ఏపీలో 44 డిగ్రీలు దాటింది..రేపు 101 మండలాల్లో వడగాలుల ముప్పు
x

ఏపీలో 44 డిగ్రీలు దాటింది..రేపు 101 మండలాల్లో వడగాలుల ముప్పు

ఏకంగా 275 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటింది.


రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం ఏకంగా 275 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటగా, పలు జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 44.6°C ఉష్ణోగ్రత నమోదవ్వగా, పల్నాడు జిల్లా గురజాలలో 44.5°C , కడపలో 44.1°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సెగల తీవ్రత ఇప్పుడప్పుడే తగ్గేలా లేదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

నేడు (ఏప్రిల్ 16) ఎండల తీవ్రత, వడగాలుల అంచనా
గురువారం నాడు ఎండలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43°C నుంచి 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 34 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వెరసి 101 మండలాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వడగాలుల ప్రభావం చూపే జిల్లాలు
వడగాలుల ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉండనుంది. వీటితో పాటు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాల్లోని పలు మండలాలపై కూడా దీని ప్రభావం ఉండనుంది. శుక్రవారం నాడు కూడా సుమారు 65 మండలాల్లో వడగాలుల ముప్పు కొనసాగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు
ఎండలు, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ కోరారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్ , బీపీ ఉన్నవారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బయట తిరగరాదని హెచ్చరించారు. మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే వేడిగాలి చెవుల్లోకి వెళ్లకుండా స్కార్ఫ్ లేదా టోపీ వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఆరోగ్య పరిరక్షణ - ఆహార నియమాలు
శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తుంది. వడదెబ్బకు గురికాకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
Read More
Next Story