రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన, ఇదే ఏపీ ఘనత!
x
కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తున్న చంద్రబాబు

రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన, ఇదే ఏపీ ఘనత!

టీమ్ స్పిరిట్‌తోనే స్వర్ణాంధ్ర సాధ్యం- కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు


రాష్ట్ర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అద్భుత ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు దక్కించుకున్నందుకు మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈ అవార్డు తన ఒక్కడిది కాదని, గ్రామ స్థాయి ఉద్యోగి నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరి సమిష్టి కృషి (టీమ్ ఏపీ స్పిరిట్) అని కొనియాడారు.

గత విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు..
గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు, రూ. 1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులను భారంగా మిగిల్చారు. కేంద్ర పథకాలకు సంబంధించిన రూ. 10 వేల కోట్లను కూడా దారి మళ్లించారు. వినాశనమైన రోడ్లు, వ్యవస్థలను బాగు చేస్తూ ఇప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం.
పాలనలో వేగం- ప్రజల్లో నమ్మకం..
సుపరిపాలన అందించడంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'తో పాటు 'స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్' అత్యంత కీలకమని సీఎస్ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. 2027 మార్చి నాటికల్లా రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి కావాలని, భూ వివాదాల్లేని ఏపీని చూడాలని సీఎం ఆదేశించారు. రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం లభించిందని, 24 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రులు వివరించారు.
పారిశ్రామిక ప్రగతి..
రాయల్ ఎన్‌ఫీల్డ్, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీకి రావడం రాష్ట్రంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని సీఎం అన్నారు.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్: ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ ప్రతి పైసాను ప్రజల మేలు కోసమే ఖర్చు చేస్తున్నామని, వృధా ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్: రిజిస్ట్రేషన్ శాఖను సిటిజెన్ ఫ్రెండ్లీగా మార్చామని, 1.37 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించి ప్రజలకు ఊరటనిచ్చామని తెలిపారు.
విద్యా రంగంలో సరికొత్త ఒరవడి
పదో తరగతి ఫలితాల్లో రాణించిన విద్యార్థులను రియల్ హీరోలుగా గుర్తించి, వారి ఫోటోలతో ప్రకటనలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరలేపిందని సీఎం అన్నారు. కార్పొరేట్ సంస్థల తరహాలో ప్రభుత్వ విద్యార్థులను ప్రోత్సహించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ముఖ్యమైన అంశాలపై సమీక్ష..
ఈ రెండ్రోజుల సదస్సులో ఈ క్రింది అంశాలపై లోతైన సమీక్ష జరగనుంది.
స్వర్ణాంధ్ర విజన్ 2047: ముఖ్యమంత్రి నిర్దేశించిన 10 సూత్రాల అమలు.
సింగపూర్ పర్యటన వివరాలు: మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ తదితరులు తమ శిక్షణ అనుభవాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
జీఎస్డీపీ గ్రోత్: జిల్లాల వారీగా ఆర్థిక వృద్ధిపై అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు.
జలధార & విద్య-వైద్యం: ప్రాథమిక రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన.
"డబ్బులు లేవని ఆగిపోవడం కాదు.. సంపద సృష్టించి అభివృద్ధి చేద్దాం" అన్న నినాదంతో సీఎం చంద్రబాబు అధికారులను మోటివేట్ చేశారు. ప్రతి మూడు నెలలకోసారి జరిగే ఈ సమావేశం మంత్రులు, అధికారులకు ఒక పరీక్ష వంటిదని, ప్రజల సంతృప్తి స్థాయియే తమ పాలనకు కొలమానమని ఆయన పునరుద్ఘాటించారు.
Read More
Next Story