ఫామ్-6 మార్పులపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు
x

ఫామ్-6 మార్పులపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు

సర్ పై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న న్యాయస్థానం


ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణం సస్పెండ్ చేయాలన్న పిటిషనర్ల డిమాండ్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే, కేసును మాత్రం పక్కన పెట్టలేదు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అసలు రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫామ్-6లో చేసిన మార్పులపై కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది.

ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా ఫామ్-6లో కొత్త డిక్లరేషన్‌ను చేర్చారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వ్యక్తులు.. గతంలో జరిగిన ఎస్ఐఆర్‌లో తాము లేదా తమ తల్లిదండ్రులు మ్యాప్ అయ్యారా అనే వివరాలను అందులో వెల్లడించాల్సి ఉంటుంది.

ఈ మార్పుపై ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పిటిషన్లలో పేర్కొన్నారు. 1960 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్‌లో మార్పులు చేయకుండా ఇలాంటి కొత్త నిబంధనను చేర్చడం సాధ్యమా అనే అంశాన్ని వారు ప్రశ్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు, సెప్టెంబర్ 26న ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనలో.. బీహార్ ఎస్ఐఆర్‌కు సంబంధించి మే 2026లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సవరించిన డిక్లరేషన్‌ను కోర్టు ఆమోదించిందని పేర్కొంది.

అయితే దీనిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. బీహార్ ఎస్ఐఆర్‌పై విచారణ జరిగిన సమయంలో ఈ మార్పులను తాము పరిశీలించలేదని తెలిపింది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే ఫామ్-6లో ఈ మార్పులు తీసుకొచ్చినట్లు కోర్టు పేర్కొంది.

దీంతో ఈ సవరించిన ఫామ్-6ను సుప్రీంకోర్టు ఆమోదించిందన్న వాదనను కోర్టు అంగీకరించలేదు. ఈ మార్పులు అసలు ఎవరు చేశారు? ఎవరి అనుమతితో చేశారు? అనే విషయాలను తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం నుంచి ఒరిజినల్ రికార్డులను కోరింది.

అదే సమయంలో జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపైనా ధర్మాసనం దృష్టి పెట్టింది. వివాదాస్పద నిర్ణయాలు ఆయన స్వతంత్రంగా తీసుకున్నారా, లేక మొత్తం ఎన్నికల సంఘం ఏకాభిప్రాయం లేదా మెజారిటీతో ఆమోదించిందా అనే అంశాన్ని కూడా రికార్డుల ఆధారంగా పరిశీలించనుంది.

అయితే ఈ దశలో జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న మధ్యంతర అభ్యర్థనకు కోర్టు అంగీకరించలేదు. ఆరోపణలపై ఎన్నికల సంఘం నుంచి సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది.

చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లు రికార్డుల పరిశీలనలో తేలితే, దానిపై తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే అలాంటి నిర్ణయాల అమలును నిలిపివేయడం లేదా వాటిని రద్దు చేయడం వంటి అంశాలను కూడా పరిశీలించవచ్చని తెలిపింది.

ఈ కేసులో ఒక పిటిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను కేసు తుది పరిష్కారం అయ్యే వరకు సస్పెండ్ చేయాలని కోరారు. మరో పిటిషన్‌లో ఆయనతో పాటు ఇతర అధికారులపై విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టు దృష్టి ఎన్నికల సంఘం సమర్పించే రికార్డులు, వివరణలపై ఉంది. వాటిని పరిశీలించిన తర్వాత నిర్ణయాలు నిబంధనలకు అనుగుణంగా తీసుకున్నారా లేదా అన్న అంశంపై కోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.


Read More
Next Story