాఖ, జీవీఎంసీతో కలిసి అన్ని ఏర్పాట్లు చేసింది. సింహాచలం కొండపైన, దిగువన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు, భక్తులకు మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు వంటివి అందుబాటులో ఉంచారు. ఇంకా 372 మొబైల్ టాయిలెట్లను, అంబులెన్సులను సిద్ధం చేశారు. కొండపైకి వెళ్లడానికి వంద ఉచిత బస్సులను సమకూర్చారు. ప్రోటోకాల్ వాహనాలు తప్ప ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ స్పష్టం చేశారు. వాహనాల పార్కింగ్ కోసం 32 ప్రాంతాలను సిద్ధం చేశారు. భక్తులు ఎండ బారిన పడకుండా క్యూలైన్ల పొడవునా కనోపీలను ఏర్పాటు చేశారు. క్యూలైన్లు వేగంగా కదలడానికి తిరుమల, విజయవాడ దేవస్థానాల నుంచి అనుభవజ్ఞులైన సిబ్బందిని తీసుకొచ్చారు. భక్తులు ఒకేసారి పోటెత్తకుండా స్లాట్లను కేటాయించారు.
క్యూలైన్లను పరిశీలిస్తున్న కలెక్టర్ అభిషిక్త్ కిషోర్
ఏఐ టెక్నాలజీ.. డ్రోన్ సాంకేతికత..
ఈసారి చందనోత్సవంలో భద్రత ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా కృత్రిమ మేథ (ఏఐ)తో పాటు డ్రోన్ సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించ నున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఆలయ పరిసరాల్లో ఉంటారు. ఇంకా 2,800 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. పార్కింగ్, హోల్డింగ్ ప్రాంతాల్లో షామియానాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బాంబు డిస్పోజల్ టీమ్‌ను అందుబాటులో ఉంచుతున్నారు.
రెండు లక్షల మంది భక్తులు రాక?
గత సంవత్సరం చందనోత్సవానికి లక్షా 20 వేల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామి దర్శనానికి రూ.300, 1,000, 1,500 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించారు. ఇలా 40 వేల వరకు టిక్కెట్లను విక్రయించారు. మిగతా వారిని ఉచితంగా దర్శనానికి (సర్వ దర్శనానికి) అనుమతించనున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులు స్వామిని దర్శించుకోవడానికి క్యూలైన్లలోకి అనుమతిస్తారు. ఆపై క్యూలైన్లో ఉన్న వారికి మాత్రమే దర్శనం కల్పిస్తారు.
గతేడాది దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం..
చందనోత్సవ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. చందనోత్సవం అర్థరాత్రి నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ఈ దుర్ఘటన జరిగింది. దీన్ని దృషిలో ఉంచుకుని ఈసారి అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. సింహాచలం కొండపై నిర్మాణాలను ముందుగానే పూర్తి చేశారు. క్యూలైన్ల గోడలు, భవనాలు, గేట్ల పటిష్టతను పరిశీలించి అవి సరిగా ఉన్నట్టు ఆర్‌అండ్‌బీ అధికారులతో స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్లు తీసుకున్నారు. క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో నియమించారు. దీంతో ఈ ఏడాది సింహాచలం చందనోత్సవం ఎలాంటి ఇబ్బందులు, అపశృతులు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరుగుతుందన్న భావనతో ఇటు భక్తులు, అటు అధికారులు ఉన్నారు.
Next Story

