వైజాగ్‌లో నడిస్తే పన్ను!
x
విశాఖ పార్కులో నడుస్తున్న వాకర్లు

వైజాగ్‌లో నడిస్తే పన్ను!

ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరమైన విశాఖపట్నంలో సరికొత్తగా నడకపై పన్ను విధించడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అప్పుడెప్పుడో ఔరంగజేబు పాలనలో జుత్తు కత్తిరించుకుంటే పన్ను చెల్లించే విధానాన్ని అమలు చేశాడని చరిత్ర చెబుతోంది. అప్పట్లో అదో ప్రజా వ్యతిరేక చర్యగా అందరిలోనూ పాతుకుపోయింది. అందుకే ఇప్పటికీ ఏదైనా ప్రభుత్వం అలవి మాలిన పన్ను విధిస్తే ఔరంగజేబు కాలం నాటి జిజియా పన్నునే గుర్తుకు తెచ్చుకుంటారు. ఇప్పుడు విశాఖ వాసులు అలాంటి పరిస్థితినే మననం చేసుకుంటున్నారు.


జీవీఎంసీ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న వాకర్లు

నడిస్తే పన్ను చెల్లించాల్సిందే..
విశాఖ మహా నగరంలో ఉదయం, సాయంత్రం అన్ని వయసుల వారు నడకకు ప్రాధాన్యమిస్తారు. ఆరోగ్య స్పృహతో క్రమం తప్పకుండా నడుస్తుంటారు. వాకర్లు పార్కులు, స్టేడియంలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను ఎంచుకుంటారు. ఇన్నాళ్లూ వీటిలో ఎన్నాళ్లు నడిచినా పైసా కూడా చెల్లించాల్సిన అవసరం రాలేదు. ఉచితంగానే నడకకు అనుమతించే వారు. ఇప్పుడు మునుపటిలా ఫ్రీగా నడుస్తామంటే కుదరదు. వాకర్లు ఎవరైనా వాటిలో నడిస్తే ‘పన్ను’ చెల్లించాల్సిందేనంటోంది జీవీఎంసీ. ఇదే ఇప్పుడు వైజాగ్‌లోని అన్ని వర్గాల్లోనూ ఆగ్రహానికి కారణమవుతోంది. హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా జీవీఎంసీ పరిధిలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, గాజువాక రాజీవ్‌గాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, అనకాపల్లి ఇండోర్‌ స్టేడియం తదితర ప్రాంతాలు, మరికొన్ని పార్కుల్లో ఉచితంగా నడవడానికి వీల్లేదన్న నిబంధన పెట్టారు. వీటిలో నడవాలనుకున్న వారు ఇకపై సంవత్సరానికి రూ.720 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి యూజర్‌ చార్జి అనే పేరు పెట్టారు.

నడకపై పన్నుకు నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు

విద్యార్థులనూ వదలడం లేదు..
అంతేకాదు.. ఆయా స్టేడియాలు, పార్కుల్లో క్రీడా శిక్షణ పొందే స్కూలు, కాలేజీల విద్యార్థినీ విద్యార్థులు ఆటలాడుకోవాలన్నా, వ్యాయామం చేయాలన్నా, ఆహ్లాదం పంచుకోవాలన్నా చేతి చమురు వదిలించుకోవల్సిందే. ఇకపై టెన్నిస్, బ్యాడ్మింటన్, కరాటేలకు నెలకు రూ.వెయ్యి, స్విమ్మింగ్‌కు రూ.1,500తో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద మరో రూ.3 వేలు చెల్లించాలి. దీంతో ఈ విద్యార్థులు ఏటా రూ.12 వేల నుంచి 15 వేల వరకు సమర్పించుకోవలసి వస్తుందన్న మాట. గతంలో స్విమ్మింగ్‌కు మాత్రమే రూ.500 వసూలు చేసేవారు. మిగతా వాటికి ఉచితంగానే అనుమతించే వారు. జీవీఎంసీ తాజా నిర్ణయంతో ఆయా పార్కులు, స్టేడియాల్లో ఆటపాటలు, నడక, వ్యాయామాలకు నిర్దేశిత సొమ్ము చెల్లించడం ఈనెల ఆరంభం నుంచి తప్పనిసరయింది.
నిరసనలు.. ఆందోళనలు..
విశాఖలో నడకపై పన్నులు విధించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ తీరుకు నిరసనగా వాకర్స్‌ అసోసియేషన్లు, ప్రజా సంఘాలు, వామపక్ష అనుబంధ సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. నగరంలోని స్వర్ణభారతి స్టేడియం ఎదుట బుధవారం సీపీఐ (ఎం) మద్దిలపాలెం జోనల్‌ కమిటీ నిరసన వ్యక్తం చేసింది. నడకపై కూడా పన్ను విధింపుతో చంద్రబాబు ప్రభుత్వం తుగ్లక్‌ పాలనను మరపించిందని ఎద్దేవా చేసింది. దేశంలో ఎక్కడా నడకపై పన్ను విధించలేదని గుర్తు చేసింది. మరోవైపు వాకర్స్‌పై పన్ను విధింపునకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని, వాకర్స్‌ నుంచి యూజర్‌ చార్జీల వసూలు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించింది. ‘పార్కులు, స్టేడియాల్లో యూజర్‌ చార్జిలు వసూలు నిర్ణయంతో సీనియర్‌ సిటిజన్లు, పిల్లలు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతారు. వృద్ధులు నడకకు దూరమవుతారు.
వాకర్స్‌కు హానికరం. జీవీఎంసీ ఇతర ఆదాయ మార్గాలను వెతుక్కోవాలి తప్ప వాకర్స్‌ టాక్స్‌ వసూలు తప్పు’ అని అక్కయ్యపాలేనికి చెందిన రిటైర్డ్‌ బ్యాంకు మేనేజర్‌ కుండల ఢిల్లీరావు అభిప్రాయపడ్డారు.

