ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వడగాల్పులు తీవ్రం
x

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వడగాల్పులు తీవ్రం

బుధవారం 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134లో వడగాల్పులు.


రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బుధవారం (ఏప్రిల్ 22) 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 134 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం (ఏప్రిల్ 23) కూడా 51 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 94 మండలాల్లో వడగాల్పులు వీచే సూచనలు ఉన్నాయన్నారు.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 288 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 44.4°C, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.1°C, నెల్లూరు జిల్లా కొమ్మిపాడు మరియు కాకినాడ జిల్లా కరపలో 43.6°C, కడపలో 43.5°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.4°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

రేపు తీవ్ర వడగాల్పులు వీచే జిల్లాలు

- శ్రీకాకుళం: 19 మండలాలు

- విజయనగరం: 21 మండలాలు

- పార్వతీపురం మన్యం: 3 మండలాలు

- అల్లూరి సీతారామరాజు: 4 మండలాలు

- పోలవరం: 5 మండలాలు

- విశాఖపట్నం: 1 మండలం

- అనకాపల్లి: 15 మండలాలు

- కాకినాడ: 6 మండలాలు

- తూర్పు గోదావరి: 2 మండలాలు

ప్రజలకు సూచనలు

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

మరోవైపు వర్షాల సూచన

బుధవారం మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.

ఈ వేడి తీవ్రత కారణంగా ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో బయటకు రాకుండా ఉండాలని, అవసరమైతే తప్పనిసరి పనులు మాత్రమే చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ఏపీఎస్‌డీఎంఏ నిరంతరం పర్యవేక్షిస్తోంది.

Read More
Next Story