వార్వా అధ్యక్షుడు ఎన్‌. ప్రకాశరావు

ప్రజల ఆరోగ్యంపై ప్రభావం..
జీవీఎంసీ వాకర్స్‌ నుంచి యూజర్‌ చార్జీలు వసూలు నిర్ణయం పెద్ద తప్పిదం. దీనివల్ల వృద్ధులు, సామాన్యులు నడకకు దూరమై అనారోగ్యం పాలవుతారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దేశంలో ఎక్కడా వాకర్స్‌పై పన్ను లేదు. విశాఖలో కాలుష్య నివారణపై దృష్టి పెట్టడం లేదు. ప్రైవేటు సంస్థలకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారు. ఎకరం 99 పైసలకే దారాదత్తం చేస్తున్నారు. పార్కులు, స్టేడియంల్లో సౌకర్యాలు మెరుగు పరచాల్సింది పోయి పన్నులు వసూలు చేయడం తగదు’ అని విశాఖ అపార్ట్‌మెంట్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (వార్వా) అధ్యక్షుడు ఎన్‌.ప్రకాశరావు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి’తో అన్నారు.

సీపీఐ(ఎం) మాజీ ఫ్లోర్‌ లీడర్‌ బి. గంగారావు

విశాఖలో నడిస్తే పన్ను కట్టాలా?
విశాఖలో నడిచినందుకు పన్ను కట్టమంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం? విద్యార్థులు వ్యాయామం చేసుకోవాలన్నా యూజర్‌ చార్జీలు చెల్లించాల్సి రావడం దుర్మార్గం. వీరు క్రీడలు ఆడుకోవాలంటే ఏటా రూ.15 వేలు చెల్లించమనడం దారుణం. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడైనా ఉందా? కూటమి ప్రభుత్వం విశాఖ వాసులకిచ్చే గొప్ప బహుమతి ఇదా? విశాఖ వాసులు జీవీఎంసీకి వివిధ రూపాల్లో ఏటా రూ.4,200 కోట్లు పన్నులు చెల్లిస్తున్నారు. జీవీఎంసీ ప్రజా వ్యతిరేక యూజర్‌ చార్జీల వసూలు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. దీనిపై కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు స్పందించాలి’ అని సీపీఐ(ఎం) మాజీ ఫ్లోర్‌ లీడర్‌ బి.గంగారావు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధిలో చెప్పారు.

వాసుపల్లి గణేష్‌కుమార్‌

రద్దు చేయకపోతే ఉద్యమిస్తాం..
‘విశాఖలోని పార్కులు, స్టేడియాల్లో వాకర్స్‌పై మోపుతున్న యూజర్‌ చార్జీల వసూలు చర్యలను ఉపసంహరించుకోకపోతే ఉద్యమిస్తాం. ఏటా వాకర్స్‌ నుంచి రూ.720, క్రీడా విద్యార్థుల నుంచి రూ.15 వేల వరకు వసూలుకు ప్రయత్నించడం తగదు. నడక మీద కూడా పన్ను విధించడం విడ్డూరం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో వీటిలో ఉచితంగానే అనుమతించాం. ప్రజల ఆస్తిగా ఉండాల్సిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను చంద్రబాబు ప్రైవేటు సంస్థగా మార్చేశారు. తక్షణమే నడక పన్నును రద్దు చేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.
Read More
Next Story